వైరల్‌: నో బీర్‌, ఓన్లీ విస్కీ.. వైన్‌ షాప్‌లో మందేసిన కోతి

16 Jul, 2021 14:06 IST|Sakshi

Monkey Alcohol Drinking Video: కోతులు చేసే చేష్టలు మామూలుగా ఉండవు. ఒక్కసారి గుంపులుగా జనావాసంలోకి చొరబడ్డాయంటే అవి చేసే హంగామా అంతా ఇంతా కాదు. ఇక ఇంట్లోకి వచ్చాయంటే వస్తువులన్నీ చిందరవందర అవ్వాల్సిందే. ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క అన్నట్లు ఓ కోతి ఏకంగా ఓ వైన్‌ షాప్‌లోకే దూరింది. అక్కడున్న బీర్‌, వైన్‌ బాటిళ్లను పక్కకు పెట్టి విస్కీ బాటిల్‌ను టార్గెట్‌ చేసింది. ఇంకేముంది హీరోలా విస్కీ బాటిల్‌ను చేతులోకి తీసుకొని దర్జాగా తాగేసింది. ఈ విచిత్ర ఘటన మధ్యప్రదేశ్‌ మాండ్లా జిల్లాలో చోటుచేసుకుంది.

బహమని బంజార్ గ్రామంలో ఓ మద్యం దుకాణం ఉంది. అక్కడికి కొన్ని రోజుల నుంచి ఓ కోతి తరుచుగా వస్తోంది. ఖాళీగా పడి ఉన్న మద్యం సీసాల్లో మిగిలిపోయిన మద్యం చుక్కలను తాగేది.అయితే, ఓ రోజు ఆ కోతి ఏకంగా వైన్‌ షాపులోకే ఎంటర్‌ అయ్యింది. మద్యం దుకాణంలోకి ప్రవేశించిన కోతి కాటన్‌ తెరిచి అందులోంచి వైన్‌ బాటిల్‌ను లాక్కుంది. తరువాత ఓ టెబుల్‌పై దర్జాగా కూర్చొని విస్కీ బాటిల్‌ మూతను నెమ్మదిగా తీసేందుకు ప్రయత్నిస్తుంది. చివరికి మూత ఒపెన్‌ అవ్వడంతో ప్రొఫెషనల్‌ మందుబాబులా గటాగటా తాగేసింది.

అయితే కోతి షాప్‌లోకి చొరబడినప్పటికీ యాజమాని ఎలాంటి కంగారు పడలేదు. అతని పని తను చేసుకుంటూ ఉన్నాడు. మధ్యలో షాప్‌ యాజమాని కోతికి బిస్కెట్‌ కూడా ఇచ్చేందుకు ప్రయత్నించగా వద్దని తిరస్కరించి బాటిల్‌ మొత్తం ఖాళీ చేసి కూర్చుంది. కాగా, కోతి మద్యం సేవించడాన్ని వైన్ షాప్‌కు వచ్చిన పలువురు వీడియో తీశారు. ఆ వీడియోనుఓ వ్యక్తి తన ట్విటర్‌లో షేర్ చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారింది. ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. కోతి విస్కీ తాగడంపై ఆశ్యర్యానికి గురవుతున్నారు.

మరిన్ని వార్తలు