వైరల్‌ వీడియో.. జుట్లు పట్టుకొని కొట్టుకున్న మహిళలు.. ఎందుకో తెలుసా!

15 Sep, 2022 18:50 IST|Sakshi

ముంబై: మహారాష్ట్రలో ఇద్దరు మహిళలు పిచ్చిపిచ్చిగా కొట్టుకున్నారు. నాసిక్‌లో బుధవారం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.  ఇద్దరు మహిళల మధ్య మొదలైన గొడవ.. మాటమాట పెరిగి కొట్టుకునే వరకూ వెళ్లింది. టోల్‌ సిబ్బంది, కారులోని మహిళ  రోడ్డుపై ఇష్టం వచ్చినట్లు కొట్టుకున్నారు. టోల్‌ ఫీజు చెల్లించే విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది.

ముందుగా కారులోని మహిళ బయటకు దిగి టోల్‌గేట్‌ సిబ్బంది చెంప చెళ్లుమనిపించింది. అంతటితో ఆగకుండా ఉద్యోగి చేతులను మెలితిప్పి దాడి చేసింది. దీంతో సిబ్బంది కూడా మహిళపై ఘర్షణకు దిగింది. ఇద్దరూ మరాఠీలో తిట్టుకుంటూ ఘోరంగా కొట్టుకున్నారు. నడిరోడ్డుపై ఒకరి జుట్టు ఒకరు పట్టుకొని చెంపలు వాయించుకున్నారు. ఇంత జరుగుతుంటే అక్కడున్న వారంతా చూస్తూ ఉండిపోయారు.

కొంతమంది ఈ తతంగాన్ని వీడియో తీస్తున్నారే గానీ ఆపేందుకు ప్రత్నించలేదు. ఈ దృశ్యాలన్నీ టోల్‌ప్లాజా వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. 

మరిన్ని వార్తలు