‘చంద్రయాన్‌-3లో ప్రయాణించిన వారికి సెల్యూట్’.. మంత్రి ఆటాడుకుంటున్న నెటిజన్లు

24 Aug, 2023 13:23 IST|Sakshi

అంతరిక్ష ప్రయోగాల్లో భారత్‌ సరికొత్త చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. 140 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలు సాకారం చేస్తూ ఇస్రో ప్రయోగించిన ప్రతిష్టాత్మక చంద్రయాన్‌-3 ప్రయోగం బుధవారం విజయవంతం అయ్యింది. ఇప్పటి వరకు ఏ దేశం అడుగుపెట్టని జాబిల్లి దక్షిణ ధ్రువంపై మువ్వన్నెల జెండా పాతేసింది. చంద్రుడి దక్షిణధ్రువంపై అడుగుపెట్టిన మొదటి దేశంగా భారత్‌ రికార్డు నెలకొల్పింది. 

ల్యాండర్‌తోపాటు రోవర్‌ కూడా క్షేమంగా దిగడంతో దేశ వ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. చివరి దశలో వ్యోమనౌక జాబిల్లిపై కాలు మోపే క్షణాలను టీవీలు, ఫోన్లలో ప్రత్యక్షంగా చూసి ఉద్విగ్నానికి లోనయ్యారు. దేశ, విదేశాల నుంచి ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో చంద్రయాన్‌-కు సంబంధించి రాజస్థాన్‌ మంత్రి విచిత్ర వ్యాఖ్యలు చేశారు. 
చదవండి: Chandrayaan-3: ఆ సంతోషం మాటల్లో చెప్పలేం.. ఇస్రో చైర్మన్‌

రాష్ట్ర క్రీడా, యువజన వ్యవహారాలశాఖ మంత్రి అశోక్‌ చందన్‌.. చంద్రుడి మీదకు వెళ్లిన ప్రయాణికులకు సెల్యూట్‌ అంటూ నోరూజారారు.. ‘చంద్రుడిపై సురక్షితంగా కాలుమోపాం.. అందులో ప్రయణించిన వారికి సెల్యూట్‌. సైన్స్‌ స్పేస్‌ రీసెర్చ్‌లో ఇండియా మరో అడుగు ముందుకేసింది. మిషన్‌ సక్సెస్‌ అయిన సందర్భంగా భారత పౌరులందరికీ కూడా శుభాకాంక్షలు చెబుతున్నా‌’ అని మీడియాతో ముందు తెలిపారు. ఈ వ్యాఖ్యలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

కాగా చంద్రయాన్-3 మానవ రహిత మిషన్‌. ఇస్రో ఇందులో కేవలం విక్రమ్‌ ల్యాండర్‌, ప్రగ్యాన్‌ రోవర్‌ మాత్రమే పంపిన విషయం తెలిసిందే. వ్యోమగాములను రోదసిలోకి పంపలేదు. అయితే మంత్రి స్థానం ఉన్న అశోక్‌ చందన్‌. ప్రయోగం గురించి తెలుసుకోకుండా, సరైన అవగాహన లేకుండా మాట్లాడి ట్రోల్స్‌కు గురవుతున్నారు.దీనిపై నెటిజన్లు జోకులు పేలుస్తూ.. మంత్రికి చురకలంటిస్తున్నారు.

ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్‌-3 వ్యోమనౌక బుధవారం సాయంత్రం 6.04 గంటలకు జాబిల్లిపై ఎలాంటి అవాంతరాలు లేకుండా సాఫ్ట్‌ ల్యాండింగ్‌  చేసింది. విక్రమ్‌ ల్యాండ్‌ అయిన నాలుగు గంటల తర్వాత అంటే రాత్రి 10.04 గంటలకు రోవర్‌ బయటకు వచ్చింది.  ల్యాండర్‌లో పంపించిన రోవర్‌ పేరు ప్రగ్యాన్‌. ప్రస్తుతం జాబిల్లిపై అడుగుపెట్టిన రోవర్‌ ‘ప్రజ్ఞాన్‌’.. అక్కడ తన అధ్యయనం మొదలుపెట్టింది. చంద్రుడిపై వాతావరణ, నీటి వనరులు, భూగర్భ శాస్త్రం, భవిష్యత్తులో మానవ మనుగడకు సామర్థ్యాలను అధ్యయనం చేయనుంది.
చదవండి: చంద్రయాన్‌ ల్యాండర్‌.. మెరిసేదంతా బంగారమేనా..

మరిన్ని వార్తలు