గద్దె దించేందుకు టీఎంసీ అసెంబ్లీ తీర్మానం!

25 Jun, 2021 11:31 IST|Sakshi

పశ్చిమ బెంగాల్‌ పాలనలో కేంద్రం జోక్యానికి చెక్‌ పెట్టేందుకు, రివెంజ్‌ దిశగా మమతా బెనర్జీ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా గవర్నర్‌ ధన్‌ఖర్‌ను గద్దెదించేందుకు ఏకంగా అసెంబ్లీలో తీర్మానం చేయబోతున్నట్లు సమాచారం. 

కోల్‌కతా: పాలనాపరంగా పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ జగ్దీప్‌ ధన్‌ఖర్‌కు, ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మొదటి నుంచే పొసగడం లేదు.ఈ  క్రమంలో ఆయన బహిరంగంగానే దీదీ తీరును, పాలనను తప్పుబడుతూ వస్తున్నాడు. ఇంకోవైపు అసెంబ్లీ ఎన్నికల టైం నుంచి ఆ విమర్శలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఈ తరుణంలో ఆయన్ని గవర్నర్‌ గిరి నుంచి సాగనంపేందుకు దీదీ పాచికలు కదుపుతోంది. 

ధన్‌ఖర్‌ను సాగనంపే విషయంపై ఇదివరకే మమతా, బిమన్‌ బెనర్జీతో చర్చించినట్లు సమాచారం. జులై 2 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ఆ సమావేశాల్లో మొదటి సెషన్‌లో.. అది కూడా గవర్నర్‌ స్పీచ్‌ అనంతరమే తీర్మానం ప్రవేశపెట్టాలని, తద్వారా తమ పవర్‌ ఏంటో  చూపించాలని టీఎంసీ నేతలు ఉవ్విళ్లూరుతున్నారు.

లోక్‌సభ స్పీకర్‌కీ..
గవర్నర్‌ ధన్‌ఖర్‌ బెంగాల్‌ అసెంబ్లీ వ్యవహారాల్లో అతిగా జోక్యం చేసుకుంటున్నారంటూ స్పీకర్‌ బిమన్‌ బెనర్జీ, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు మంగళవారం ఫిర్యాదు చేశారు. ‘పెండింగ్‌ బిల్లులు సంతకం చేయకుండా జాప్యం చేస్తున్నాడని, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా.. అనైతికంగా గవర్నర్‌ తీరు ఉందని’ ఫిర్యాదులో బిమన్‌ పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఇక టీఎంసీ సీనియర్‌ నేతలు కూడా గవర్నర్‌ను దించేయడమే ఎజెండాగా పెట్టుకుని అసెంబ్లీలో అడుగుపెట్టాలని నిర్నయించుకున్నారు. ఒక పార్టీకి ప్రతినిధిగా వ్యవహరిస్తున్న గవర్నర్‌ తీరు హేయనీయంగా ఉందంటూ వరుసగా టీవీ ఛానెల్స్‌ డిబెట్‌లలో పాల్గొంటున్నారు. ఇక బెంగాల్‌లో శాంతిభద్రతలు కాపాడుతున్న గవర్నర్‌ను.. తామూ కాపాడుకునేందుకు ప్రయత్నిస్తామని బీజేపీ స్టేట్‌ ఛీఫ్‌ దిలీప్‌ ఘోష్‌ చెబుతున్నాడు.

మరిన్ని వార్తలు