దేశంలో ఎవరికి అత్యధిక రిజర్వేషన్లు?

21 Oct, 2023 13:06 IST|Sakshi

గతకొంతకాలంగా మరాఠా రిజర్వేషన్‌ ఆందోళనలతో మహారాష్ట్ర అట్టుడుకుతోంది. ఇదేవిధంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో రిజర్వేషన్లకు సంబంధించి అనేక ఉద్యమాలు నడుస్తున్నాయి. రాజకీయ పార్టీలు తమ స్వార్థం కోసం రిజర్వేషన్ల అంశాన్ని అనువుగా మలచుకుంటున్నాయి. ఇటువంటి ప్రస్తుత పరిస్థితిలో దేశంలో అత్యధిక రిజర్వేషన్లు ఎవరికి లభిస్తున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. 

నిజానికి దేశంలో రిజర్వేషన్లకంటూ ఒక పరిమితి ఉంది. చట్ట ప్రకారం రిజర్వేషన్ల పరిమితి 50 శాతానికి మించకూడదు. అయితే చాలా రాష్ట్రాలు ఈ పరిమితిని దాటాయి. వివిధ వర్గాల ఓటు బ్యాంకును దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగాలు, ఇతర అంశాలలో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పిస్తున్నాయి. ఈ విషయమై సుప్రీంకోర్టులో చర్చ కూడా నడుస్తోంది.

దేశంలో కుల ఆధారిత రిజర్వేషన్ల పరిమితి విషయానికి వస్తే కేంద్ర ప్రభుత్వం ప్రతి వర్గానికీ వేర్వేరు రిజర్వేషన్లను నిర్ణయించింది. దీని ప్రకారం ఇతర వెనుకబడిన తరగతులకు అంటే ఓబీసీకి 27శాతం, షెడ్యూల్డ్ కులాలకు (ఎస్‌సీ) 15శాతం, షెడ్యూల్డ్ తెగలకు (ఎస్‌టీ) 7.5శాతం మేరకు గరిష్ట రిజర్వేషన్లు కల్పించారు. అలాగే ఆర్థికంగా వెనుకబడిన వారికి అంటే ఈడబ్ల్యుఎస్‌ వర్గానికి 10శాతం రిజర్వేషన్లు కల్పించారు. జాతీయ స్థాయిలో ఏ ఉద్యోగానికైనా ఇదే రిజర్వేషన్ విధానాన్ని అనుసరిస్తారు.

ఇక మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్‌ విషయానికొస్తే, మహారాష్ట్ర మొత్తం జనాభాలో దాదాపు మరాఠా జనాభా 33 శాతం. పలువురు ముఖ్యమంత్రులు కూడా ఈ వర్గానికి చెందినవారే. ప్రస్తుత సీఎం ఏక్‌నాథ్ షిండే కూడా మరాఠా వర్గానికి చెందినవారే. తమ జనాభాను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో తమకు రిజర్వేషన్లు కల్పించాలని మరాఠాలు డిమాండ్ చేస్తున్నారు. మరాఠాలు తమకు ఓబీసీ హోదా ఇవ్వాలని చాలాకాలంగా కోరుతున్నారు. 
ఇది కూడా చదవండి: అత్యంత క్రూరమైన ‘ఉగాండా కసాయి’ ఎవరు? మృతదేహాలతో ఏం చేసేవాడు?

మరిన్ని వార్తలు