Chhattisgarh: కిడ్నీ దానంతో భర్త ప్రాణాలు కాపాడిన భార్య!

14 Dec, 2023 09:03 IST|Sakshi

వివాహమైన తరువాత ఒకరికి ఒకరు అనే విధంగా, ప్రాణంలో ప్రాణంగా కలిసిమెలసి జీవించేవారే నిజమైన భార్యాభర్తలు. ఇలాంటివారిలో ఒకరికి ఏదైనా కష్టం వస్తే మరొకరు తల్లడిల్లిపోతారు. అలాంటి పరిస్థితిలో అవతలి వ్యక్తి కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధం అవుతారు. 

ఛత్తీస్‌గఢ్‌లోని బతౌలీలో భర్త కోసం భార్య చేసిన త్యాగం ఇప్పుడు అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. వివరాల్లోకి వెళితే బతౌలీలోని భారత్ మాతా చౌక్ నివాసి, హార్డ్‌వేర్ దుకాణం నిర్వాహకుడు ఆయుష్‌ అగర్వాల్‌ గత కొన్నేళ్లుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. ఈ నేపధ్యంలో అతని భార్య తన కిడ్నీని దానం చేసి భర్త ప్రాణాలను నిలబెట్టింది. ఈ కిడ్నీ మార్పిడి చికిత్స తర్వాత ఆయుష్‌ అగర్వాల్‌ అనారోగ్యం నుంచి కోలుకున్నారు. 

ఆయుష్ అగర్వాల్‌ గత కొన్నేళ్లుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. దీంతో ప్రతి 15 రోజులకోసారి డయాలసిస్ చేయించుకోవాల్సి వచ్చేది. వైద్యులు కిడ్నీ మార్పిడి చేయాలని ఆయుష్‌కు సూచించారు. అయితే నిబంధనల ప్రకారం రక్త సంబంధీకుల నుంచి మాత్రమే కిడ్నీ తీసుకోవలసి ఉంటుంది. అతని భార్య నిషా అగర్వాల్ తన కిడ్నీని భర్తకు దానం చేసేందుకు ముందుకు వచ్చింది. ఆయుష్ అగర్వాల్ ముంబైలోని ప్రముఖ ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి చికిత్స చేయించుకున్నారు. మొరుగైన వైద్యం కోసం వైద్యుల పర్యవేక్షణలో నాలుగు నెలల ఉన్నారు. 

అనారోగ్యం నుంచి కోలుకోవడంతో భార్యాభర్తలిద్దరూ ముంబై నుంచి తిరిగి బతౌలీ చేరుకున్నారు.  త్వరలోనే తిరిగి తన వ్యాపారాన్ని ప్రారంభించనున్నానని ఆయుష్‌ తెలిపారు. తన భార్య తనకు కొత్త జీవితాన్ని ప్రసాదించిందని ఆనందంగా  తెలిపారు. భర్తకు కిడ్నీని దానం చేసిన నిషా అగర్వాల్‌ అభినందనీయురాలని వైద్యులు కొనియాడారు.
ఇది కూడా చదవండి: మంచుకురిసే వేళలో.. వాతావరణశాఖ హెచ్చరికలు!

>
మరిన్ని వార్తలు