Viral Video: ‘వ్యాక్సిన్‌ వద్దంటే వద్దు.. వెళ్లకపోతే పాముతో కరిపిస్తా’

18 Oct, 2021 16:05 IST|Sakshi

జైపూర్‌: కరోనా మహమ్మారి కట్టడికి వ్యాక్సినే కీలకమనీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యాయి. అయితే కొం‍దరు వ్యాక్సిన్‌పై వస్తున్న అసత్య ప్రచారాలను,అపోహలను నమ్ముతూ టీకా వేసుకోవడానికి ససేమిరా అంటున్నారు. తాజాగా వాక్సిన్‌ వేయటానికి వచ్చిన మెడికల్‌ సిబ్బందిని పాముతో కాటేయిస్తానని ఓ మహిళ బెదిరించింది. ఈ వింత ఘటన రాజస్తాన్‌లోని అజ్మిర్‌ జిల్లాలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. కొద్దిరోజుల క్రితం అజ్మిర్‌ జిల్లాలోని నాగేలావ్‌ గ్రామంలో కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ డ్రైవ్‌ నిర్వహించారు. ఆరోగ్య కార్యకర్తలు వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని పూర్తి చేసేందుకు ఇంటి ఇంటికి తిరిగి వ్యాక్సిన్‌ వేస్తున్నారు. ఈ నేపథ్యంలో కమలా దేవీ అనే మహిళ ఇంటికి వెళ్లి టీకా వేయించుకోవాలని కోరారు. అయితే వ్యాక్సిన్‌పై అపోహ ఉండడంతో ఆమె టీకా వేసుకోవడానికి అంగీకరించలేదు. వ్యాక్సిన్‌ సిబ్బంది ఆమె నచ్చజెప్పే ప్రయత్నం చేసేసరికి తన ఇంట్లోని బుట్టలో ఉన్న పాముతో వారిని బెదిరించింది. ‘‘ నాకు వ్యాక్సిన్‌ వద్దు ఏమీ వద్దు.. ముందు ఇక్కడి నుంచి పొండి.. లేదంటే పాముతో కరిపిస్తా’’ అంటూ వారిని భయపెట్టింది.

సమాచారం అందుకున్న స్థానికులు అక్కడికి చేరుకున్నారు. వైద్య బృందంతో పాటు స్థానికులు కూడా టీకా తీసుకోవడం వల ప్రయోజనాలను వివరించడంతో కమలా దేవి టీకా వేయించుకోవడానికి అంగీకరించింది. దీని తర్వాత, ఆ ప్రాంతంలోని 20 మందికి కోవిడ్ -19 టీకాలు వేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు మహిళ ప్రవర్తన చూసి నోరెళ్ల బెడుతున్నారు.

మరిన్ని వార్తలు