World Heart Day: లైట్‌ తీసుకోవద్దు, మరి ఏం చేయాలి?

29 Sep, 2021 12:08 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గత 20 ఏళ్లలో యువతలో గుండెపోటు 200 శాతం పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా గుండెపోటుతో మరణించేవారిలో దాదాపు 50శాతం మంది భారతీయులే. మరీ ముఖ్యంగా కోవిడ్-19 కారణంగా కార్డియాక్ అరెస్ట్ కేసులు పెరుగుతుండటం గమనార్హం. గుండె సమస్యల కారణంగా 40-50 సంవత్సరాల వయస్సు వారే ఎక్కువగా చనిపోతున్నారు.  ఫిట్‌గా,  సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్లు కనిపిస్తూ కూడా గుండెపోటుతో చనిపోతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇటీవలి కాలంలో నటుడు సిద్ధార్థ్ శుక్లా ,  నటి మందిరా బేడీ  భర్త రాజ్ కౌశల్ వంటి ప్రముఖుల మరణాలే ఇందుకు ఉదాహరణ.  

ఆహార అలవాట్లు జీవనశైలిలో మార్పులే కారణమని అర్థం చేసుకోవడం ముఖ్యం. మన శరీరంలో అతి కీలకమైన గుండెకు ఒక్కసారి సమస్య వచ్చిందంటే.. దాన్ని సరి చేయడం అంత తేలిక కాదు. అందుకే నివారణే ముఖ్యం. రోజులు, నెలలు సంవత్సరాలబడి నిమిషానికి 70-80 సార్లు కొట్టుకునే గుండెను లైట్‌ తీసుకుంటే మూల్యం చెల్లించక తప్పదు. మన వాహనాల ఇంజీన్లను ఎలారిపేర్‌ చేస్తా‍మో శుభ్రం చేసుకుంటామో,దాని కోసం ఎంత శ్రద్ధ పెడతామో మన హృదయంపై అంతకంటే ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. టైం లేదు లాంటి కుంటి సాకులు చెబితే తగిన మూల్యం చెల్లించుకోక​ తప్పదు. టీవీ చూసేందుకు, పేపర్‌ చదివేందుకు, స్మార్ట్‌ఫోన్‌ కోసమే కాదు వ్యాయామంకోసం కూడా కొంత సమయాన్ని వెచ్చించాల్సిందే.

గుండె జబ్బులకు ఒక ముఖ్యమైన కారకం ఒత్తిడి. తీవ్రమైన ఒత్తిడి గుండెపోటుకు దారితీస్తుందని. దీర్ఘకాలిక ఒత్తిడి గుండె ధమనుల లోపలి పొరల్లో వాపుకు కారణమవుతుంది.  అలాగే రక్తం గడ్డకట్టడంతో పాటు గుండెపోటుకు దారితీస్తుందని  ప్రఖ్యాత కార్డియాలజిస్ట్‌లు చెబుతున్నారు.

పోటీ ప్రపంచంలో కాలంతో పరిగెడుతున్న క్రమంలో జీవనశైలిలో స్పష్టమైన మార్పులతోపాటు ధూమపానం పెరుగుదలలాంటి ముఖ్యమైన మార్పులను మనం మర్చి పోకూడదు, అంటే  వేళా పాళా లేని ఆహార అలవాట్లకు తోడు  ఫాస్ట్ ఫుడ్ కల్చర్‌, విశ్రాంతి తీసుకోవడానికి సమయం లేదు, తీవ్ర ఒత్తిడి, డెడ్‌లైన్‌లు. దీనికి తోడు కాలుష్యం ముఖ్యంగా మెట్రో నగరాల్లో తన ప్రభావాన్ని భారీగానే చూపుతోంది. కాలుష్యంతో ధమనులవాపు, గుండెపోటు ప్రమాదాన్ని రెట్టింపు చేస్తుంది. ప్రతి భారతీయుడు యూరోపియన్‌ల కంటే మూడు రెట్లు, చైనీయుల కంటే ఆరు రెట్లు ఎక్కువ, జపనీస్ కంటే ఇరవై రెట్లు ఎక్కువగా గుండెపోటుకు గురవుతున్నారు. అందులోనూ మధుమేహం ఉన్న వ్యక్తికి గుండెపోటు వచ్చే ప్రమాదం ఆరు రెట్లు ఎక్కువ.

ఆరోగ్యకరమైన గుండె కోసం 
వారానికి ఐదు సార్లు రోజుకు 45 నిమిషాలు వేగంగా నడవడంవల్ల గుండెపోటు వచ్చే అవకాశాలను 20శాతం తగ్గించవచ్చు. ఒకేసారి 45 నిమిషాలు  సాధ్యం కాకపోయినా, ఉదయం 25 నిమిషాలు,  సాయంత్రం 25 నిమిషాలుగా కూడా డివైడ్‌ చేసుకోవచ్చు.

ఒత్తిడిని జయించి, గుండె ఆరోగ్యంగా  ఉండాలంటే మంచి వ్యాయామం కావాలి.  గుండె ఆరోగ్యానికి నడక ఉత్తమమైంది. వాకింగ్‌, సైక్లింగ్‌తోపాటు యోగా, ఏరోబిక్స్‌ను మిక్స్‌ చేసి ఎక్సర్‌సైజ్‌ చేయవచ్చు.

లిఫ్ట్ బదులు, మెట్లు ఎక్కండి. గుండె ఆరోగ్యంగా ఉండటానికి ఇది మరో బెస్ట్‌ ఐడియా. టీ విరామాన్ని వ్యాయామ బ్రేక్‌గా మార్చుకోవడం మరో మార్గం. ఇందుకోసం ప్రతి ఆఫీసులో ట్రెడ్‌మిల్‌ ఏర్పాటు చేసుకోండి. 

అయితే రోజూ 10 నుండి -20కి.మీ  రన్నింగ్ లేదా జాగింగ్‌కి చేస్తే గుండెకు, శరీరానికి హానికరం ఇది కేవలం బరువు తగ్గడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. జిమ్‌లో విపరీతంగా  కసరత్తు చేసి చక్కటి బాడీబిల్డింగ్‌  పెంచుకున్నంత మాత్రాన గుండె ఆరోగ్యంగా ఉన్నట్టు కాదు అనేది గమనించాల్సిన ముఖ్య అంశం.

25 శాతం గుండె జబ్బులకు ఎలాంటి లక్షణాలు కనిపించడంలేదు. 30-40శాతం మంది ఎలాంటి బ్లాక్స్‌ లేకుండానే గుండెపోటుకు గురవుతున్నారు. కుటుంబంలో ఎవరికైనా  60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సులో గుండెపోటు వచ్చినా,  ఆకస్మిక మరణం సంభవించినా ఆయా కుటుంబాల్లోని వారికి గుండె సమస్య  వచ్చే ప్రమాదం ఎక్కువ ఉంది. అలాగే మధుమేహం, రక్తపోటుతో బాధపడేవారు, ధూమపానం అలవాటు ఉన్నవారు రెగ్యులర్ చెకప్స్ చేయించు కోవాలి. ఇది 20 సంవత్సరాల వయస్సులోనే మొదలు కావాలి. 30 సంవత్సరాల వయస్సులోపు వారు ప్రతి సంవత్సరం  బ్లడ్‌ కొలెస్ట్రాల్ స్థాయిలను చెక్‌ చేయించుకోవాలి.

మరిన్ని వార్తలు