వైద్యం నుంచి ఐఏఎస్‌ వైపు..

24 May, 2023 12:58 IST|Sakshi
దీప్తికి స్వీట్‌ తినిపిస్తున్న భర్త డాక్టర్‌ ప్రవీణ్‌

వైద్యురాలిగా గిరిజనుల సమస్యలు కదిలించాయి

కోవిడ్‌ సోకినా చలించలేదు

విద్యావైద్య రంగాలపైనే ప్రధాన దృష్టి సారిస్తా..

సివిల్స్‌ ర్యాంకర్‌ దీప్తి చౌహాన్‌

నిజామాబాద్‌ అర్బన్‌ :కేవలం వైద్య సేవలతోనే ఆమె సంతృప్తి చెందలేదు. అన్ని వర్గాల ప్రజలకు మంచి పౌరసేవలు అందించాలనే లక్ష్యంతో వైద్య వృత్తిని వదిలి లక్ష్య సాధనతో ఐఏఎస్‌ సాధించారు నిజామాబాద్‌ నగరానికి చెంన సభావత్‌ దీప్తి చౌహాన్‌. మంగళవారం వెలువడిన సివిల్స్‌ ఫలితాల్లో ఆమె ఆలిండి యా 630 ర్యాంకు సాధించారు. ప్రిపరేషన్‌ సమయంలో కోవిడ్‌ మానసికంగా ఇబ్బందులకు గురిచేసినా అమె కుంగిపోలేదు. మామయ్య వెంకటయ్య, భర్త డాక్టర్‌ ప్రవీణ్‌కు ఆమెకు ప్రోత్సాహాన్ని అందజేశారు. వెంకటయ్య నిజామాబాద్‌ ఆర్డీవోగా పనిచేసి రిటైర్డు అయ్యారు. ప్రవీణ్‌ హైదరాబాద్‌లో ఎండీ ఆర్థో వైద్యునిగా పనిచేస్తున్నారు.

వీరి కుటుంబం నగరంలోని షిరిడి సాయి కృపానగర్‌లో నివాసం ఉంటోంది. దీప్తి తల్లిదండ్రులు కిషన్‌ లాల్‌, చంద్రకళ నాగర్‌ కర్నూలు జిల్లా లింగాల గ్రామానికి చెందినవారు. కిషన్‌లాల్‌ గ్రామీణ బ్యాంకు మేనేజర్‌గా, తల్లి ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. దీప్తి పదవ తరగతి వనపర్తిలో అభ్యసించారు. అనంతరం హైదరాబాద్‌లో శ్రీ చైతన్య జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ చదువు పూర్తి చేశారు. అదిలాబాద్‌లోని రిమ్స్‌ మెడికల్‌ కళాశాలలో 2017 సంవత్సరంలో ఎంబీబీఎస్‌ పూర్తి చేశారు. ఐఏఎస్‌లో మూడు సార్లు విఫలమైన దీప్తి నాలుగో సారి లక్ష్యాన్ని సాధించారు.

ఐఎఎస్‌గా తాను ప్రజలకు ఎంతో ముఖ్యమైన విద్య, వైద్య రంగాలపైనే మొదట దృష్టి సారిస్తానని దీప్తి అన్నారు. డాక్టర్‌గా పనిచేస్తున్నప్పుడు ప్రతిరోజు ఆసుపత్రికి వచ్చే గిరిజనులు వారి స్థితిగతులు తనను కదిలించాయని, వారి సమస్యలను చూసి ప్రజలందరికి మంచి పరిపాలన, సేవలు అందించాలనే ఆలోచన తనలో కలిగిందని చెప్పారు.

మరిన్ని వార్తలు