మన గొప్ప సాంస్కృతిక వారసత్వం.. గర్వపడాలి! రిషి సునాక్‌ దంపతుల గోపూజ వీడియో వైరల్‌

26 Aug, 2022 08:37 IST|Sakshi

లండన్‌: ఎక్స్‌చెకర్ మాజీ ఛాన్సలర్, బ్రిటన్‌ ఎంపీ, భారత సంతతికి చెందిన రిషి సునాక్ బ్రిటన్‌ ప్రధానిగా గెలవాలని భారత ప్రజలతో పాటు ప్రవాస భారతీయులు బలంగా కోరుకుంటున్నారు. ఒకవైపు కన్జర్వేటివ్‌ పార్టీలో తన ప్రత్యర్థి లిజ్‌ ట్రస్‌ కంటే రేసులో వెనుకబడిపోయినప్పటికీ.. సోషల్‌ మీడియాలో మాత్రం రిషి సునాక్‌ గురించి తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది.  

తాజాగా లండన్‌లో రిషి సునాక్‌(42) గోపూజ నిర్వహించారు. భార్య అక్షతా మూర్తితో కలిసి ఓ గోశాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. భార్యాభర్తలిద్దరూ రంగులతో అలంకరించిన ఆవుకు హారతి ఇచ్చి.. పూజలు చేశారు. అది మన గొప్ప సాంస్కృతిక వారసత్వం గురించి మనం గర్వపడాలి అంటూ ఓ ట్విటర్‌ యూజర్‌ ఆ వీడియోను పోస్ట్‌ చేశారు.

ఇదిలా ఉంటే.. లండన్‌ శివారులో జన్మాష్టమి వేడుకల సందర్భంగా భక్తివేదాంత్‌ మనోర్‌లో జరిగిన పూజలకు రిషి సునాక్‌ తన సతీసమేతంగా హాజరయ్యారు. భగవద్గీత తనపై ఎంత ప్రభావం చూపిందన్నది రిషి సునాక్‌ ఈ సందర్భంగా వివరించారని.. మనోర్‌ తన అధికారిక పేజీలో వివరించింది. అంతేకాదు.. స్వయంగా రిషి సునాక్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో ఆ ఫొటోలను ఉంచారు. 

ఇదిలా ఉంటే.. చెకర్‌ ఛాన్స్‌లర్‌గా ఉన్న టైంలో 2020 దీపావళి వేడుకల్లో రిషి సునాక్‌ పాల్గొన్నారు. లాక్‌డౌన్‌ ఆంక్షల నడుమ దీపాలను వెలిగించి వేడుకల్లో ఆయన పాల్గొన్న తీరుపై అక్కడ విమర్శలు ఎదురైనా.. భారత్ నుంచి మాత్రం మంచి మద్దతే లభించింది. ఎక్కడికెళ్లినా భారతీయులు కొందరు తమ సంప్రదాయం, ఆచార వ్యవహారాలను మరిచిపోరని.. రిషి కుటుంబం అందుకు మంచి ఉదాహరణ అని ప్రశంసించారు.

A post shared by Rishi Sunak (@rishisunakmp)

ఇదీ చదవండి: అక్కడ భారత సంతతి వ్యక్తులదే హవా.. 130మందికి కీలక పదవులు

మరిన్ని వార్తలు