సౌదీ అరేబియా, ఈజిప్టులలో ఐఐటీ, ఢిల్లీ క్యాంపస్‌లు

15 Nov, 2021 20:26 IST|Sakshi

దేశంలోనే ప్రతిష్టాత్మకమైన సాంకేతిక విద్యా సంస్థలుగా పేరొందిన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలు సరిహద్దులు చెరిపేసేందుకు రెడీ అవుతున్నాయి. విదేశాల్లో క్యాంపస్‌లు ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నాయి.
ఆ రెండు దేశాలతో మొదలు
ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, న్యూఢిల్లీ విదేశాల్లో క్యాంపస్‌లు ఏర్పాటు చేయనుంది. ఈజిప్టు, సౌదీ అరేబియాలలో క్యాంపస్‌లను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు ఆ దేశ ప్రభుత్వాలతో దౌత్య పరమైన చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చలు కొలిక్కి వస్తే త్వరలోనే ఆ రెండు దేశాల్లో ఐఐటీ క్యాంపస్‌లు అందుబాటులోకి రానున్నాయి.
బాధ్యతలు ఇలా
విదేశాల్లో నెలకొల్పే ఇంజనీరింగ్‌ క్యాంపస్‌లు పూర్తిగా  ఆయా దేశాలకు చెందిన ప్రభుత్వాలు అందించే నిధులతోనే రన్‌ అవుతాయి. అయితే అఫిలియేషన్‌, సిలబస్‌, జాయినింగ్‌ తదితర విషయాల్లో ఐఐటీ ఢిల్లీ బాధ్యత తీసుకుంటుంది. ప్రస్తుతం ఉన్న జేఈఈ కాకుండా అంతర్జాతీయ ప్రమాణాలతో మరో ప్రవేశ పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది. ఇందులో ప్రవేశం పొందే విద్యార్థులు మొదటి ఏడాది ఢిల్లీ క్యాంపస్‌లో చదివిన తర్వాత రెండో ఏడాది ఆయా దేశాల్లో ఉన్న క్యాంపస్‌లలో కోర్సును పూర్తి చేయాల్సి ఉంది.
కొత్త పేరుతో
మన దేశంలో ఇంజనీరింగ్‌ డిగ్రీ నాలుగేళ్ల కోర్సుగా ఉంది. బీఈ లేదా బిటెక్‌ పేరుతో పట్టాలు ఇస్తున్నారు. విదేశీ క్యాంపస్‌లో అందించే కోర్సు బీఈ/బీటెక్‌ కాకుండా మరో కొత్త పేరు పెట్టే యోచనలో ఉన్నారు. గతంలో మారిషస్‌లో క్యాంపస్‌ తెరిచేందుకు ప్రయత్నాలు కొనసాగినా చివరి నిమిషంలో విరమించుకున్నారు. విదేశాల్లో ఐఐటీ క్యాంపస్‌లకు సంబంధించిన సమాచారం ఓ జాతీయ మీడియాలో వచ్చింది. 
ఎన్నారైలకు లాభం
యూరప్‌, అమెరికాలను మినహాయిస్తే మిగిలిన దేశాల్లో విద్యాప్రమాణాలు ఉన్నత స్థాయిలో లేవు. ఈజిప్టు, సౌదీ అరేబియాలలో క్యాంపస్‌లు అందుబాటులోకి వస్తే ఆయా దేశాల్లో ఉ‍న్న విద్యార్థులతో పాటు ఎన్నారైలకు కూడా ఉపయుక్తంగా ఉంటుంది. ఇండియాలో ప్రీమియం ఇన్‌స్టిట్యూట్స్‌గా పేరున్న ఐఐటీలకు గ​‍్లోబల్‌ గుర్తింపు తెచ్చే లక్ష్యంతో ఈ విదేశీ క్యాంపస్‌ ఐడియాను తెర మీదకు తెచ్చారు.

చదవండి:ఆగేదేలే! అమెరికా టూ ఇండియా.. నాన్‌స్టాప్‌ ఫ్లైట్‌ సర్వీసులు..

మరిన్ని వార్తలు