Atlanta: యూఎస్‌ యూనివర్సిటీ అధికారులతో మంత్రి బొత్స  భేటీ

4 Sep, 2023 19:25 IST|Sakshi

ఏపీతో కొలాబ‌రేష‌న్‌పై చ‌ర్చ‌లు

అట్లాంట‌:  ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌త్యేకించి అట‌వీ విశ్వ విద్యాల‌యం (ఫారెస్టు యూనివ‌ర్సిటీ) ఏర్పాటు చేయ‌డానికి రాష్ట్ర ప్ర‌భుత్వం సుముఖంగా ఉంద‌ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి  బొత్స స‌త్య‌నారాయ‌ణ  తెలిపారు. అమెరికాలోని ప‌ర్య‌టిస్తున్న మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ  ఇక్క‌డి అల‌బామాలోని సుప్ర‌సిద్ధ ఆబ‌ర్న్ యూనివ‌ర్సిటీ అధికారుల‌తో భేటీ అయ్యారు.  ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వ విదేశీ విద్యా కో-ఆర్డినేట‌ర్ డాక్ట‌ర్ కుమార్ అన్న‌వ‌ర‌పు.. మంత్రి బొత్స‌కు స్వాగ‌తం ప‌లికి ఆబ‌ర్న్ యూనివర్సిటీ అధికారుల‌ను ప‌రిచ‌యం చేశారు. 

ఏపీ ప్ర‌భుత్వంతో ఈ యూనివ‌ర్సిటీ కొలాబ‌రేష‌న్ కొర‌కు ఆయ‌న అధికారుల‌తో చ‌ర్చ‌లు జ‌రిపారు.  ఈ సంద‌ర్భంగా మంత్రి  బొత్స మాట్లాడుతూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఉన్న‌త విద్య‌కు ఇస్తున్న ప్రాధాన్యం, విద్యా రంగంలో రాష్ట్ర ముఖ్య‌మంత్రి వై.య‌స్‌.జ‌గ‌న్ తీసుకొచ్చిన విప్ల‌వాత్మ‌క మార్పుల గురించి వివ‌రించారు. ఉన్న‌త విద్యారంగాన్ని మ‌రింత ప్రోత్స‌హించడానికి త‌మ ప్ర‌భుత్వం దాదాపు 2600 ప్రొఫెస‌ర్  ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నామ‌ని తెలిపారు.

పాఠ‌శాల విద్య నుంచే ఆంగ్లమాధ్య‌మంలో బోధ‌న‌కు ఏపీ ప్ర‌భుత్వం చేస్తున్న కృషిని వివ‌రించారు. ఏపీ ప్ర‌భుత్వం చేప‌డుతున్న విప్ల‌వాత్మ‌క చ‌ర్య‌ల వ‌ల్ల సాధిస్తున్న ఫ‌లితాల గురించి కూడా మంత్రి బొత్స అక్కడ యూనివ‌ర్సీటీల అధికారుల‌కు వివ‌రించారు.  రాష్ట్ర ప్ర‌భుత్వం ఫారెస్టు యూనివ‌ర్సిటీని ఏర్పాటు చేయ‌డానికి సిద్ధంగా ఉంద‌ని, ఈ యూనివ‌ర్సిటీ అభివృద్ధికి ఆబ‌ర్న్ యూనివ‌ర్సిటీ అధికారుల స‌హాయ స‌హ‌కారాలు, సూచ‌న‌లు త‌ప్పకుండా తీసుకుంటామ‌ని తెలిపారు.   

వ్యాక్సిన్ ప‌రిశోధ‌న‌లో స‌హ‌కారం 
వ్యాక్సిన్ల అభివృద్ధి ప‌రిశోధ‌న‌, కేస్  స్ట‌డీస్ రంగాల్లో విశేష‌మైన కృషి చేసిన అట్లాంటాలోని సుప్ర‌సిద్ధ ఎమ‌రే యూనివ‌ర్సిటీ అధికారులు మాట్లాడుతూ వ్యాక్సిన్ ప‌రిశోధ‌న‌కు కేస్ స్ట‌డీస్‌కు సంబంధించి ఏపీతో క‌లిసి ప‌నిచేయ‌డానికి తాము సిద్ధంగా ఉన్నామ‌ని చెప్పారు.  అమెరికాలోని సుప్ర‌సిద్ధ యూనివిర్స‌టీల‌తో కొల‌బొరేష‌న్‌కు ఏపీ ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌ని మంత్రి బొత్స తెలిపారు.  

ప్రొఫెస‌ర్ అమ‌రాతో భేటీ
అమెరికాలో వ్యాక్సిన్ గురుగా సుప్ర‌సిద్ధులైన ఎమ‌రే యూనివ‌ర్సిటీ ప్రొఫెస‌ర్  రామారావు అమ‌రాతో మంత్రి బొత్స భేటీ అయ్యారు. ఈ భేటీలో  ఏపీలో వ్యాక్సిన్ అభివృద్ధికి గ‌ల సాధ్యాసాధ్యాల గురించి మంత్రి చ‌ర్చించారు.  ఈ ప‌ర్య‌ట‌న‌లో ఆబ‌ర్న్ యూనివ‌ర్సిటీ ప్రొఫెస‌ర్ అల‌వ‌ల‌పాటి జాన‌కీరామిరెడ్డి, ఆంధ‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ అమెరికా రెప్ర‌జెంటేటివ్ ర‌త్నాక‌ర్ పండుగ‌ల త‌దిత‌రులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు