అతివకు ఆసరా

25 Mar, 2023 02:08 IST|Sakshi

సాక్షి, నరసరావుపేట: తన సుదీర్ఘ పాదయాత్రలో భాగంగా డ్వాక్రా అక్కాచెల్లెమ్మలకు రుణమాఫీ చేస్తానన్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీ మేరకు వైఎస్సార్‌ ఆసరా పథకాన్ని ప్రవేశపెట్టారు. గత సార్వత్రిక ఎన్నికలు (11–04–2019) నాటికి వారి సంఘాలకు బ్యాంకుల్లో ఉన్న రుణాన్ని నాలుగు విడతల్లో మాఫీ చేస్తానని మాట ఇచ్చారు. అందులో భాగంగా మూడో విడత చెల్లింపులు నేడు ప్రారంభం కానున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏలూరు జిల్లా దెందులూరులో నగదు జమను ప్రారంభించనున్నారు. పల్నాడు కలెక్టరేట్‌లో జరిగే కార్యక్రమంలో జిల్లా ప్రజాప్రతినిధులు, కలెక్టర్‌, జేసీ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. ఇప్పటికే సెప్టెంబర్‌ 11, 2020న తొలి విడతలో భాగంగా 25,034 సంఘాలకు రూ.190.21 కోట్ల చెల్లింపులు పూర్తి చేశారు. రెండో విడతలో భాగంగా అక్టోబర్‌ 7, 2021న 25,175 సంఘాల్లోని మహిళలకు రూ.192.32 కోట్లు జమ చేసింది. ఇప్పటి వరకు మొత్తం రెండు విడతల్లో పల్నాడులోని అక్కచెల్లెమ్మల ఖాతాల్లో రూ.382.53 కోట్లు జమైంది. జిల్లాలోని అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో వైఎస్సార్‌ ఆసరా పథకం లబ్ధిదారుల జాబితాలు ప్రదర్శించి, అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు.

ఏప్రిల్‌ 5 వరకు ఆసరా ఉత్సవాలు..

మహిళల సంక్షేమం కోసం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న ఆసరా పథకం మూడో విడత చెల్లింపుల కార్యక్రమం నియోజకవర్గాల వారీగా ప్రతి మండలంలో ఈ నెల 26వ తేదీ నుంచి ఏప్రిల్‌ 5వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఇందులో ఎమ్మెల్యేలు, ఎంపీలు మొదలు స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ, వార్డు సచివాలయాల్లో అధికారులు మహిళలతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పది రోజులపాటు పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాలు జరగనున్నాయి.

మహిళలకు జీవనోపాధులు..

వైఎస్సార్‌ ఆసరా ద్వారా జమవుతున్న నగదును ఉత్సాహం ఉన్న డ్వాక్రా మహిళలు జీవనోపాధులైన పాడి పరిశ్రమ, రిటైల్‌ అమ్మకాలు, ఇతర ఉత్పత్తుల ద్వారా నెలనెలా ఆదాయం పొందేలా ప్రభుత్వం సహకరించనుంది. ఇందుకోసం అమూల్‌, హిందుస్థాన్‌ యూనిలీవర్‌, ప్రోక్టర్‌ అండ్‌ గ్యాంబల్‌ వంటి బహుళ జాతి సంస్థలతో ఒప్పందం చేసుకుంది. మహిళలు వారికి అనువుగా ఉన్న జీవనోపాధిని ఎంచుకోవచ్చు. ఆయా కంపెనీలు మహిళలకు అవసరమైన శిక్షణ ఇచ్చి జీవనోపాధి ఏర్పాటుకు సహకరిస్తాయి. ఇప్పటికే పల్నాడు జిల్లాలో వెయ్యి మందికిపైగా జీవనోపాధులు కల్పించారు.

మరిన్ని వార్తలు