బీజేపీతో ఆప్‌ ఢీ.. అందుకే సీబీఐ సోదాలు

20 Aug, 2022 15:24 IST|Sakshi
మనీశ్‌ సిసోడియా

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా

మోదీకి ప్రధాన ప్రత్యర్థి కేజ్రీవాలే

న్యూఢిల్లీ: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, ఆమ్‌ ఆద్మీ పార్టీల మధ్య ప్రధాన పోరు ఉంటుందని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా వ్యాఖ్యానించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీకి సరైన ప్రత్యర్థి అరవింద్‌ కేజ్రీవాల్‌ అని పేర్కొన్నారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు రావడంతో సీబీఐ పెద్ద ఎత్తున దాడులు కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో ఆప్‌, బీజేపీ నేతల మధ్య  మాటల యుద్ధం నడుస్తోంది. 

కేజ్రీవాల్‌ అంటే భయంతోనే..
‘బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ స్కామ్‌ గురించి ఆలోచించడం లేదు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీకి ప్రధాన ప్రత్యర్థి అరవింద్ కేజ్రీవాల్‌ అవుతారని బీజేపీ భయపడుతోంద’ని మనీశ్‌ సిసోడియా వ్యాఖ్యానించారు. పూర్తి పారదర్శకంగా ఎక్సైజ్ పాలసీ ఉందని, ఎలాంటి అక్రమాలు జరగలేదన్నారు. 


సీబీఐ అరెస్ట్‌ చేయొచ్చు

తనను సీబీఐ అరెస్ట్‌ చేసే అవకాశముందని సిసోడియా వెల్లడించారు. నిర్బంధాలతో తమ పార్టీ మంచి పనులు చేయకుండా అడ్డుకోలేరని చెప్పారు. ఢిల్లీ ఎడ్యుకేషన్ మోడల్‌ను ప్రశంసిస్తూ న్యూయార్క్ టైమ్స్‌ మొదటి పేజీలో ప్రచురించడంతోనే తమపై మోదీ సర్కారు కక్ష సాధిస్తోందని ఆయన పునరుద్ఘాటించారు.


అసలు సూత్రధారి అరవింద్‌: ఠాకూర్

మద్యం కుంభకోణంలో మనీష్ సిసోడియా నిందితుడు మాత్రమేనని, అసలు సూత్రధారి అరవింద్‌ కేజ్రీవాల్‌ అని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆరోపించారు. డబ్బులు వసూలు చేసి మౌనం దాల్చిన మనీశ్‌ సిసోడియా తన పేరును ‘మనీ-ష్‌’గా మార్చుకోవాలని ఎద్దేవా చేశారు. మోదీకి కేజ్రీవాల్‌ ప్రధాన ప్రత్యర్థి కాదని కొట్టిపారేశారు. 


31 ప్రాంతాల్లో సీబీఐ సోదాలు

ఢిల్లీలోని  సిసోడియా ఇంటితో పాటు, ఏడు రాష్ట్రాల్లోని మరో 31 ప్రాంతాల్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. మద్యం పాలసీ ఉల్లంఘనలపై సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో 15 మందిని నిందితులుగా పేర్కొన్నారు. 11 పేజీల నేరాభియోగ పత్రంలో అవినీతి, నేరపూరిత కుట్ర తదితర అభియోగాలు మోపారు. (క్లిక్: కేంద్రం, ఆప్‌ కుస్తీ)

మరిన్ని వార్తలు