గత లోక్‌సభ ఎన్నికల్లో సరైన వ్యూహం లేకనే.. మరి ఈసారి?

6 Aug, 2022 21:02 IST|Sakshi
ఇంద్రకరణ్‌ రెడ్డి

ఆదివాసులు, సింగరేణి కార్మికులే ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో రాజకీయ నేతల తలరాతలు మారుస్తున్నారు. జిల్లాలో పోడు భూముల విషయంలో అటవీ అధికారులు, ఆదివాసుల మధ్య యుద్ధమే  జరుగుతోంది. అయినా రాష్ట్ర మంత్రులు స్పందించరు. ఆదివాసీ అయిన ఎంపీ స్పందించరు. సింగరేణి కార్మికుల సమస్యలను ఎవరూ పట్టించుకోరు. 

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో  పది అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి..  వీటిలో  ఏడు సెగ్మెంట్లు ఆదిలాబాద్  పార్లమెంటు  పరిధిలోకి, మిగిలిన మూడు నియోజకవర్గాలు  పెద్దపల్లి పార్లమెంటరీ స్థానం పరిదిలోకి వస్తాయి. 2014 అసెంబ్లీ ఎన్నికలలో ఏడు  అసెంబ్లీ సీట్లు సాధించిన గులాబీ పార్టీ...2018 ఎన్నికలలో తొమ్మిది సీట్లలో విజయం సాదించింది. ఒక్క ఆసిఫాబాద్‌లో మాత్రం అతి తక్కువ మెజారటీతో కాంగ్రెస్ అభ్యర్థి  అత్రం సక్కు విజయం సాదించారు. ఆ తర్వాత ఆయన కూడా హస్తానికి హ్యాండిచ్చి కారు పార్టీలో చేరారు. 

అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో సత్తా చాటిన టిఅర్‌ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో చేతులు ఎత్తేసింది. బిజెపి అభ్యర్థి సోయం బాపురావు ఎంపీగా విజయం సాధించారు. ఈ ఓటమి గులాబీ పార్టీని ఉలిక్కిపడేలా  చేసింది. బలం..బలగం లేని కాషాయపార్టీ అభ్యర్థి సోయం విజయం జిల్లాలో సంచలనంగా మారింది. అయితే జిల్లాలో మారుతున్న రాజకీయ పరిణామాలు ఎంపి సోయం బాపురావుకు ప్రతికూలంగా మారుతున్నాయట. సోయంకు గతంలో అదివాసీల్లో ఉన్న పలుకుబడి ఇప్పుడు లేదంటున్నారు. తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేయడంతో ఆ సామాజికవర్గంలో సోయంపై వ్యతిరేకత బాగా పెరిగిందట. అదివాసీల హక్కులను ఎంపీ కాపాడడం లేదని ఆయన జాతి జనులే భావిస్తున్నారట.  వచ్చే ఎన్నికల్లో తనకు పదవీభాగ్యం ఉండదేమో అనే గుబులు ఎంపీలో మొదలైందని జిల్లాలో ప్రచారం జరుగుతోంది.

జిల్లాలోని అనేక ప్రాంతాల్లో అదివాసీలు పోడు భూములు కోసం పోరాటం సాగించారు. కాని ఎంపీ సోయం బాపురావు అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఆదివాసులకు సంఘీబావం అయితే ప్రకటించారు గాని..ఆయా ప్రాంతాలకు వెళ్ళకపోవడంతో అడవిబిడ్డలు తమ ఎంపీపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఈసారి ఆదివాసులు సోయంకు అండగా నిలిచే పరిస్థితులు లేవంటున్నారు. తుడుందెబ్బ సంఘం అద్యక్ష పదవికి రాజీనామా చేసిన సోయం ఉద్యమం నుంచి పక్కకు తప్పుకున్నారని అదివాసీలు ఆగ్రహంతో ఉన్నారట. అయితే సోయం మాత్రం అదివాసీల అదరణ తగ్గినా మోదీ ప్రభావంతో గెలవడం ఖాయమని అంచనాలు వేసుకుంటున్నారు.

రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాష్ట్రానికి మంత్రైనా  నియోజకవర్గానికే పరిమితమై వ్యవహరిస్తున్నారని ఇంద్రకరణ్‌ మీద ఆరోపణలున్నాయి. భూముల కోసం అదివాసీలు ఉద్యమిస్తున్నా  అటవీ శాఖ‌మంత్రిగా ఉండి కనీసం పట్టించుకోవడం లేదని మంత్రి మీద ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని వినిపిస్తోంది. బాసర ట్రిపుల్ ఐటిలో విద్యార్థుల సమస్యలు పరిష్కరించే విషయంలోను..సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం గురించి జిల్లా మంత్రి కనీసం ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్ళలేదంటున్నారు. అదేవిధంగా జిల్లాలోని ఎమ్మెల్యేలందరినీ కలుపుకుని జిల్లాను అభివృద్ధి చేయాల్సిన మంత్రి.. గ్రూప్ లను  పెంచిపోషిస్తున్నారనే అపవాదు ఎదుర్కొంటున్నారు.

మంత్రి తీరు వల్లనే కొందరు పార్టీ మారడానికి సిద్దంగా ఉన్నారని ప్రచారం సాగుతోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో మంత్రి సరైన వ్యూహం   అమలు చేయనందువల్లే బిజెపి అభ్యర్థి సోయం విజయం సాధించారు. ఇంద్రకరణ్‌ ఇలాగే ముందుకు సాగితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సైతం పార్టీకి నష్టం తప్పదని టీఆర్ఎస్ నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
 

మరిన్ని వార్తలు