మేమొస్తే బెంగాల్‌లో పారిశ్రామికీకరణ

8 Apr, 2021 02:56 IST|Sakshi
హౌరా జిల్లా డోంజూర్‌లో రిక్షా కార్మికుని నివాసంలో భోజనం చేస్తున్న కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా హామీ

రాష్ట్రంలో 200 పైగా సీట్లు గెలుస్తాం 

రిక్షావాలా ఇంట్లో షా భోజనం

సింగూరు/హౌరా/కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో వేగంగా పారిశ్రామికీకరణ చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా హామీ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన బుధవారం సింగూరులో భారీ రోడ్‌ షో నిర్వహించారు. భూసేకరణకు వ్యతిరేకంగా గతంలో తీవ్రస్థాయిలో పోరాటం జరిగిన ఇదే ప్రాంతంలో అమిత్‌ షా పారిశ్రామికీకరణ హామీ ఇవ్వడం విశేషం.

తాము అధికారంలోకి రాగానే సింగూరులో చిన్న, మధ్య తరహా, భారీ పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. పరిశ్రమల స్థాపనతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని, బంగాళదుంప రైతులను ఆదుకోవడానికి రూ.500 కోట్లతో ప్రత్యేక నిధిని నెలకొల్పుతామని బీజేపీ మేనిఫెస్టోలో ప్రకటించామని గుర్తుచేశారు. రోడ్‌ షో సందర్భంగా అమిత్‌ షా మీడియాతో మాట్లాడారు. తాము
ద్వేష రాజకీయాలు కాదు, అభివృద్ధి రాజకీయాలు చేస్తామన్నారు.

దీదీ చాలా ఆలస్యం చేశారు
బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత మమతా బెనర్జీ ఎన్నికల ప్రచార సభల్లో హిందూ దేవుళ్లను పూజించడం, చండీ స్తోత్రాలు పారాయణం చేయడాన్ని అమిత్‌ షా స్వగతించారు. అయితే, ఆమె ఇప్పటికే చాలా ఆలస్యం చేశారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో 294 స్థానాలకు గాను బీజేపీ 200కి పైగా స్థానాలు గెలుచుకుంటుందని పునరుద్ఘాటించారు. సింగూరులో బీజేపీ అభ్యర్థిగా రవీంద్రనాథ్‌ భట్టాచార్య(89) పోటీ చేస్తున్నారు. ఆయన గతంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌పై నాలుగు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈసారి టికెట్‌ నిరాకరించడంతో బీజేపీలో చేరారు.

మొదటి 3 దశల్లో 63–68 సీట్లు గెలుస్తాం
బెంగాల్‌లో ఇప్పటివరకు మూడు దశల శాసనసభ ఎన్నికలు పూర్తయ్యాయి. 91 స్థానాలకు ఎన్నికలు జరగ్గా, వీటిలో 63 నుంచి 68 స్థానాలను తాము దక్కించుకోవడం తథ్యమని అమిత్‌ షా ధీమా వ్యక్తం చేశారు. తృణమూల్‌ కాంగ్రెస్, వామపక్షాలు, కాంగ్రెస్‌ పార్టీలపై భారీ ఆధిక్యత సాధిస్తామని అన్నారు. మిగిలిన ఐదు దశల ఎన్నికల్లోనూ అత్యధిక సీట్లు గెలుచుకుంటామని తెలిపారు. 200కు పైగా సీట్లు సాధించాలన్న లక్ష్యాన్ని ఛేదిస్తామని వ్యాఖ్యానించారు. ఆయన హౌరా జిల్లాలోని దోంజూర్‌ నియోజకవర్గంలో ఒక రిక్షా కార్మికుడి ఇంట్లో బుధవారం మధ్యాహ్నం భోజనం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

రిక్షావాలా ఇంట్లో అమిత్‌ షా కింద కూర్చొని పప్పు కూరతో అన్నం తిన్నారు. అంతకుముందు దోంజూర్‌లో రోడ్‌ షోలో పాల్గొన్నారు. మల్లిఖ్‌ ఫటాక్‌లోనూ రోడ్‌ షో నిర్వహించారు. మమతా బెనర్జీ పెద్ద నాయకురాలని, పెద్ద సీట్ల తేడాతోనే ఆమె ఓడిపోతారని అమిత్‌ షా జోస్యం చెప్పారు. తాము అధికారంలోకి వస్తే రౌడీయిజాన్ని అంతం చేస్తామని హామీ ఇచ్చారు. అక్రమ వలసలను కఠినంగా అణచి వేస్తామని, సరిహద్దుల్లో భద్రతను మరింత పటిష్టం చేస్తామని వెల్లడించారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో విద్యా వ్యవస్థను సంస్కరిస్తున్నామని, మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తున్నామని, నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నామని, పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. 

మరిన్ని వార్తలు