బాబు బాగోతం వల్లే డయాఫ్రమ్‌ వాల్‌కు నష్టం

11 Mar, 2021 03:28 IST|Sakshi

ఈ పాపంలో రామోజీ బంధువుకూ పాత్ర 

నిజాన్ని మరుగునపెట్టి ‘ఈనాడు’ తప్పుడు వార్త 

ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడమే లక్ష్యం 

మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ ధ్వజం  

సాక్షి, అమరావతి: చంద్రబాబు హయాంలో పోలవరం పనులను ప్రణాళిక లేకుండా అస్తవ్యస్తంగా చేయడం వల్ల 2018లోనే డయాఫ్రమ్‌ వాల్‌ వరదకు కొట్టుకుపోయిందని జలవనరులశాఖ మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌ విమర్శించారు. నిజం ఇలా ఉంటే.. ఈనాడు దినపత్రిక మాత్రం దాన్ని కప్పిపుచ్చుతూ కథనం రాసిందని మండిపడ్డారు. నిర్మాణ కాంట్రాక్టర్‌ రామోజీరావు బంధువే అనే నిజాన్ని వార్తలో దాచిపెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. డయాఫ్రమ్‌ వాల్‌ కొట్టుకుపోవడానికి కారణాలేం టో ఈనాడు తన కథనంలో చెప్పకపోవడం దుర్మార్గమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేస్తోందని దుష్ప్రచారం చేయడమే ఈ వార్త ఉద్దేశమన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి బుధవారం మీడియాతో మాట్లాడారు. డయాఫ్రమ్‌ వాల్‌ను చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే చేపట్టారని, దీనికి ఆయనే బాధ్యత వహించాలన్నారు. అనిల్‌ ఇంకేమన్నారంటే.. 

ఆ తప్పు చంద్రబాబుదే.. 
ఓ ప్రణాళిక ప్రకారం.. పోలవరం ప్రాజెకు నిర్మిం చాల్సి ఉండగా టీడీపీ హయాంలో అతుకులతుకులుగా కట్టడం వల్లే ఇలాంటి దుష్ఫలితాలు వస్తున్నాయి. స్పిల్‌వే, స్పిల్‌ చానెల్‌ పూర్తి చేసి, వరద నీటిని మళ్లించాక కాఫర్‌ డ్యామ్‌ను పూర్తి చేయాలి. తర్వాత డయాఫ్రమ్‌ వాల్‌ చేపట్టాలి. కానీ వీటిని ఇష్టానుసారం అసంపూర్ణంగా చేశారు. లక్షలాది క్యూసెక్కుల వరద వస్తుందని తెలిసి కూడా అడ్డదిడ్డంగా కట్టడం వల్ల 1.4 కిలోమీటర్లున్న డయాఫ్రమ్‌ వాల్‌కు 185 మీటర్ల మేర నష్టం జరిగింది. ప్రణాళికాబద్ధంగా పూర్తిచేయాలని ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు వైఎస్‌ జగన్‌ టీడీపీ ప్రభుత్వం దృష్టికి తెచ్చినా పట్టించుకోలేదు. జరిగిన నష్టాన్ని పోలవరం అథారిటీ గుర్తించింది. వారి సూచనల మేరకు ముందుకెళ్తాం. మే నాటికి స్పిల్‌వే, స్పిల్‌ చానెల్‌లను పూర్తిచేస్తాం. కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణం గోదావరి వరదను మళ్లించి, వరద ప్రభావం ఆ ప్రాంతంపై పడకుండా చేస్తాం.  

విశాఖపై ప్రేమ ఇప్పుడు గుర్తొచ్చిందా? 
విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తామంటే అడ్డుకున్న చంద్రబాబు, ఎల్లో మీడియాకు అకస్మాత్తుగా విశాఖపై ప్రేమ పుట్టుకురావడం విడ్డూరంగా ఉంది. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ అమ్మకానికి వైఎస్‌ జగనే కారణమన్న రీతిలో అబద్దపు ప్రచారం చేస్తున్నారు. 1999 నుంచి 2004 వరకు రాష్ట్రంలోనే 54 సంస్థలు మూతపడటమో, ప్రైవేటుపరం అవ్వడమో జరిగితే ఇదే ఈనాడు పత్రిక అప్పట్లో సమర్థించింది.

మరిన్ని వార్తలు