ప్రజలు నమ్మటంలేదు.. మనపని అయిపోయింది..

16 Mar, 2021 05:18 IST|Sakshi

టీడీపీ శ్రేణుల్లో తీవ్ర ఆందోళన 

అధినేత రాజకీయాలు పనిచేయడంలేదు

జగన్‌ సంక్షేమ పథకాల ముందు నిలవలేకపోతున్నాం

అమరావతిలోనే మమ్మల్ని పట్టించుకోలేదు

ఇంత ఘోర ఓటమైతే ముందుకెళ్లేదెలా?

భవిష్యత్తుపై బెంగతో టీడీపీ నేతల నిద్రలేని రాత్రులు

సాక్షి, అమరావతి: మునిసిపల్‌ ఎన్నికల ఫలితాలు తెలుగుదేశం పార్టీ ఉనికినే ప్రశ్నార్థకంగా మార్చేశాయి. ఇంతటి ఘోర ఓటమి తమకు ఎప్పుడూ లేదని నేతలు, కార్యకర్తలు వాపోతున్నారు. పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఎన్నో ఓటముల్ని చూసిన నేతలు కూడా మునిసిపల్‌ ఎన్నికల పరాజయాన్ని చూసి తట్టుకోలేకపోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 23 సీట్లకు పరిమితమైనప్పుడు పార్టీ భవిష్యత్తుపై ఆందోళన చెందినా ఎలాగోలా జవసత్వాలు కూడదీసుకున్నారు. ఇప్పుడు జరిగిన పరాభవం మాత్రం వారికి ఆ అవకాశం కూడా లేకుండా చేసిందని విశ్లేషకులు చెబుతున్నారు.

స్థానిక ఎన్నికల చరిత్రలో ఎక్కడా జరగని విధంగా పార్టీ తుడిచిపెట్టుకుపోవడం ఏమిటో తమకు అర్థం కావడంలేదని టీడీపీ ముఖ్య నాయకులు కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు తమను ఏమాత్రం నమ్మడంలేదని పార్టీలో ఉన్న కొందరు సీనియర్‌ నాయకులు పేర్కొంటున్నారు. ఏడాదిన్నరగా తమ అధినేత చంద్రబాబు చెప్పిన ఏ విషయాన్ని ప్రజలు నమ్మలేదని విజయవాడకు చెందిన టీడీపీ నాయకుడు ఒకరు చెప్పారు. ప్రభుత్వంపై వ్యతిరేకత భారీగా ఉందని నమ్మి దాన్ని ఉపయోగించుకునేందుకు ప్రయత్నించామని, లేని వ్యతిరేకతను ఉన్నట్లు చెప్పడం వల్ల ప్రజల విశ్వాసం కోల్పోయామని ఆ పార్టీ సీనియర్‌ నాయకులు విశ్లేషిస్తున్నారు.

ప్రజల్ని మెప్పించలేక ఇంకా విశ్వాసం కోల్పోయాం 
ఐదేళ్ల పాలనలో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాక వారిని ఎలా మెప్పించాలో ఆలోచించకుండా గుడ్డిగా రాజకీయాలు చేశామనే అభిప్రాయం పార్టీ నేతల్లో వినిపిస్తోంది. అబద్ధాలనే నిజాలుగా ప్రచారం చేయడం, ప్రజల తీర్పునే ప్రశ్నించడం, ప్రజల్ని కూడా నిందిస్తూ మాట్లాడడం వల్ల పూర్తిగా విశ్వాసం కోల్పోయామని కొందరు నాయకులు విశ్లేషిస్తున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు టీడీపీకి ఓటేయలేదని ప్రజల్నే ప్రశ్నిస్తూ, కొన్నిసార్లు తిడుతూ చేసిన వ్యాఖ్యలు పార్టీని ఇంకా దిగజార్చాయని, వీటివల్ల ఆయన స్థాయి కూడా తగ్గిపోయిందని చెబుతున్నారు. ప్రజల కోణం నుంచి ఆలోచించకుండా ప్రతిదీ రాజకీయ కోణంలో చూసి అర్థం లేకుండా మాట్లాడి పరువు పోగొట్టుకున్నామంటున్నారు. అమరావతిలోనే తమను తిరస్కరించాక ఇక తమ రాజకీయం ఎక్కడ పనిచేస్తుందో అర్థం కావడం లేదని వాపోతున్నారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజల్లో ఆదరణ తగ్గలేదని, సంక్షేమ పథకాల వల్ల అది ఇంకా పెరిగిందని టీడీపీ సీనియర్లు కొందరు విశ్లేషిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయంగా ముందుకెళ్లడం కష్టమని వారు వాపోతున్నారు. భవిష్యత్తు బెంగతో చాలామంది నేతలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు.  

మరిన్ని వార్తలు