Punjab Assembly Election 2022: ‘పొత్తు’ పొడవక..ఆప్‌కు ముప్పు!

19 Jan, 2022 08:58 IST|Sakshi

కొత్తగా బరిలోకి సంయుక్త సమాజ్‌ మోర్చా 

గ్రామీణ ఓటర్లలో ఈ మోర్చాకు పట్టు 

ఆప్‌కు పడాల్సిన తటస్థ ఓట్లు చీలిపోయే అవకాశం 

తీవ్ర నష్టమేనంటున్న నిపుణులు 

Arvind Kejriwal: రైతు సంఘాల కూటమి ‘సంయుక్త సమాజ్‌ మోర్చా (ఎస్‌ఎస్‌ఎం)’తో పొత్తు ప్రయత్నాలు విఫలం కావడం.. ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) విజయావకాశాలను దెబ్బతీసేలా ఉంది. మూడుసాగు చట్టాలకు వ్యతిరేకంగా మొక్కవోని సంకల్పంతో ఏడాదికి పైగా ఉద్యమించి.. కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి ఈ చట్టాలను ఉపసంహరించేలా చేసిన 40 రైతు సంఘాల సమాఖ్య ‘సంయుక్త కిసాన్‌ మోర్చా(ఎస్‌కేఎం)’ ముఖ్య నాయకుల్లో బల్బీర్‌సింగ్‌ రాజేవాల్‌ ఒకరు. ఈయన నాయకత్వంలో 22 రైతు సంఘాలు సంయుక్త సమాజ్‌ మోర్చాగా ఏర్పడి పంజాబ్‌ ఎన్నికల్లో ఆఖరిదశలో బరిలోకి దిగాయి. పంజాబ్‌లో గత అసెంబ్లీ ఎన్నికల్లో (2017) త్రిముఖపోరు (కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్‌– బీజేపీ కూటమి, ఆప్‌) జరిగింది. బీజేపీతో దీర్ఘకాల బంధాన్ని అకాలీదళ్‌ తెగదెంపులు చేసుకోవడంతో కమలదళం... కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ నేతృత్వంలోని పంజాబ్‌ లోక్‌ కాంగ్రెస్‌తో జట్టుకట్టింది. ఈ నూతన కూటమి, ఎస్‌ఎస్‌ఎం ఈసారి కొత్తగా బరిలోకి దిగుతుండటంతో త్రిముఖపోరు కాస్తా... పంచముఖ పోరుగా మారిపోయింది. ఓట్ల లెక్కల్లో చాలా నిశితంగా వ్యూహరచన చేయాల్సిన పరిస్థితి నెలకొంది. 

తటస్థ ఓట్లలో చీలిక తప్పదు 
ఒంటరిగా బరిలోకి దిగాలని ఎస్‌ఎస్‌ఎం తీసుకున్న నిర్ణయంతో తటస్థ/ఇంకా తేల్చుకోని ఓటర్లలో చీలికకు దారి తీస్తుంది. గత ఎన్నికల్లో ఆప్‌ 23.72 శాతం ఓట్లతో 20 స్థానాలు సాధించి పంజాబ్‌ అసెంబ్లీలో రెండో అతిపెద్ద పార్టీగా నిలిచింది. రైతు సంఘాలు ఎన్నికల బరిలోకి దిగాలని నిర్ణయం తీసుకునే దాకా... ఆప్‌ గట్టి పోటీదారుగా కనిపించింది. ఇప్పుడు వేర్వేరుగా బరిలోకి దిగుతున్నందువల్ల ఆప్‌ ఓటు బ్యాంకును ఎస్‌ఎస్‌ఎం దెబ్బతీసేలా కనపడుతోంది. అది ఏమేరకు ఉంటుందనేది ఎస్‌ఎస్‌ఎం నేతలు ఎంతగా కష్టపడి తమ కూటమిని ఏమేరకు ప్రజల్లోకి తీసుకెళతారనే దానిపై ఆధారపడి ఉంటుంది. ‘తటస్థ ఓటర్లు 15 నుంచి 20 శాతం ఉంటారు. వీరు ప్రధాన పార్టీలను విశ్వసించరు. మూడోఫ్రంట్‌ వైపు మొగ్గుతుంటారు. ఈ 15–20 శాతం ఓటర్లు అధికార మార్పిడిని కోరుకుంటారు. మెరుగైన పాలన అందించాలనే ఒత్తిడి వీరివల్ల ప్రధాన పార్టీలపై ఉంటుంది. తటస్థ ఓట్లలో చీలిక వస్తే బాగా నష్టపోయేది ఆమ్‌ ఆద్మీ పార్టీయే’ అని పంజాబ్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్, రాజకీయ పరిశీలకులు ప్రమోద్‌ కుమార్‌ తాజా పరిణామాలను విశ్లేషించారు. 

చదవండి: (తగ్గేదేలే..! తొలిసారి అసెంబ్లీ బరిలోకి సీఎం యోగి ఆదిత్యనాథ్‌)

మాల్వాలో ఆప్‌కు దెబ్బపడొచ్చు! 
గ్రామీణ ఓటర్లపై రైతు సంఘాల ప్రభావం బాగా ఉంటుంది. ఎస్‌ఎస్‌ఎం మంగళవారం గుర్నామ్‌ చదూనీ నేతృత్వంలోని సంయుక్త సంఘర్‌‡్ష పార్టీతో పొత్తు పెట్టుకొంది. వారికి పది సీట్లు కేటాయించి... మిగిలిన 107 స్థానాల్లో ఎస్‌ఎస్‌ఎం పోటీ చేయనుంది. పంజాబ్‌లో భారతీయ కిసాన్‌ యూనియన్‌ (బీకేయూ) అన్నింటికంటే పెద్దదైన, బలమైన రైతు సంఘం. తాము రాజకీయాలకు దూరంగా ఉంటామని బీకేయూ ప్రకటించింది. అయినప్పటికీ పంజాబ్‌లోని మూడు ప్రాంతాలైన.. మాల్వా, మజ్హా, దౌబాలలో గ్రామీణప్రాంతాల్లో ఎస్‌ఎస్‌ఎం ప్రభావం ఉంటుంది. సంఖ్యాపరంగా, రాజకీయంగా మాల్వా చాలా కీలకం. ఇక్కడ మూడు ప్రాంతాల్లోకెల్లా అత్యధికంగా 69 అసెంబ్లీ సీట్లున్నాయి. ఇక్కడ మెజారిటీ సీట్లు సాధించే పార్టీకే పంజాబ్‌ పీఠం దక్కుతుంది. శిరోమణి అకాలీదళ్‌కు పట్టున్న ప్రాంతంగా భావించే మాల్వాలో 2017 ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఏకంగా 40 సీట్లు సాధించింది. ఆప్‌ 18 చోట్ల  నెగ్గగా, అకాలీదళ్‌ సింగిల్‌ డిజిట్‌... 8 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

60 సీట్లు అడిగారు.. 
‘ఆప్, ఎస్‌ఎస్‌ఎంలు రెండూ కోరుకునేది పంజాబ్‌ ప్రజల సంక్షేమమే. ఒకరిపై మరొకరికి ఫిర్యాదులేమీ లేవు. పొత్తు కోసం రాజేవాల్‌ సాబ్‌ మా ఇంటికొచ్చారు.. కానీ అప్పటికే మేము 90 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించేశాం. ఎస్‌ఎస్‌ఎం 60 సీట్లు డిమాండ్‌ చేసింది. 117 సీట్లూ మీవేనని రాజేవాల్‌కు చెప్పాను. టికెట్లు దక్కిన వాళ్లంతా రైతు బిడ్డలేనని తెలిపా. మేమింకా అభ్యర్థులను ప్రకటించని మిగిలిన 27 స్థానాల్లో నుంచి 10 నుంచి 15 వరకు ఇవ్వగలమని ప్రతిపాదించా. చర్చలు కొలిక్కి రాలేదు. ఎస్‌ఎస్‌ఎం ఎన్నికల బరిలోకి దిగితే ఓట్లపరంగా మాకు కచ్చితంగా నష్టమే’   – పొత్తు యత్నాలు విఫలం కావడంపై అరవింద్‌ కేజ్రీవాల్‌ 
– నేషనల్‌ డెస్క్, సాక్షి 

Poll
Loading...
మరిన్ని వార్తలు