కేసీఆర్‌ పప్పులిక ఉడకవ్‌: బండి సంజయ్‌

1 May, 2022 04:21 IST|Sakshi

 ప్రజలకు ఆయన మోసాలన్నీ తెలిసిపోయాయ్‌

బీజీపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ వ్యాఖ్యలు

పాదయాత్రలో భాగంగా చేనేత సదస్సులో పాల్గొన్న ఎంపీ

నారాయణపేట/సాక్షి, హైదరాబాద్‌: కేసీఆర్‌ పప్పు లిక ఉడకవని, రాష్ట్ర ప్రజలకు ఆయన మోసాలన్నీ తెలిసిపోయాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ అన్నారు. గ్రామాలకు కేంద్రం ఏమి చేస్తోందో, రాష్ట్రం ఏమి చేస్తోందో కూడా ప్రజలకు అవగతమైందని చెప్పారు. కేసీఆర్‌తో పాటు టీఆర్‌ ఎస్‌ నేతలపై తిరగబడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రజాసంగ్రామ యాత్ర 17వ రోజు శనివారం నారాయణపేట జిల్లాలోని భీమండి కాలనీ, సింగారం చౌరస్తా, జాజా పూర్, అప్పక్‌ పల్లి, చిన్నజట్రంల్లో కొనసాగింది. ఈ సందర్భంగా పలువురు చేనేత కార్మికులు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. బతకడమే కష్టంగా ఉందని ఆవే దన వ్యక్తం చేశారు. ఇక్కడ టెక్స్‌టైల్‌ పార్కు ఏర్పాటు చేస్తే తమకు ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. అనంతరం చేనేత సదస్సులో బండి మాట్లాడారు.

చేనేతలకు చేసిందేమిటి?
చేనేతకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా హీరోయిన్‌ను నియమించిన మంత్రి కేటీఆర్‌ చేనేతలకు చేసిన సాయం ఏమిటని సంజయ్‌ ప్రశ్నించారు. సిరిసిల్ల లోనూ నేతన్నల దుస్థితి మారలేదన్నారు. బతు కమ్మ చీరలు నేసిన కార్మికులకు ఇప్పటివరకు బిల్లులు ఇవ్వలేదని ఆరోపించారు. కేంద్రం చేనేత కార్మికులను ఆదుకునేందుకు అనేక పథకాలు ప్రవేశపెట్టినా రాష్ట్రంలో వాటిని అమలు చేయ కుండా కేసీఆర్‌ అడ్డుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రంలో బీజేపీకి అధికారమిస్తే చేనేత క్లస్టర్‌ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

చివరి గింజ వరకు కొనాల్సిందే..
యాసంగిలో రాష్ట్ర రైతులు పండించిన చివరి వడ్ల గింజ వరకు కొనాల్సిందేనని బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీ ఆర్‌కు శనివారం బహిరంగ లేఖ రాశారు. ధాన్యం కొనేందుకు ప్రతి పైసా కేంద్రమే ఇస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం వరి కొనుగోలులో జాప్యం చేస్తోందని విమర్శించారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించ లేదని.. మహబూబ్‌నగర్‌లో జరుగుతున్న తన పాదయాత్ర సందర్భంగా రైతులు ఫిర్యాదు చేస్తుం డటంతో ఈ లేఖ రాస్తున్నానని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 7 వేల కొనుగోలు కేంద్రాలు ప్రారంభిం చాల్సి ఉండగా.. ఇప్పటి వరకు కేవలం 2,500 కేంద్రాలనే ప్రారంభించారని, 60 లక్షల టన్నుల ధాన్యం కొనాల్సి ఉన్నా.. 2లక్షలటన్నులే కొనుగోలు చేశారని పేర్కొన్నారు. ఇప్పటికైనా కేసీఆర్‌ తన కళ్లకు కట్టుకున్న గంతలు తీసేసి క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. అన్నిచోట్లా వడ్ల కొనుగోలు కేంద్రాలు, వాటిల్లో కాంటాలు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు.  

మరిన్ని వార్తలు