ప్రభుత్వ పాఠశాలలు బాగుపడటం బీజేపీకి ఇష్టం లేదు.. వాళ్లది నిరక్షరాస్యుల పార్టీ

27 Aug, 2022 18:04 IST|Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: బీజేపీ నిరక్షరాస్యుల పార్టీ అని మండిపడ్డారు ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా. ఢిల్లీలో ప్రభుత్వ పాఠశాలలు కొన్ని ప్రైవేటు స్కూళ్ల కంటే చాలా మెరుగ్గా ఉన్నాయని చెప్పారు. బీజేపీ దేశంలో నిరక్షరాస్యతనే కోరుకుంటోందని ధ్వజమెత్తారు. ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రభుత్వ పాఠశాలలు ఎందుకు మూతపడ్డాయని ప్రశ్నించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో అదనపు గదుల నిర్మాణానికి సంబంధించి ఓ నివేదికపై చర్యలు తీసుకునేందుకు రెండేళ్లకుపైగా ఆలస్యం ఎందుకు చేశారని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సెనా.. చీఫ్ సెక్రెటరీని వివరణ కోరినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై స్పందిస్తూ బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు ఢిల్లీ విద్యాశాఖ మంత్రి సిసోడియా. తనపై తప్పుడు అభియోగాలు మోపిన ఎక్సైజ్ పాలసీలో ఎలాంటి అవినీతి జరగలేదని తెలిశాక ప్రభుత్వ పాఠశాల వ్యవహారాన్ని బీజేపీ తెరపైకి తెస్తోందని మండిపడ్డారు.

'వాళ్లు నాలుగేళ్ల క్రితం ఢిల్లీ సీఎం కార్యాలయం, నా కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. 40 మంది ఆప్ ఎమ్మెల్యేలపై కేసులు పెట్టారు. కానీ ఏమీ దొరకలేదు. తప్పుడు ఎక్సైజ్ పాలసీ కేసులో సీబీఐని నా ఇంటికి పంపారు. కానీ ఏమీ కనిపెట్టలేకపోయారు. దీంతో ఈసారి కొత్తగా ప్రయతిస్తున్నారు. మేం నిర్మించిన స్కూళ్లపై పడ్డారు.' అని సిసోడియా బీజేపీపై ధ్వజమెత్తారు.
చదవండి: రాహుల్ పాన్ ఇండియా స్టార్‌.. అంత ఆదరణ కాంగ్రెస్‌లో ఎవరికీ లేదు

మరిన్ని వార్తలు