టీఎంసీలోకి ముకుల్‌ రాయ్‌.. క్లారిటీ ఇచ్చిన బీజేపీ నేత

8 May, 2021 20:34 IST|Sakshi

కోల్‌కతా: కేంద్ర మాజీ మంత్రి, పశ్చిమ బెంగాల్‌కు చెందిన బీజేపీ నాయకుడు ముకుల్‌రాయ్‌ తను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై స్పష్టతనిచ్చారు. శుక్రవారం బీజేపీ శాసనసభ్యులు నిర్వహించిన కీలకమైన సమావేశానికి ముకుల్‌ రాయ్‌ హాజరుకాలేదు. దీంతో అతను తిరిగి టీఎంసీలో చేరవచ్చన్న ఊహాగానాలు వినిపించాయి. ఈ ప్రచారానికి తెరదించుతూ శనివారం ట్విటర్‌ వేదికగా క్లారిటీ ఇచ్చారు. బీజేపీని వీడి తిరిగి తృణముల్‌ కాంగ్రెస్‌లో చేరబోతున్నట్లు వస్తున్న వార్తలను కొట్టిపారేశారు. పశ్చిమబెంగాల్‌లో ప్రజాస్వామన్ని పునరుద్ధరించేందుకు బీజేపీ సైనికుడిగా తన పోరాటం కొనసాగుతోందని స్పష్టం చేశారు.  

‘మన రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించేందుకు బీజేపీ సైనికుడిగా నా పోరాటం కొనసాగుతుంది. అందరూ తమ కల్పనలకు, ఊహాగానాలకు తెర దించాలని కోరుతున్నాను. నేను నా రాజకీయ మార్గంలో దృఢ నిశ్చయంతో ఉన్నాను’ అని ముకుల్ రాయ్ ట్వీట్ చేశారు. కాగా ఇటీవల జరిగిన శాసన సభ ఎన్నికల్లో బీజేపీ 77 స్థానాలు గెలవగా.. కృష్ణా నగర్(ఉత్తర) నియోజకవర్గం నుంచి ముకుల్ రాయ్ గెలిచారు. కానీ శుక్రవారం జరిగిన బీజేపీ ఎమ్మెల్యేల సమావేశానికి ఆయన హాజరు కాలేదు. దీంతో రకరకాల ఊహాగానాలు చెలరేగాయి. ప్రస్తుతం వీటికి  తెరపడింది,  2017లో టీఎంసీ నుంచి ముకుల్‌ రాయ్‌ బీజేపీలో చేరారు. ప్రస్తుతం ఆయన బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు.

చదవండి: నేనెప్పుడూ హింసకు మద్దతివ్వలేదు: మమతా బెనర్జీ
వారి ముందు చూపు వ‌ల్లే ఈ రోజు దేశం మ‌నుగ‌డ: శివసేన

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు