20,21 తేదీల్లో బీజేపీ పల్లె నిద్ర

11 Aug, 2021 03:36 IST|Sakshi

టీడీపీ నేతలతోనూ సమావేశాలు.. ఆహ్వానాలు 

రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నిర్ణయం   

సాక్షి, అమరావతి: ప్రస్తుతం క్షేత్రస్థాయిలో రాజకీయంగా టీడీపీ బలహీనంగా ఉందని, ఈ నేపథ్యంలో ఆ పార్టీ మండల నేతలను స్వయంగా కలిసి బీజేపీలోకి ఆహ్వానించాలని ఆ పార్టీ నిర్ణయించింది. మంగళవారం రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అధ్యక్షతన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. టీడీపీ నేతలను ఆకర్షించాలనే ప్రణాళికలో భాగంగానే ఈ నెల 20, 21 తేదీల్లో పార్టీ నేతల ఆధ్వర్యంలో  కనీసం 500 గ్రామాల్లో పల్లె నిద్ర కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు.  

18,19 తేదీల్లో తిరుపతి, విజయవాడలో సభలు.. 
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలలోకి తీసుకెళ్లేందుకు ఈనెల 18,19 తేదీల్లో తిరుపతి, విజయవాడలో రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహించాలని నిర్ణయించారు. కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖమంత్రి కిషన్‌ రెడ్డి ఆ సభలలో ముఖ్యఅతిథిగా పాల్గొంటారు. 29వ తేదీ నుంచి వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో తెలుగు భాష పరిరక్షణ కోసం సదస్సులు నిర్వహించాలని నిర్ణయించారు. ప్రతి సోమవారం ’స్పందన’లో ప్రజల సమస్యలను పార్టీ పరంగా అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని, ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. నేతలు సునీల్‌ థియోధర్, మధుకర్‌జీ తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు