అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల వేళ ‘మిలియన్‌ మార్చ్‌’ 

29 Jan, 2022 01:48 IST|Sakshi

వర్చువల్‌ మీటింగ్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్‌

బీజేపీ శ్రేణులకు దిశానిర్దేశం 

నిరుద్యోగులకు మద్దతుగా ‘కోటి సంతకాల సేకరణ’చేపట్టాలని సూచన 

సాక్షి, హైదరాబాద్‌: నిరుద్యోగుల తరఫున రాష్ట్ర ప్రభుత్వంపై యుద్ధానికి బీజేపీ సిద్ధమవుతోంది. త్వరలో జరగనున్న అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా ఉద్యోగాల సాధన కోసం యువమోర్చా ఆధ్వర్యంలో ‘మిలియన్‌ మార్చ్‌’నిర్వహించాలని నిర్ణయించింది. ఈలోగా నిరుద్యోగులు, ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించేలా కార్యక్రమాలు చేపట్టాలని భావిస్తోంది. మండల, నియోజకవర్గ, జిల్లా కేంద్రాల్లో, జనం రద్దీగా ఉండే ప్రాంతాల్లో తిరుగుతూ ‘కోటి సంతకాల సేకరణ’చేపట్టాలని సూచించింది.

దీంతోపాటు రౌండ్‌ టేబుల్‌ మీటింగ్‌లు నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పార్టీ శ్రేణులకు సూచించారు. శుక్రవారం సాయంత్రం నుంచి రాత్రిదాకా రాష్ట్రస్థాయి మోర్చాల అధ్యక్షులు, రాష్ట్ర పదాధికారులతో సంజయ్‌ వర్చువల్‌ మీటింగ్‌ నిర్వహించారు. కేంద్ర పథకాలను క్షేత్ర స్థాయిలోకి తీసుకెళ్లడానికి మోర్చాలు చేపట్టిన చర్యలు, రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై చేపడుతున్న కార్యక్రమాలు, భవిష్యత్‌ కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు.

‘తెలంగాణలో టీఆర్‌ఎస్‌ను ఎదిరించే పార్టీ బీజేపీ మాత్రమేనని జనం భావిస్తున్నారు. ఇటీవల వెల్లడైన అన్ని సర్వే సంస్థల నివేదికలు ఇదే చెబుతున్నయ్‌. ఈ విషయం తెలిసే సీఎం కేసీఆర్‌ భయపడి మనపై దాడులు చేయిస్తున్నారు. ఇంకా దాడులు పెరిగే ప్రమాదముంది. అయినా భయపడే ప్రసక్త లేదు. రాబోయే రెండేళ్లు జనంలోనే ఉందాం. అంతిమంగా బీజేపీ సారథ్యంలో పేదల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం’అని సంజయ్‌ పిలుపునిచ్చారు.

‘రాష్ట్రంలో పార్టీ నేతలకు ఏ ఆపదొచ్చినా ఆదుకునేందుకు జాతీయ నాయకత్వం సిద్ధంగా ఉంది. కరీంనగర్‌లో నాపై, నిజామాబాద్‌లో ఎంపీ అర్వింద్‌పై దాడి జరిగిన వెంటనే పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, నరేంద్రమోదీ స్పందించిన తీరే ఇందుకు నిదర్శనం’అని సంజయ్‌ గుర్తుచేశారు. సమావేశంలో పార్టీ నేతలు గుజ్జుల ప్రేమేందర్‌ రెడ్డి, దుగ్యాల ప్రదీప్‌ కుమార్, బంగారు శ్రుతి, మంత్రి శ్రీనివాసులు, డాక్టర్‌ జి.మనోహర్‌ రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్, ఎస్‌.కుమార్‌ పాల్గొన్నారు.    

మరిన్ని వార్తలు