త్రిపుర, నాగాలాండ్‌లో బీజేపీ ఘన విజయం.. మేఘాలయలో షాక్..

2 Mar, 2023 18:16 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఈశాన్య రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయాన్ని అందుకుంది. త్రిపుర, నాగాలాండ్‌లో మెజార్టీతో మరోసారి అధికారంలోకి వచ్చింది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం నుంచే బీజేపీ పూర్తి ఆధిక్యం కనబరిచింది. దీంతో, రెండు రాష్ట్రా‍ల్లో వికర్టీని అందుకుంది.

- త్రిపురలో 60 స్థానాలకు గానూ 33 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. మ్యాజిక్‌ ఫిగర్‌ 31ని అందుకోవడంతో  మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. 

- ఇక, కాంగ్రెస్‌, లెప్ట్‌ కూటమి 14 స్థానాల్లో విజయం సాధించగా.. కొత్త పార్టీ టిప్రా మోథా 13 స్థానాల్లో జయభేరి మోగించి అధికార పార్టీకి ఝలక్ ఇచ్చింది. 

- నాగాలాండ్‌లో బీజేపీ, ఎన్డీపీపీ కూటమి భారీ విజయాన్ని అందుకుంది. 60 స్థానాలకు గానూ బీజేపీ కూటమి 37 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది ఎన్‌పీఎఫ్ రెండు స్థానాలు కైవసం చేసుంది. కాంగ్రెస్ ఖాతా తెరవలేకపోయింది. ఇతరులు 21 చోట్ల విజయం సాధించడం గమనార్హం.

- ఇక్కడ కూడా మ్యాజిక్‌ ఫిగర్‌ 31ని క్రాస్‌ చేయడంతో​ బీజేపీ శ్రేణులు సంబురాలు చేసుకున్నాయి. 

మేఘాలయలో హంగ్...

మరోవైపు.. మేఘాలయలో హంగ్‌ వచ్చింది. సీఎం కాన్రాడ్‌ సంగ్మా నేతృత్వంలోని నేషనల్ పీపుల్స్ పార్టీ 25 స్థానాల్లో గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ మ్యాజిక్ ఫిగర్ 31ని అందుకోలేకపోయింది. కాంగ్రెస్ ఐదు, బీజేపీ 4 సీట్లతో సరిపెట్టుకున్నాయి. ఇతరులు 25 స్థానాల్లో గెలుపొందారు. అయితే కాన్రాడ్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తాము సిద్ధమని బీజేపీ ప్రకటించింది. ఒకవేళ ఈ రెండు పార్టీలు కలిస్తే మేఘాలయ ప్రభుత్వంలో కూడా బీజేపీ భాగం కానుంది. ఫలితంగా మూడు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నట్లు అవుతుంది.

ఇదిలా ఉండగా.. ఈశాన్య రాష్ట్రా‍ల ఎన్నికల్లో కూడా గ్రాండ్‌ ఓల్డ్‌ పార్టీ కాంగ్రెస్‌ భారీ ఓటమిని చవిచూసింది. రెండు రాష్ట్రా‍ల్లో సింగిల్‌ డిజిట్‌కే పరిమితమైంది. నాగాలాండ్‌లో అసలు ఖాతా తెరవలేకపోయింది.

మరిన్ని వార్తలు