దుష్టశక్తులు అడ్డుకోవడం వల్లే ‘పేదలకు ఇల్లు’ ఆలస్యం

1 Nov, 2020 04:43 IST|Sakshi

టిడ్కో ఇళ్లపై సీపీఐ ఆరోపణల్లో వాస్తవం లేదు: మంత్రి బొత్స

మహారాణిపేట (విశాఖ దక్షిణ): నిరుపేదల అభివృద్ధి గిట్టని కొన్ని దుష్టశక్తులు కోర్టులకు వెళ్లి అడ్డుకోవడం వల్లే ‘పేదలకు ఇల్లు’ కార్యక్రమం ఆలస్యమవుతోందని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమ కోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సరికొత్త పథకాలు ప్రవేశపెడుతున్నారన్నారు.

ఎన్ని సమస్యలు వచ్చినా పేదలకు ఇల్లు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కచ్చితంగా పూర్తి చేస్తారని పునరుద్ఘాటించారు. టిడ్కో ఇళ్లపై సీపీఐ కార్యదర్శి రామకృష్ణ చేసిన ఆరోపణల్లో ఏ మాత్రం వాస్తవం లేదని కొట్టిపారేశారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఆయనకు ఆనవాయితీగా మారిందని వ్యాఖ్యానించారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మొత్తం 6 లక్షల టిడ్కో ఇళ్లు మంజూరు కాగా, కేవలం 3 లక్షల ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించారని, అందులో 2.5 లక్షల ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. వాటిని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నట్టు స్పష్టం చేశారు.  

మరిన్ని వార్తలు