అచ్చెన్నాయుడు నోరు అదుపులో పెట్టుకో.. మంత్రి బొత్స సత్యనారాయణ హెచ్చరిక

10 Oct, 2022 20:31 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: విశాఖను పరిపాలన రాజధానిగా చేయాలనే నినాదంతో జేఏసీ ఏర్పడిందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ర్యాలీని అన్ని వర్గాల ప్రజలు విజయవంతం చేయాలని కోరారు. అంబేద్కర్ విగ్రహం నుంచి మహానేత వైఎస్సార్‌ విగ్రహం వరకు ర్యాలీ జరుగుతుందని పేర్కొన్నారు. కాగా చంద్రబాబు ప్రాంతీయ విభేదాలు తేవాలని చూస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి దోపిడీకి అడ్డుపడుతున్నారనే బాధ చంద్రబాబులో స్పష్టంగా  కనిపిస్తుందన్నారు.

అచ్చెన్నాయుడు ఎందుకు వైజాగ్‌ను పరిపాలన రాజధానిగా వద్దంటున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. టీడీపీ అధికారంలో ఉండగా ఉత్తరాంధ్రకు ఏం చేశారని నిలదీశారు. అచ్చెన్నాయుడు పెద్ద జ్ఞానిలా మాట్లాడుతున్నారని, ఆయన నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. టీడీపీ వాళ్ళు సహనం కోల్పోతున్నారని.. ఎల్లో మీడియాతో కలిసి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు హయాంలో పేదలకు పెట్టిన ఒక మంచి పథకమైన అచ్చెన్నాయుడు చెప్పాలని, కనీసం అశోక్ గజపతి రాజు కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో భోగాపురం ఎయిర్‌పోర్టు అయిన కట్టించారా అని ప్రశ్నించారు.

‘ఉత్తరాంధ్ర అభివృద్ధి స్వర్గీయ రాజశేఖర రెడ్డి హయాంలో జరిగింది. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రారంభించింది వైఎస్సార్‌. హెల్త్ సిటీని తీసుకువచ్చింది రాజశేఖర రెడ్డి. బ్రాండేక్స్ కంపెనీ తీసుకువచ్చింది మహనేతనే. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే కార్యక్రమాలు సీఎం జగన్‌ చేపట్టారు. దేశంలో అన్ని రాష్ట్రాలకు మన పథకాలు ఆదర్శంగా నిలుస్తున్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు ఏపీలోని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయలేకపోతున్నారు. గజకర్ణ గోకర్ణ టక్కుటమార విద్యలు తెలిసిన వారు టీడీపీ నేతలు. మన సీఎంకు అటువంటి మాయలు తెలియవు’ అని మంత్రి బొత్స వ్యాఖ్యానించారు.
చదవండి: ఎన్టీఆర్‌ చావుకు కారణమైన వారిని తరిమికొట్టాలి: కొడాలి నాని

మరిన్ని వార్తలు