ఎక్కడా తగ్గొద్దు 

19 Dec, 2023 03:48 IST|Sakshi

బీఆర్‌ఎస్‌ పాలనలో సాధించినప్రగతిని చెప్పండి... పూర్తి సమాచారంతో చర్చకు సిద్ధంగా ఉండండి 

కేటీఆర్, హరీశ్‌తో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు, విద్యుత్, నీటిపారుదల తదితర రంగాలపై అసెంబ్లీ వేదికగా శ్వేతపత్రాలు విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతుందనే వార్తల నేపథ్యంలో భారత్‌ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్‌ పార్టీ కీలక నేతలకు దిశా నిర్దేశం చేశారు. తుంటి ఎముక శస్త్ర చికిత్స అనంతరం కోలుకుంటున్న కేసీఆర్‌తో బంజారాహిల్స్‌ నందినగర్‌ నివాసంలో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావుతో పాటు పార్టీ ముఖ్య నేతలు కొందరు సోమవారం సాయంత్రం భేటీ అయ్యారు.

గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం సందర్భంగా ఉభయ సభల్లో బీఆర్‌ఎస్‌ వ్యవహరించిన తీరు, నేతల ప్రసంగాలు, ప్రభుత్వ స్పందన తదితరాలు సమావేశంలో ప్రస్తావనకు వచ్చాయి. ఈ నెల 20 నుంచి రెండు రోజులపాటు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో చర్చకు అవకాశమున్న అంశాలపై లోతుగా చర్చ జరిగినట్లు సమాచారం. కాగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ప్రజెంటేషన్లు, చేపట్టే చర్చలపై ఎక్కడా వెనక్కి తగ్గొద్దంటూ కేసీఆర్‌ స్పష్టం చేశారు. 

అధికార పక్షాన్ని ఇరుకున పెట్టాలి 
‘అర్ధసత్యాలు, అసత్యాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌కు, రాబోయే రోజుల్లో ఎదురయ్యే వైఫల్యాలకు బీఆర్‌ఎస్‌ను బాధ్యులను చేసేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు సీఎం ఇచ్చిన సమాధానం అదే తరహాలో ఉంది.

కాబట్టి సభ వేదికగానే అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు అన్ని రంగాలకు సంబంధించిన సమగ్ర సమాచారంతో వెళ్లండి. ఎన్ని గంటలైనా చర్చకు సిద్ధంగా ఉంటూ సమన్వయంతో ముందుకు వెళ్లండి. రంగాల వారీగా మనం సాధించిన ప్రగతిని ప్రజలకు వివరించేందుకు ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి..’అని కేసీఆర్‌ దిశా నిర్దేశం చేశారు. 

అసెంబ్లీ భేటీ తర్వాత లోక్‌సభపై దృష్టి 
అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే లోక్‌సభ ఎన్నికలపై దృష్టి పెట్టాలని పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు కేసీఆర్‌ సూచించారు. ఇప్పటికే లోక్‌సభ సెగ్మెంట్ల వారీగా ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు సాధించిన ఓట్లు, ఇతర పార్టీల పరిస్థితిపై నివేదికలు రూపొందించిన నేపథ్యంలో.. నియోజకవర్గాల వారీగా సమీక్ష, సన్నాహక సమావేశాలు నిర్వహించేందుకు షెడ్యూల్‌ను రూపొందించాలని ఆదేశించారు.

గెలుపోటములతో సంబంధం లేకుండా తాజా, మాజీ ఎమ్మెల్యేలు అందరూ క్షేత్ర స్థాయిలో కేడర్‌తో సమావేశమయ్యేలా కార్యాచరణ రూపొందించాలని చెప్పారు. త్వరలోనే తెలంగాణ భవన్‌లో పార్టీ కార్యవర్గం, ప్రజా ప్రతినిధులతో బీఆర్‌ఎస్‌ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనుంది. 

బీఆర్‌ఎస్‌ ఎల్పీ ఆఫీసుకు హరీశ్‌ 
అధినేత ఆదేశాల నేపథ్యంలో హరీశ్‌రావు సోమవారం అ సెంబ్లీ ఆవరణలోని బీఆర్‌ఎస్‌ శాసనసభాపక్షం కార్యాలయానికి వచ్చి పలు రంగాలకు సంబంధించిన నివేదికలను సేకరించారు. తొమ్మిదిన్నరేళ్ల పాలనలో వివిధ ప్రభుత్వ శాఖల పరిధిలో జరిగిన కార్యకలాపాలు, బడ్జెట్‌ లెక్కలకు సంబంధించిన వివరాలను తీసుకున్నారు. ఆర్థిక, వైద్యా రోగ్య, నీటిపారుదల, మార్కెటింగ్‌ వంటి కీలక శాఖల మంత్రిగా పనిచేసిన హరీశ్‌ బుధవారం అసెంబ్లీలో ప్రభుత్వం లేవనెత్తే అంశాలపై బీఆర్‌ఎస్‌ పక్షాన చర్చలో పాల్గొనే అవకాశం ఉంది.  

>
మరిన్ని వార్తలు