కూతురు కోసమే ఢిల్లీకి సీఎం కేసీఆర్‌ 

12 Oct, 2022 01:16 IST|Sakshi
చండూరులో క్షౌరశాలలో గడ్డం గీస్తున్న ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌  

బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్‌  

చండూరు : మద్యం కుంభకోణంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు బంధువు అభిషేక్‌రావు అరెస్టయ్యారని, తర్వాత ఎమ్మెల్సీ కవిత అరెస్టవుతుందని తెలిసి..తన కూతుర్ని కాపాడుకోవడం కోసమే కేంద్రంలో మంతనాలు జరపడానికి కేసీఆర్‌ ఢిల్లీకి వెళ్తున్నారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఆరోపించారు. నల్లగొండ జిల్లా చండూరు మండలం పరిధిలోని చండూరు, తుమ్మలపల్లి, దోనిపాముల, కొండాపురం, నెర్మట గ్రామాలలో మంగళవారం ప్రచారం నిర్వహించారు.

టీఆర్‌ఎస్, బీజేపీ ఒక్కటేనని, ఒప్పందం ప్రకారం కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. స్కాంలు, కాంట్రాక్టుల కోసం అమ్ముడుపోయే నాయకులను, దోపిడీ పార్టీలను ప్రజలు ఓడించాలని పిలుపునిచ్చారు. ఉపఎన్నికల్లో గెలవడం కోసం ఆధిపత్య పార్టీలు వందల కోట్లు ఖర్చు చేస్తున్నాయన్నారు. ఈ ఉప ఎన్నిక కొండ చిలువకు, చలి చీమలకు మధ్య యుద్ధంగా అభివర్ణించారు. ఇప్పటికీ చండూరులో బుడగ జంగాలు, ఎరుకల కులాలు చెత్త ఏరుకుని బతుకుతున్నా యని ఆవేదన వ్యక్తం చేశారు. బీఎస్పీ పార్టీని ఆదరించి..ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు జగన్నాథ్‌గౌడ్, ప్రమీల, నిర్మల, సుజాత, గణేశ్, శివ పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు