ప్రజలు ఏమంటున్రు?.. దళితబంధు అమలుపై సీఎం ఆరా

21 Aug, 2021 07:27 IST|Sakshi

హుజూరాబాద్‌ ఇంచార్జీలతో ప్రత్యేక సమావేశం

గెలుపు ఖాయం, మెజారిటీపైనే దృష్టి పెట్టండి

నియోజకవర్గానికి మరోసారి వస్తానని నేతలకు భరోసా

ప్రచారంలో ఎక్కడా తగ్గకూడదని సీఎం దిశానిర్దేశం

సాక్షి , కరీంనగర్‌: ‘దళితబంధు పథకం గొప్పది. దీని ఫలాలు లబ్ధిదారులకు అందాలి. హుజూరాబాద్‌లో మళ్లీ గులాబీ జెండా ఎగరాలి. ప్రచారంలో ఎక్కడా తగ్గకూడదు. మన గెలుపు ఖా యం, మెజార్టీపైనే దృష్టి సారించండి. త్వరలోనే హుజూరాబాద్‌లో కలుద్దాం..’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నేతలకు దిశానిర్దేశం చేశారు. శుక్రవారం దళితబంధు అమలు, హుజూరాబాద్‌ ఉప ఎన్నిక విషయాలపై ప్రజా స్పందన ఎలా ఉందో తెలుసుకునేందుకు ప్రగతిభవన్‌లో హుజూరా బాద్‌ ఉపఎన్నిక ఇన్‌చారీ్జలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశానికి మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, మేయర్‌ సునీల్‌ రావు, ఇతర సీనియర్‌ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా దళితబంధు అమలుకు మంచి స్పందన వస్తోందని ఇన్‌చార్జీలు సీఎంకు వివరించారు. దీనికితోడు నియోజకవర్గంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు, టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రచారం, ప్రత్యర్థులపై రాజకీయదాడి, రాజకీయ వ్యూహాలు, కదలికలు, వేస్తున్న అడుగులపై సీఎంకు రిపోర్టు ఇచ్చినట్లు తెలిసింది.
చదవండి: క్వశ్చన్‌ పేపర్‌ లీకేజీ ఆధారాలు ధ్వంసం

శాలపల్లి సభతో మారిన సీన్‌..!
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. హుజూరాబాద్‌లో జరుగుతున్న రాజకీయ, అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రస్తుతం జనం నాడిని సీఎంకు మంత్రులు వివరించారు. ఈనెల 16న హుజూరాబాద్‌లోని శాలపల్లిలో నిర్వహించిన బహిరంగ సభలో నియోజకవర్గానికి చెందిన 15 మంది లబ్ధిదారులకు దళితబంధు చెక్కులు అందజేయడంతో అమలుపై అపోహలు తగ్గాయన్నారు. ఆ వెంటనే వారికి నైపుణ్య శిక్షణ ప్రారంభించడంతో ప్రజల్లో నమ్మకం పెరిగిందని సీఎం దృష్టికి తీసుకొచ్చారు. పైగా దళితుల్లోని పేదలతోపాటు, ప్రభుత్వ ఉద్యోగులకు సైతం పథకం వర్తింపజేస్తానన్న హామీ జనాల్లోకి బాగా వెళ్లిందని వివరించారు.

అందుకే.. గత శుక్ర, శని, ఆదివారాల్లో దళితబంధు అమలుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ చెలరేగిన ఆందోనళలు సోమవారం నాటికి ఆగిపోయాయని, లబ్ధిదారుల్లో తగ్గిన అసంతృప్తికి సంకేతమని ఉదహరించారు. శాలపల్లి సభ తరువాత కార్యకర్తల్లో జోష్‌ పెరిగిందని, ప్రభుత్వ ఉద్యోగులకు పథకం అమలు చేస్తామన్న హామీని దళితుల్లోని అన్నివర్గాలు ఆహ్వానిస్తున్నాయని అన్నారు. గత సోమవారం సభలో రాష్ట్రంలో ఉన్న 17 లక్షల మంది దళిత ఉద్యోగులకు పథకం వర్తింపజేస్తానని సీఎం స్వయంగా ప్రకటించడం చాలా పథకంపై జనాల దృష్టిని ఒక్కసారిగా మార్చివేసిందని ఫీడ్‌బ్యాక్‌ ఇచ్చారు.

మరిన్ని వార్తలు