నామినేషన్‌ పత్రాల నకళ్లను పంపండి

4 Feb, 2021 05:07 IST|Sakshi

ప్రతిపక్ష నేత చంద్రబాబు

సాక్షి, అమరావతి: టీడీపీ మద్దతుతో పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ నామినేషన్‌ నకళ్లను జత చేసిన పత్రాలతో సహా పార్టీ కేంద్ర కార్యాలయానికి, ఎన్నికల సంఘానికి, జిల్లా పంచాయతీ అధికారి, జిల్లా కలెక్టర్‌కు పంపాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు సూచించారు. రెండో దశలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాలకు చెందిన టీడీపీ నాయకులతో బుధవారం ఆయన టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండో దశ ఎన్నికలు జరిగే అన్ని గ్రామాల్లోనూ నామినేషన్లు వేయాలని పిలుపునిచ్చారు. పిరికిపందలు కాబట్టే వైసీపీ నాయకులు బెదిరింపు రాజకీయాలు చేస్తున్నారన్నారు.

ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలని టీడీపీ చూస్తోందని, ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేయాలని వైఎస్సార్‌సీపీ చూస్తోందని అన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరగడం సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఇష్టం లేదని, అందుకే వైఎస్సార్‌సీపీ వాళ్లను రెచ్చగొట్టి ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. అవినీతిని ప్రశ్నించాడని పట్టాభిపై హత్యాయత్నం చేశారని, ప్రొద్దుటూరులో నందం సుబ్బయ్య, జమ్మలమడకలో గురుప్రతాప్‌రెడ్డి, పుంగనూరులో ఓం ప్రతాప్‌ ఇలా.. ఎంతమంది ప్రాణాలు బలిగొంటారని ప్రశ్నించారు.  నిమ్మాడలో అచ్చెన్నాయుడిని ఎందుకు అరెస్ట్‌ చేశారన్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులతో కుమ్మక్కై రూల్‌ ఆఫ్‌ లాను భగ్నం చేసే పోలీసులను, అధికారులను గుర్తు పెట్టుకుంటామని, టీడీపీ అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు. 

మరిన్ని వార్తలు