పూతన వేషాలు!

2 Jun, 2023 04:35 IST|Sakshi
పత్తికొండలో సభా ప్రాంగణం వెలుపల భారీ ఎత్తున జన సందోహం, రైతులు బహూకరించిన నాగలితో సీఎం జగన్‌

చంద్రబాబు మేనిఫెస్టోపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ధ్వజం

కొత్త వేషంలో మాయదారి మళ్లీ బయల్దేరాడు

ప్రజల కష్టాల నుంచి మన మేనిఫెస్టో.. కర్ణాటక నుంచి టీడీపీ మేనిఫెస్టో

బాబుకు బిసిబేళె బాత్‌ సరిపోక పులిహోర కూడా వండేశారు

మహానాడు పేరుతో రాజమండ్రిలో మహాడ్రామా

నా నమ్మకం, ధైర్యం మీరే..! 
కురుక్షేత్ర యుద్ధం జరగబోతోంది! పేదలు నావైపు ఉన్నారు! పెత్తందారులు చంద్రబాబు వైపున్నారు! యుద్ధం జరిగేది పేదల భవిష్యత్తుకు – పెత్తందారులకు మధ్య! సామాజిక న్యాయం – సామాజిక అన్యాయానికి మధ్యన! ఎల్లో మీడియా విష ప్రచారాలకు, మీ కళ్ల ముందు కనిపించే మంచికి మధ్య యుద్ధం జరుగుతోంది. దోచుకో, పంచుకో, తినుకో అనే డీపీటీ చంద్రబాబు కావాలా? అందరికీ మేలు జరిగే డీబీటీ (డైరెక్ట్‌ బెనిఫిషర్‌ ట్రాన్స్‌ఫర్‌) కావాలో తేల్చుకోవాలి! మోసం చేసేందుకు చంద్రబాబు కొత్త వేషంతో వస్తున్నారు. మోసపోవద్దు! ఆలోచించండి! నా నమ్మకం, ధైర్యం మీరే!
– ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌  

సాక్షి ప్రతినిధి, కర్నూలు: కొత్త వేషాలు, మోసాలతో చంద్రబాబు మళ్లీ ఎన్నికలకు సిద్ధం అవుతున్నాడని, ఆయన మాయ మాటలను నమ్మవద్దని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గురువారం కర్నూలు జిల్లా పత్తికొండలో నిర్వహించిన సభలో మహానాడు, చంద్రబాబు రాజకీయ డ్రామాలపై సీఎం జగన్‌ ధ్వజమెత్తారు. ‘ఇటీవల రాజమండ్రిలో డ్రా­మా కంపెనీలా ఒక షో జరిగింది.

ఆ డ్రామాకు మహా­నాడు అని పేరు పెట్టుకున్నారు. ఆ డ్రామా చూస్తుంటే ఆశ్చర్యమనిపించింది. 27 ఏళ్ల కిందట తానే వెన్నుపోటు పొడిచి చంపేసిన మనిషిని యుగ పురుషుడని, శక పురుషుడని, రాముడని, కృష్ణుడని కీర్తిస్తూ ఫొటోకు చంద్రబాబు దండ వేశారు. ఆకర్షణీయమైన మేనిఫెస్టోను ప్రకటించారు. దీన్ని చూస్తుంటే కొన్ని పాత్రలు, పురాణ గాథలు గుర్తుకొస్తాయి.

పసిపిల్లాడైన శ్రీకృష్ణుడిని హతమార్చేందుకు పూతన అనే రాక్షసి అందమైన స్త్రీ వేషంలో బయలుదేరినట్లుగా చంద్రబాబు ఆ మేనిఫెస్టోతో సిద్ధమయ్యారు! సీతమ్మ వద్దకు అందమైన మాయలేడి రూపంలో వచ్చిన మారీచుడు కూడా గుర్తొచ్చాడు. సీతమ్మను అపహరించేందుకు వేషం, గెటప్‌ మార్చుకుని ‘భవతీ భిక్షాందేహీ’ అని యాచించిన రావణుడూ గుర్తొచ్చాడు! ఈ మూడు ఆత్మలు, క్యారెక్టర్లు కలిపి మన రాష్ట్రంలో ఓ మనిషి జన్మించాడు.

ఆయనే నారా చంద్రబాబునాయుడు. ఆయన వ్యక్తిత్వం ఏమిటంటే.. మేనిఫెస్టో పేరిట ప్రతి ఎన్నికకూ ఒక వేషం వేస్తాడు! వాగ్దానానికో మోసం చేస్తాడు! ఈ పెద్ద మనిషి సత్యం పలకడు! ధర్మానికి కట్టుబడడు! మాట మీద నిలబడడు! విలువలు, విశ్వసనీయత అసలే లేవు! పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడుస్తాడు.

ఎన్నికలు అయిపోయాక ప్రజలను వంచిస్తాడు. అధికారం కోసం ఎవరికైనా వెన్నుపోటు పొడిచేందుకు వెనుకాడడు! అదీ చంద్రబాబు క్యారెక్టర్‌! ఎన్నికలకు ముందు ఆకర్షణీయమైన మేనిఫెస్టో.. ఆపై ప్రజలను వెన్నుపోటు పొడవటం! ఇదీ ఆ పెద్దమనిషి పొలిటికల్‌ ఫిలాసఫీ..!’ అని సీఎం జగన్‌ దుయ్యబట్టారు.  

కర్ణాటక నుంచి బాబు మేనిఫెస్టో 
మన పార్టీ మేనిఫెస్టో పుట్టింది.. నా ఓదార్పు యాత్ర వల్ల!  నా పాదయాత్ర వల్ల! ప్రజల కష్టాల నడుమ వాటి పరిష్కారం దిశగా, ప్రజల ఆకాంక్షలు, అవసరాల నుంచి వారి గుండె చప్పుడుగా పుట్టింది మన పార్టీ మేనిఫెస్టో! రైతన్నలు, అక్కచెల్లెమ్మలు, పేదలు, సామాజిక వర్గాల కష్టాలు, అవసరాల నడుమ ఉజ్వల భవిష్యత్తు కోసం మన మట్టి నుంచి మన మేనిఫెస్టో పుట్టింది. చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో మాత్రం మన ఏపీలో పుట్టలేదు. కారణం ఆ పెద్దమనిషి జనంలో తిరగడు కాబట్టి! ఆయన మేనిఫెస్టో పుట్టింది కర్ణాటకలో.

అక్కడి ఎన్నికల్లో రెండు పార్టీలు ఇచ్చిన హామీలన్నీ కలిపేసి బిసిబేళ బాత్‌ వండేశాడు! ఇంకా సరిపోలేదు! రుచికరంగా, ఆకర్షణీయంగా లేదని గుర్తించి.. మన అమ్మఒడి, మన చేయూత, మన రైతు భరోసా ఇలా మన పథకాలన్నీ కాపీ కొట్టి ఇంకో పులిహోర వండేశాడు! వైఎస్సార్‌ పథకాలన్నీ కాపీ... జగన్‌ పథకాలన్నీ కాపీ.. బీజేపీ, కాంగ్రెస్‌ పథకాలూ కాపీ! చివరికి బాబు బతుకే కాపీ, మోసం!!  

ఏ గడ్డి అయినా తినేందుకు చంద్రబాబు వెనుకాడరు! 
చంద్రబాబుకు ఒరిజినాలిటీ లేదు! పర్సనాలిటీ లేదు! క్యారెక్టర్, క్రెడిబులిటీ అంతకంటే లేదు! పోటీ చేసేందుకు 175 నియోజకవర్గాల్లో 175 మంది అభ్యర్థులు కూడా లేని పార్టీ అది! బహిరంగ ప్రదేశాల్లో మీటింగ్‌ పెడితే జనం రారని ఇరుకు సందులు చూసుకునే పార్టీ అది! పొత్తుల కోసం ఏ గడ్డైనా తినేందుకు వెనుకాడని పార్టీ అది! విలువలు, విశ్వసనీయత లేని పార్టీ చంద్రబాబుది. ఆ పార్టీకి కావాల్సింది పొత్తులు, ఎత్తులు, చిత్తులు, కుయుక్తులు! ఇదీ ఆ పార్టీ ఫిలాసఫీ..! 

కొత్త వాగ్దానాలు.. కొంగ జపం! 
ఆయన 1995లో సీఎం అయ్యాడు. 2024లో మళ్లీ ఎన్నికలు వస్తుంటే ఇంకో చాన్స్‌ ఇవ్వమంటున్నాడు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ చెప్పుకునేందుకు ఒక్క మంచి పని కూడా లేని చరిత్ర ఆయనది! 2014లో తనను నమ్మిన రైతులు, పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలు, యువకులు, అవ్వాతాతలను మోసం చేశాడు. వారిని అప్పుల పాలుచేసి నట్టేట ముంచాడు.

మొదటి సంతకం చేస్తున్నామంటే దానికి ఒక క్రెడిబులిటీ ఉంటుంది. చంద్రబాబు మొదటి సంతకాన్నే ఓ మోసం, వంచన, దగాగా మార్చాడు. ఇప్పుడు మళ్లీ కొత్త వాగ్దానాలతో జనం ముందుకు వస్తున్నాడు. కొంగ జపం మొదలు పెట్టాడు. విశ్వసనీయత అనేది చంద్రబాబు డిక్షనరీలోనే లేదు. ధర్మంగా రాజకీయాల్లో పోరాటం చేయడం, విలువలు, విశ్వసనీయతతో, ధైర్యంగా ఒంటరిగా పోటీ చేసి ఓటేయాలని అడిగే సత్తా ఆయనకు లేదు.

చంద్రబాబుకు తోడుగా ఓ గజదొంగల ముఠా! ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5, దత్తపుత్రుడు వీరంతా చేస్తోంది రాజకీయ పోరాటం కాదు. అధికారం కోసం ఆరాటం! ఆ అధికారం కూడా దోచుకోవడానికి, పంచుకుని తినడానికే! చంద్రబాబు పెత్తందారీతనానికి, పేదల భవిష్యత్తుకు మధ్య యుద్ధం జరుగుతోంది. దుష్ప్రచారాలను నమ్మొద్దు. మీ ఇంట్లో మంచి జరిగిందా? లేదా? అనేది కొలమానంగా తీసుకోండి. మంచి జరిగితే మీ బిడ్డకు మీరే సైనికుడిగా తోడుగా నిలవాలని కోరుతున్నా.  

జగనన్న ఉన్నాడనే భరోసా 
నాకు ఐదెకరాల పొలం ఉంది. మరో ఐదెకరాలు కౌలుకు చేస్తా. నాలుగేళ్లుగా రైతు భరో­సా కింద రూ.54 వేలు వచ్చింది. ఇప్పుడిస్తున్న మొత్తంతో కలిపితే రూ.61,500 లబ్ధి చేకూరుతోంది. ఉచిత పంటల బీమా ద్వారా రూ.21,800 బీమా పరిహారం పొందాం. ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే జగనన్న ఉన్నాడన్న భరోసా ఉంది.

పప్పు శనగకు రేటు లేకపోతే ఆర్బీకేల ద్వారా మద్దతు ధర రూ.5,330 ప్రకారం అమ్ముకుంటే అదనంగా రూ.30 వేలు వచ్చాయి. నా కుమారుడికి విద్యా దీవెన కింద రూ.34 వేలు జమయ్యాయి. అలాగే వసతి దీవెన డబ్బులు కూడా జమ అయ్యాయి. వైఎస్సార్‌ చేయూత ద్వారా రెండేళ్లలో రూ.37,500 వచ్చాయి. మా కుటుంబం నాలుగేళ్లలో రూ.1.99 లక్షల మేర లబ్ధి పొందింది. రైతాంగానికి వైఎస్సార్‌ కుటుంబమంటే ఇష్టం. 
– ఈశ్వరప్ప, పెద్దహుల్తి, పత్తికొండ మండలం 

నాలుగేళ్లలో రూ.10,28,525 లబ్ధి 
నాకు 4.12 ఎకరాల భూమి ఉంది. జగనన్న నాలుగేళ్ల పాలనలో వైఎస్సార్‌ రైతుభరోసా, ఉచిత పంటల బీమా, సున్నా వడ్డీ, ఆసరా, చేయూత, ఆరోగ్యశ్రీ పథకాల ద్వారా రూ.10,28,525 మేర లబ్ధి పొందాం. ఒక్క మా కుటుంబమే ఇంత లబ్ధి పొందితే రాష్ట్ర ప్రజలు ఎంత ప్రయోజనం పొందారో అర్థం చేసుకోవచ్చు. మా అమ్మానాన్న బతికి ఉన్నారంటే అది జగనన్న చలువే.

మా అమ్మకు క్యాన్సర్‌ వస్తే ఆరోగ్యశ్రీ ద్వారా రూ.4.80 లక్షలు ఖరీదైన ఆపరేషన్‌ ఉచితంగా చేశారు. నాన్నకు రెండు సార్లు గుండెపోటు వస్తే ఆరోగ్యశ్రీ కింద రూ.66 వేలు విలువైన యాంజియోగ్రామ్‌ ఉచితంగా చేశారు. మళ్లీ పోటు రావడంతో రూ.87 వేలతో స్టంట్‌ వేసి బతికించారు. మీకంటే దేవుడు మాకు ఎవరుంటారన్నా! 
–బోయ వెంకటేశ్వర్లు, పోతుగల్లు, కృష్ణగిరి మండలం, కర్నూలు   

మరిన్ని వార్తలు