Munugode Politics: ఆ పార్టీ సరేనంటే.. కమ్యూనిస్టులు అటువైపే..!

16 Aug, 2022 18:14 IST|Sakshi

మద్దతుకే కామ్రేడ్ల మొగ్గు

అధికార పార్టీ వైపు అడుగులు!

బీజేపీ ఓటమే లక్ష్యంగా వ్యూహాలు

పోటీ కంటే.. మద్దతే ప్రయోజనకరమని సీపీఎం, సీపీఐ ఆలోచన

సాధారణ ఎన్నికల్లో సహకరించాలనే కమ్యూనిస్టుల ప్రతిపాదన

రెండు మూడు సీట్లపై దృష్టి

భవిష్యత్‌ ప్రయోజనాలపై టీఆర్‌ఎస్‌తో మంతనాలు

సాక్షి, నల్లగొండ : మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీ చేయకుండా.. ఇతర పార్టీలకు మద్దతు ఇవ్వడంపైనే కమ్యూనిస్టులు ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. బీజేపీ ఓటమే లక్ష్యంగా సీపీఎం, సీపీఐ పావులు కదుపుతున్నాయి. టీఆర్‌ఎస్‌కే మద్దతు ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. వచ్చే సాధారణ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో ఒకటి రెండు సీట్లపై దృష్టి పెట్టి అధికార పార్టీతో మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. అలా సర్దుబాటుకు అధికార పార్టీ సరేనంటే.. కమ్యూనిస్టులు టీఆర్‌ఎస్‌వైపే మొగ్గు చూపే అవకాశం ఉంది.

మునుగోడు ఉప ఎన్నికలపై కమ్యూనిస్టులు ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. సీపీఐ, సీపీఎంలు వేర్వేరుగా నియోజకవర్గ సమావేశాలతోపాటు జిల్లా కార్యవర్గ సమావేశాలను నిర్వహించాయి. ఉప ఎన్నికల్లో పోటీ చేస్తే లాభమా..? లేక శత్రువును ఓడించేందుకు మరొకరికి మద్దతు ఇవ్వాలా..? అన్న ఆలోచనలు చేశాయి. అందులో కొందరు పోటీ చేయాలని, మరికొందరు మద్దతు ఇవ్వాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లుగా తెలిసింది. తాము పోటీ చేస్తే.. బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలుతాయని, తద్వారా బీజేపీ అభ్యర్థికి మేలు జరిగే అవకాశం ఉందన్న అంచనాకు వచ్చాయి.

చదవండి: (వేడెక్కిన మునుగోడు రాజకీయం.. అర్థరాత్రి హైడ్రామా)

మద్దతుపైనే ఆలోచన..
రాష్ట్రంలో 2014లో జరిగిన ఎన్నికల్లో సీపీఎం ఒంటరిగా పోటీచేయగా.. సీపీఐ, కాంగ్రెస్‌ కలిసి పోటీచేశాయి. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విజయం సాధించింది. ఇక 2018 ఎన్నికల్లో సీపీఐ.. కాంగ్రెస్‌ పార్టీకి బహిరంగ మద్దతు ప్రకటించింది. సీపీఎం.. బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌(బీఎల్‌ఎఫ్‌)గా పోటీలో నిలిచింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి రాజగోపాల్‌రెడ్డి గెలిచారు. ఇప్పుడు ఉప ఎన్నిక వస్తే తాము పోటీ చేసే కంటే మరొకరికి మద్దతు ఇస్తేనే బీజేపీని అడ్డుకోగలమన్న ఉద్దేశంతో సీపీఎం, సీపీఐ ఉన్నట్లు తెలిసింది.

అందుకు కాంగ్రెస్‌ పార్టీ కంటే టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇస్తేనే తమ లక్ష్యం నెరవేరుతుందన్న భావనలో ఉన్నట్లు సమాచారం. ఇప్పుడు తాము సహకరిస్తే వచ్చే సాధారణ ఎన్నికల్లో తమ పార్టీలకు కనీసంగా రెండు మూడు సీట్లను పొత్తులో భాగంగా సాధించుకోవాలన్న వ్యూహంతో ఉన్నారు. ఇదే విషయాన్ని టీఆర్‌ఎస్‌ పార్టీ ముందు పెట్టినట్లు తెలిసింది.    

మరిన్ని వార్తలు