Ranga Reddy: కాంగ్రెస్‌లో ‘కుర్చీ’లాట!

6 Jul, 2022 11:25 IST|Sakshi
ఆకుల ఆనంద్‌, ఎండీ గౌస్‌

మునిసిపల్‌ అధ్యక్ష పదవి కోసం ముసలం పుట్టి.. ముదిరి పాకానపడుతోంది. నువ్వానేనా అంటూ ‘కుర్చీ’కోసం పార్టీ పెద్దల చుట్టూ ఆశావహులు వరుస కట్టగా.. పార్టీ శ్రేణులు మాత్రం పోటీదారుల పట్ల పెదవి విరుస్తున్నారు. స్వలాభం కోసమే తప్ప.. పార్టీ భవిష్యత్‌ పట్టని వారికి పీఠం కట్టబెట్టొద్దంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  

సాక్షి, రంగారెడ్డి: కాంగ్రెస్‌ పార్టీలో ముసలం ముదురుతోంది. పార్టీ ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ అధ్యక్ష పదవి కోసం పోటీ తీవ్రమైంది. ప్రస్తుతం ఉన్న అధ్యక్షుడు పండాల శివగౌడ్‌ పార్టీ కార్యకలాపాలపై చొరవ చూపడంలేదన్న విమర్శలు వస్తున్నాయి. గత మున్సిపల్‌ ఎన్నికలప్పుడు ఈ పదవిలో శివగౌడ్‌ను నియమించారు. మున్సిపాలిటీ పరిధిలో పార్టీని సమన్వయంతో ముందుకు తీసుకేళ్ళడం, పటిష్టపరచడం, పార్టీ కార్యక్రమాలపై స్పందించడంలో ఆయన విఫలమైయ్యాడని కార్యకర్తలు విమర్శిస్తున్న నేపథ్యంలో కొత్త వ్యక్తిని నియమించేందుకు అధిష్ఠానం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

దీంతో ఆశావహుల్లో ఆశలు మొలకెత్తుతున్నాయి. కాంగ్రెస్‌ తరపున  కౌన్సిలర్‌గా పోటీ చేసి ఓడిపోయిన మైనార్టీ వర్గానికి చెందిన ఎండీ గౌస్‌ కొంతకాలంగా అధ్యక్ష పదవి కోసం తహతహలాడుతూ ప్రయత్నాలు చేస్తున్నాడని, అదేవిధంగా కౌన్సిలర్‌ ఆకుల మమత భర్త ఆనంద్‌ నేను సైతం అంటున్నట్లు సమాచారం. వీరితో పాటు మరో ఇద్దరు! అధ్యక్ష పదవి పోటీలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. 

ఆనంద్‌ వరెస్స్‌ గౌస్‌ 
పార్టీ అధ్యక్ష పదవి కోసం ఆనంద్, గౌస్‌ల మధ్య తీవ్ర పోటీ ఉందని, ఇందు కోసం ఇరువురు పార్టీ పెద్దల దర్శనం కోసం రాష్ట్ర రాజధాని కార్యాలయం చుట్టూ ప్రదర్శనలు చేస్తుండటంతో పార్టీలో వార్‌ మొదలైంది. ఆనంద్‌కు పార్టీ అధ్యక్ష పదవిని కట్టబెట్టొద్దని పలువురు ఆ పార్టీ కౌన్సిలర్లు అధిష్ఠానానికి విన్నవించినట్లు సమాచారం. మున్సిపాలిటీలో కాంగ్రెస్‌ పార్టీ పటిష్టంగా ఉన్నప్పటికీ నాయకత్వలోపం స్పష్టంగా కనిపిస్తోంది. మున్సిపల్‌ ఎన్నికల ముందు పలువురు టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే.

కార్యకర్తలను ఏకతాటిపై నడిపించే నాయకత్వం లేకపోవడంతో మున్సిపల్‌ ఎన్నికల్లోనూ ఆ పార్టీ చతికిలపడిపోయింది. 24 స్థానాల్లో కేవలం 6 కౌన్సిలర్ల స్థానాలకే కాంగ్రెస్‌ పరిమితమైంది. తాజాగా ఆకుల ఆనంద్‌కు అధ్యక్ష పదవి ఇచ్చే అంశంపై విభేదాలు తలెత్తుతున్నాయి. కొంతమంది కౌన్సిలర్లు ఆనంద్‌ అభ్యర్తిత్వాన్ని తిరస్కరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై మున్సిపాలిటీలో పార్టీ ఏ దారిన వెళుతుందో వేచిచూడాల్సిందే.ఇదిలా ఉండగా మున్సిపాలిటీలో బలంగా ఉన్న పార్టీ రోజురోజుకూ బలహీనపడిపోతుండంతో పార్టీ కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది. 

కాంగ్రెస్‌ కౌన్సిలర్లకు టీఆర్‌ఎస్‌ గాలం 
పార్టీలో అటు నియోజకవర్గ స్థాయిలో, ఇటు మండల, మున్సిపాలిటీ స్థాయిల్లో గ్రూప్‌ తగాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఆపార్టీలోని లొసుగులను అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. కాంగ్రెస్‌ పార్టీ కౌన్సిలర్లను కారెక్కించే దిశగా రాయబారాలు నడుపుతున్నట్లు తెలుస్తోంది. నలుగురు కౌన్సిలర్లు టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారని వినికిడి. ఇదే జరిగితే మున్సిపాలిటీలో జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌ పరిస్థితి మరింత దయనీయంగా మారే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. (క్లిక్‌: ఘాటెక్కి.. చప్పబడ్డ విష్ణు విందు)

మరిన్ని వార్తలు