టీడీపీ అక్రమాలపై ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు 

16 Nov, 2021 04:01 IST|Sakshi

సాక్షి, అమరావతి: మునిసిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ దౌర్జన్యాలకు, అరాచకాలకు పాల్పడుతోందని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యే మొండితోక జగన్‌మోహన్‌రావు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్నికి సోమవారం ఫిర్యాదు చేశారు. వీటిపై తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం మీడియాతో అప్పిరెడ్డి మాట్లాడుతూ.. ప్రశాంతంగా జరుగుతున్న ఎన్నికలలో అలజడులు, ఆటంకాలు సృష్టించాలని, శాంతిభద్రతల సమస్య నెలకొనేలా చేయాలని చంద్రబాబు ప్రయత్నించారన్నారు.

ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరగాలని వైఎస్సార్‌సీపీ కోరుకుంటోందని తెలిపారు. చంద్రబాబు రాబోయే ఓటమికి సాకులు వెదుకుతున్నారని, దానిలో భాగంగా కుప్పంలో దొంగఓట్లు అంటూ కొత్తపల్లవి అందుకున్నారని విమర్శించారు. ఓడిపోయే సమయంలో ఇలాంటి సాకులు రెడీ చేసిపెట్టుకునే అలవాటు చంద్రబాబుకు ఉందనే విషయం ప్రజలందరికీ తెలుసన్నారు. చంద్రబాబు అక్రమాలపై తాము చేసిన ఫిర్యాదుకు తగిన ఆధారాలు కూడా ఎన్నికల కమిషనర్‌కు అందచేశామని చెప్పారు. కమిషనర్‌ను కలిసిన వారిలో నవరత్నాల అమలు ప్రోగ్రామ్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ నారాయణమూర్తి కూడా ఉన్నారు.   

మరిన్ని వార్తలు