ప్రారంభమైన కాంగ్రెస్‌ చింతన్‌ శిబిర్‌.. ఒక కుటుంబం-ఒక్కటే టికెట్‌పై తుది నిర్ణయం ఛాన్స్‌

13 May, 2022 14:35 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ చింతన్‌ శిబిర్‌ (కాంగ్రెస్‌ నవ సంకల్ప్‌ శిబిర్‌) ప్రారంభమైంది. శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు మేధోమథన సదస్సు జరగనుంది. కాంగ్రెస్‌లో భారీ మార్పులను తేనున్నట్లు ఆశిస్తున్న ఈ శిబిర్‌.. రాజస్థాన్‌ ఉదయ్‌పూర్‌ వేదికగా జరుగుతోంది. కాంగ్రెస్‌కు పూర్వవైభవం తీసుకురావాలంటే ఏం చేయాలనే దానిపై నేతల మేధోమథనం చేయనున్నారు. 

కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రారంభోపన్యాసం చేయనుండగా, 15వ తేదీన రాహుల్‌ గాంధీ ప్రసంగిస్తారు. ఈ శిబిర్‌లో మిషన్‌ 2024 కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. వరుస ఎన్నికల పరాజయాలతో నిరాసక్తతతో కూరుకుపోయిన పార్టీకి పునరుత్తేజం, పూర్వవైభవం తేవడం, 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల నాటికి వ్యవస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ నిర్వహిస్తోంది.  వివిధ విభాగాల అధిపతులు, ఆఫీస్‌ బేరర్లు, కేంద్ర మాజీ మంత్రులు, ఎంపీలు, పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు కలిపి మొత్తం 422 మంది సభ్యులు పాల్గొననున్నారు. 

రాజకీయ, సామాజిక, ఆర్థిక, సంస్థాగత, వ్యవసాయ సమస్యలు, అధికార బీజేపీని ఎదుర్కొనే వ్యూహాలపై రోడ్‌మ్యాప్‌ సిధ్దం చేయనున్నారు. అంతేకాదు యాభై ఏళ్లలోబడిన వాళ్లకు సీడబ్ల్యూసీ సహా అన్నింటా ప్రాధాన్యంతో పాటు ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులకు టికెట్లు ఇచ్చే అంశంపైనా ప్రధానంగా చర్చ జరగనుంది.

ఒక కుటుంబం-ఒక్కటే టికెట్‌

చింతన్‌ శిబిర్‌ వేదికగా కాంగ్రెస్‌ కీలక సంస్కరణ చేయనున్నట్లు తెలుస్తోంది. ఒక కుటుంబం-ఒక్కటే టికెట్‌పై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఒక కుటుంబంలో రెండో వ్యక్తికి టికెట్‌ రావాలంటే ఐదేళ్లకు పైగా పార్టీలో యాక్టివ్‌గా ఉండాలని రూల్‌. అంతేకాదు పార్టీ పదవిలో ఐదేళ్లకు మించి కొనసాగరాదని నిబంధనపై సంకేతాలు ఇచ్చారు ఏఐసీసీ జనరల్‌ సెక్రెటరీ అజయ్‌ మాకెన్‌. నిబంధనల నుంచి గాంధీ కుటుంబానికి వెసులు బాటు కల్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

మరిన్ని వార్తలు