ఆర్జేడీకి 144, కాంగ్రెస్‌కు 70 సీట్లు

4 Oct, 2020 03:17 IST|Sakshi

బిహార్‌ మహా కూటమిలో సీట్ల పంపిణీ ఖరారు

పట్నా: బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన బహుళ పార్టీల మహాకూటమిలో సీట్ల పంపకం శనివారం దాదాపు పూర్తయ్యింది. రాష్ట్రీయ జనతా దళ్‌(ఆర్జేడీ) చీఫ్‌ తేజస్వీ యాదవ్‌ను కూటమి నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సీట్ల పంపకంలోనూ ఆ పార్టీకే అగ్రస్థానం దక్కింది. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలుండగా, ఆర్జేడీ 144 సీట్లలో పోటీ చేయనుంది. కాంగ్రెస్‌కు 70 సీట్లు, సీపీఐ(ఎంఎల్‌)కు 19, సీపీఐకి 6, సీపీఎంకు 4 సీట్లు కేటాయించారు.

వాల్మీకీ నగర్‌ లోక్‌సభ స్థానానికి నవంబర్‌ 7న జరగనున్న ఉలప ఎన్నికలో మహా కూటమి తరపున కాంగ్రెస్‌ పార్టీ తన అభ్యర్థిని నిలిపేలా ఒప్పందం కుదిరింది. తమ పార్టీకి దక్కిన 144 సీట్లలో కొన్ని స్థానాలను వికాశీల్‌ ఇన్సాస్‌ పార్టీకి(వీఐపీ), జేఎంఎంకు కేటాయిస్తామని ఆర్జేడీ ప్రకటించింది. సీట్ల పంపకంలో తీమకు అన్యాయం జరిగింది, ఇతర పార్టీల నేతలు వెన్నుపోటు పొడిచారని, మహా కూటమి నుంచి తాము తప్పుకుంటున్నట్లు వికాశీల్‌ ఇన్సాస్‌ పార్టీ అధినేత ముకేశ్‌ సాహ్నీ ప్రకటించారు.

బిహార్‌ బీఎస్పీ చీఫ్‌ రాజీనామా
బీఎస్పీ అధినేత మాయావతికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీ బిహార్‌ శాఖ అధ్యక్షుడు భరత్‌ బింద్‌ శనివారం బీఎస్పీకి రాజీనామా చేసి రాష్ట్రీయ జనతాదళ్‌ (ఆర్జేడీ)లో చేరారు. ఆర్జేడీ నేత తేజస్వీ  ఆయనకు పార్టీ సభ్యత్వం అందజేశారు. సరికొత్త బిహార్‌ నిర్మాణానికి, యువజన వ్యతిరేకి అయిన ఎన్డీయే ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి భరత్‌ తమ పార్టీలో చేరారని తేజస్వీ ట్వీట్‌చేశారు. బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ, ఆర్‌ఎల్‌ఎస్పీ, జనతాంత్రిక్‌ పార్టీ(సోషలిస్టు) కలిసి మహాకూటమిగా ఏర్పడి బరిలో దిగడం తెల్సిందే.

మరిన్ని వార్తలు