అప్పుల కుప్ప చేశారు 

30 Oct, 2023 05:01 IST|Sakshi
ఆదివారం సంగారెడ్డిలోని గంజి మైదానంలో జరిగిన కాంగ్రెస్‌ విజయభేరి బహిరంగ సభలో మల్లికార్జున ఖర్గే, జగ్గారెడ్డి, భట్టి విక్రమార్క, రేవంత్‌రెడ్డి

బీఆర్‌ఎస్‌ పాలనలో ప్రజల నెత్తిన రూ. 5 లక్షల కోట్ల రుణ భారం 

సోనియా రాష్ట్రం ఇవ్వడం వల్లే కల్వకుంట్ల కుటుంబానికి పదవులు 

సంగారెడ్డి, మెదక్‌ ప్రచార సభల్లో కాంగ్రెస్‌ చీఫ్‌ ఖర్గే ధ్వజం

కర్ణాటకలో అన్ని హామీలు అమల్లోకి.. కేసీఆర్, మంత్రులు అబద్ధాలు చెప్తూ రాష్ట్ర ప్రజలను మభ్యపెడుతున్నారు 

రండి.. బస్సుల్లో కర్ణాటకకు తీసుకెళ్లి వాస్తవాలు చూపిస్తాం 

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/ మెదక్‌: సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే దాన్ని అప్పుల పాలు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. మిగులు బడ్జెట్‌ ఉన్న రాష్ట్రాన్ని ఈ తొమ్మిదేళ్లలో ఐదు లక్షల కోట్ల అప్పుల తెలంగాణగా మార్చారని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతున్న కేంద్ర ప్రభుత్వం, అందుకు మద్దతిస్తున్న బీఆర్‌ఎస్‌ రెండూ ఒక్కటేనని.. అవి కలిసే పనిచేస్తున్నాయని చెప్పా­రు. రెండు పార్టీలు కూడా ఎన్నికల్లో ఇచ్చిన హామీ­లను గాలికి వదిలేశాయని మండిపడ్డారు.

తాము కర్ణాటక ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నామని.. కానీ ఈ విషయంలో కేసీఆర్, మంత్రులు అబద్ధాలు ప్రచారం చేస్తూ రాష్ట్ర ప్రజలను మభ్యపెడుతున్నారని చెప్పారు. దమ్ముంటే కేసీఆర్, మంత్రులు రావాలని, బస్సుల్లో కర్ణాటకకు తీసుకెళ్లి హామీల అమలు వాస్తవాలను చూపిస్తామని సవాల్‌ చేశారు. అసలు ఎన్నికలప్పుడు హామీలివ్వడం, తర్వాత మాటతప్పడం సీఎం కేసీఆర్‌ నైజమని విమర్శించారు. ఆదివారం సంగారెడ్డిలోని గంజి మైదానంలో జరిగిన కాంగ్రెస్‌ విజయభేరి బహిరంగ సభలో, మెదక్‌లోని రాందాస్‌ చౌరస్తాలో జరిగిన ప్రచార కార్యక్రమంలో ఖర్గే మాట్లాడారు.  

మోదీ, కేసీఆర్‌ మోసం చేస్తున్నారు 
మెదక్‌లో పోటీ చేసిన ఇందిరాగాంధీ బీహెచ్‌ఈఎల్, బీడీఎల్, ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ వంటి ప్రభుత్వ రంగ సంస్థలను నెలకొల్పారని.. కానీ కేంద్రంలోని మోదీ సర్కారు ప్రభుత్వ సంస్థలను అమ్మేస్తోందని ఖర్గే ఆరోపించారు. రైల్వే వంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో సుమారు 30 లక్షలకుపైగా ఖాళీలుంటే.. ప్రధాని మోదీ కేవలం రెండు, మూడు వేల ఉద్యోగాలను భర్తీ చేసి, అపాయింట్‌మెంట్‌ ఆర్డర్లు ఇస్తూ ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని విమర్శించారు.

ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌ అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ ఎప్పుడూ కూడా నిరుపేదల సంక్షేమం కోసం పనిచేస్తుందని.. బ్యాంకుల జాతీయీకరణ, భూసంస్కరణలను చేపట్టినదని తమ పార్టీయేనని గుర్తు చేశారు. ఏపీ కాంగ్రెస్‌ నష్టపోతుందని తెలిసినా సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని ఖర్గే చెప్పారు. సోనియా ప్రత్యేక రాష్ట్రం ఇవ్వడం వల్లే కేసీఆర్, ఆయన కుటుంబం పదవులు అనుభవిస్తున్నారని పేర్కొన్నారు.   

6 గ్యారంటీలను కచ్చితంగా అమలు చేస్తాం 
రాష్ట్రంలో కేసీఆర్‌ అవినీతి పాలనకు చరమగీతం పాడాలని.. కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ఖర్గే పిలుపునిచ్చారు. ప్రజల కోసం, ప్రజాస్వామ్య రక్షకులకు మద్దతు ఇవ్వాలని కోరారు. తాము అధికారంలోకి రాగానే కర్ణాటకలో మాదిరిగా తెలంగాణలో 6 గ్యారంటీ పథకాలను కచ్చితంగా అమలు చేస్తామని ప్రకటించారు. కాంగ్రెస్‌ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. 
 
మేడిగడ్డతో కేసీఆర్‌ అవినీతి బయటపడింది: రేవంత్‌ 
కేసీఆర్‌ పాలనలో తెలంగాణను బెల్టుషాపుల రాష్ట్రంగా మార్చారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని.. నాణ్యత లోపం వల్లే మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిందని ఆరోపించారు. దీనితో కేసీఆర్‌ అవినీతి బట్టబయలైందని వ్యాఖ్యానించారు. రూ.లక్ష కోట్లు వెచ్చించి నిర్మించిన ప్రాజెక్టు ఇసుక కదలడంతో కుంగిందని నీటి పారుదల శాఖ ఈఎన్సీ చెప్పడం హాస్యాస్పదమన్నారు.

కర్ణాటకలో కాంగ్రెస్‌ హామీల అమలు విషయంలో బీఆర్‌ఎస్‌ కిరాయి మనుషులతో దు్రష్పచారం చేస్తోందని మండిపడ్డారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ ఐదు గ్యారంటీలను విజయవంతంగా అమలు చేస్తోందని.. సీఎం తేదీ ఖరారు చేస్తే బస్సులో కర్ణాటకకు తీసుకెళ్లి హామీల అమలును చూపిస్తామని చెప్పారు. తెలంగాణకు పట్టిన దరిద్రం వదలాలంటే బీఆర్‌ఎస్‌ను ఓడించి కాంగ్రెస్‌ పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు. 
 
సంపదను పంచడానికే ఆరు గ్యారంటీలు: సీఎల్పీ నేత భట్టి 
దొరల తెలంగాణకు, ప్రజల తెలంగాణకు మధ్య జరుగుతున్న యుద్ధమే ఈ ఎన్నికలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. రాషŠట్రంలో ప్రజల ప్రభుత్వం వచ్చినప్పుడే ప్రజల కలలు సాకారం అవుతాయన్నారు. రాష్ట్రంలో ఉన్న సంపదను ప్రజలందరికీ పంచడానికే కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీలు తీసుకొచ్చిందని చెప్పారు. కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. 
 
సంగారెడ్డి గడ్డ దమ్మేంటో చూపిస్తాం: జగ్గారెడ్డి 
రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ గెలుపు ఖాయమని, సంగారెడ్డిలో భారీ మెజారిటీతో గెలిచి ఈ గడ్డ దమ్మేంటో చూపిస్తామని ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు.‘‘హరీశ్‌రావు చాలెంజ్‌ చేస్తున్నారు. జగ్గారెడ్డిని ఓడగొడతాడట. ఇక్కడి ప్రజలకు పౌరుషం లేదనుకుంటున్నాడా? ఈ గడ్డకు పౌరుషం లేదనుకుంటున్నాడా? సంగారెడ్డి ప్రజలారా.. మీ కష్టాల్లో నేను అందుబాటులో ఉంటా. మీ దమ్మేందో చూపించాలి. హరీశ్‌రావు సంగారెడ్డిలో ఎలా తిరుగుతారో చూస్తా’’ అని జగ్గారెడ్డి పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు