రాహుల్‌ గాంధీ జన్‌కీ బాత్‌.. మెకానిక్‌గా మారిపోయి ఈసారి వాళ్లతో ఇలా..

28 Jun, 2023 07:24 IST|Sakshi

ఢిల్లీ: కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు, ఆ పార్టీ కీలక నేత రాహుల్‌ గాంధీ మరోసారి సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌గా మారారు. బైక్‌ రిపేర్‌ షాపులలో మెకానిక్‌గా మారిపోయి.. వాళ్ల సమస్యలు అడిగి తెలుసుకున్నారాయన. ఈ మేరకు ఆ ఫొటోల్ని స్వయంగా ఆయనే పోస్ట్‌ చేయగా.. అవి వైరల్‌ అవుతున్నాయి.

మంగళవారం సాయంత్రం కరోల్‌ బాగ్‌ మార్కెట్‌లోని బైక్‌ రిపేర్‌ దుకాణాలకు వెళ్లి.. ఆయన అక్కడి పనివాళ్లతో ముచ్చటించారాయన. వాళ్లతో కలిసి బైక్‌ రిపేర్‌ చేస్తూ మాటామంతీ కలిపారు.  ఆయన రాక గురించి సమాచారం అందుకున్న స్థానికులు భారీ ఎత్తునే అక్కడ గుమిగూడారు. వాళ్లకు అభివాదం చేసి.. దాదాపు రెండు గంటలు అక్కడే గడిపారాయన. ఈ మేరకు తన ఫేస్‌బుక్‌లోనూ ఫొటోలు ఉంచిన ఆయన.. రెంచ్‌లను తిప్పే..  భారత్ చక్రాలను కదిలించే చేతుల నుండి నేర్చుకోవడం అంటూ క్యాప్షన్‌ ఉంచారాయన. 

భారత్‌ జోడో యాత్ర తర్వాత పార్టీ పటిష్టతపై అధిష్టానంతో కలిసి దృష్టిసారించిన రాహుల్‌ గాంధీ.. మధ్యమధ్యలో ఇలాంటి మన్‌కీ బాత్‌లు చాలానే నిర్వహిస్తున్నారు. నేరుగా పలు వర్గాల ప్రజల దగ్గరికి వెళ్లి.. వాళ్ల సమస్యలు, ఇబ్బందులు అడిగి తెలుసుకుంటున్నారు. ఇంతకు ముందు ట్రక్‌ డ్రైవర్‌ సమస్యలనూ ఆయన అడిగి తెలుసుకున్నారు.

29, 30 తేదీల్లో మణిపూర్‌కు రాహుల్‌ గాంధీ
గిరిజన గిరిజనేతర వర్గాల ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపూర్‌ను కాంగ్రెస్‌ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ  సందర్శించనున్నారు. ఈ నెల 29, 30వ తేదీల్లో ఆయన మణిపూర్‌ వెళ్తారని కాంగ్రెస్‌ తెలిపింది. చురాచంద్‌పూర్, ఇంఫాల్‌ల్లోని సహాయక శిబిరాల్లో తలదాచుకున్న వారితోపాటు పలువురు సామాజిక కార్యకర్తలతో రాహుల్‌ మాట్లాడతారని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ తెలిపారు. దాదాపు రెండు నెలలుగా రాష్ట్రంలో కొనసాగుతున్న హింసాత్మక ఘటనల్లో వందమందికి పైగా చనిపోయిన విషయం తెలిసిందే.

ఇదీ చదవండి: ఒకే దేశం.. ఒకే చట్టం.. సాధ్యమయ్యే పనేనా?

మరిన్ని వార్తలు