టీడీపీ భజన మనకెందుకు?.. రామకృష్ణకు పార్టీ నేతల క్లాస్‌!

9 Aug, 2021 03:59 IST|Sakshi

మీ వ్యవహార శైలితో పార్టీకి చెడ్డ పేరొస్తోంది 

సీపీఐ రామకృష్ణపై రాష్ట్ర కౌన్సిల్‌ సమావేశంలో విమర్శల వెల్లువ 

సీఎం జగన్‌ సంక్షేమ పథకాలను ప్రజలు స్వాగతిస్తున్న సంగతి తెలీదా?

సాక్షి, అమరావతి: ‘సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని.. ఆయన ప్రభుత్వాన్ని మనం చీటికిమాటికి ఎందుకు విమర్శించాలి? మీరు అలా చేస్తుండడంవల్ల సీపీఐ వాళ్లేదో టీడీపీతో, ఆ పార్టీ అధినేత చంద్రబాబుతో కుమ్మక్కైనట్లు ప్రజలు భావిస్తున్నారు. ఇది మంచిది కాదు.. ఓ కమ్యూనిస్టు పార్టీ నాయకునిగా మీరు స్వతంత్రంగా వ్యవహరించడానికి బదులు చంద్రబాబు తొత్తులా వ్యవహరిస్తున్నారన్న విమర్శల్ని మేం వినలేకుండా ఉన్నాం’.. అని ఆ పార్టీ నాయకులు రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణకు క్లాస్‌ పీకారు. కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టిన తర్వాత ఆదివారం విజయవాడలో తొలిసారి భౌతికంగా జరిగిన రాష్ట్ర కౌన్సిల్‌ సమావేశం వాడీవేడిగా జరిగింది.

పార్టీ జాతీయ కార్యదర్శి వర్గ సభ్యుడు డాక్టర్‌ కే నారాయణ సమక్షంలోనే రామకృష్ణపై తీవ్రస్థాయిలో విమర్శలు చెలరేగాయి. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయాలన్న లక్ష్యానికి భిన్నంగా రాష్ట్ర కార్యదర్శి వ్యవహరిస్తున్నారని పలువురు బాహాటంగానే ఆరోపించారు. లౌకిక, ప్రజాస్వామ్య శక్తుల ఐక్యతకు ప్రాధాన్యత ఇవ్వాలన్నది పార్టీ విధానం కాగా.. కార్పొరేట్లకు వంత పాడుతూ, బడా సంస్థలకు సీఈఓనని చెప్పుకునే చంద్రబాబుతో అంటకాగాల్సిన అవసరం ఏమొచ్చిందని వారు రామకృష్ణను నిలదీశారు.  

జగన్‌ సర్కార్‌ను విమర్శించాల్సిన పనిలేదు 
‘వైఎస్‌ జగన్‌ నాయకత్వంలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అద్భుత ప్రజాదరణతో అధికారాన్ని చేపట్టింది. వస్తూనే ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీల మేరకు అనేక సంక్షేమ కార్యక్రమాలను, పథకాలను తూచా తప్పకుండా అమలుచేస్తోంది. దీన్ని ప్రజలూ స్వాగతిస్తున్నారు.. ఆస్వాదిస్తున్నారు. అటువంటి వాటిని మనం వ్యతిరేకించాల్సిన అవసరంలేదు.

లోపాలు ఎత్తిచూపడం వేరు, జగన్‌ను వ్యక్తిగతంగా విమర్శించడం వేరు’ అని పార్టీ సీనియర్‌ నేత ఒకరు మండిపడ్డారు. దీంతో మరికొంతమంది నాయకులు కూడా ప్రజా మద్దతున్న ప్రభుత్వాన్నీ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అండగా నిలుస్తున్న జగన్‌ ప్రభుత్వాన్ని విమర్శించాల్సిన పనిలేదన్నారు. ఈ మేరకు కార్యదర్శి నివేదికలో పేర్కొన్న పలు అంశాలను మార్చాలని పట్టుబట్టి మార్పించారు. వైఎస్‌ జగన్‌ కమ్యూనిస్టుల ప్రత్యర్థి కాదని, ఆయన సంక్షేమ పథకాలను స్వాగతిస్తూనే ఏమైనా లోపాలుంటే విమర్శిద్దామని.. జగన్‌ ప్రభుత్వంపై వ్యతిరేకత చూపొద్దని రామకృష్ణకు హితవు చెప్పారు. ఈ వ్యవహారంలో సీపీఎం వ్యవహరిస్తున్న తీరును పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.  

చంద్రబాబు దారుణాలను మర్చిపోవద్దు 
టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు బడుగువర్గాలపట్ల ఎంత దారుణంగా వ్యవహరించారో మరచిపోకూడదని కూడా ఆ నేతలు సలహా ఇచ్చారు. ‘ఇప్పటికిప్పుడు ఎన్నికలేవీ లేవు. టీడీపీ, వైఎస్సార్‌సీపీతో సమదూరంగా ఉంటూనే పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకుందాం. సొంత కాళ్లపై నిలబడేందుకు ప్రయత్నిద్దాం. లౌకిక, ప్రజాస్వామ్య శక్తుల ఐక్యతకు కృషిచేద్దాం. పార్టీ రాష్ట్ర మహాసభలకు శ్రేణులను సిద్ధంచేసేలా కింది నుంచి పార్టీ శాఖలను నిర్మించుకుందాం. దానిపై దృష్టిసారించాలి’.. అని పార్టీ నేతలు రాష్ట్ర కార్యదర్శికి సూచించారు. దీనిపై రామకృష్ణ వివరణ ఇస్తూ.. పార్టీ విధానం ప్రకారమే నడుచుకుంటున్నానని, జగన్‌ తనకేమీ శత్రువు కాదని చెప్పారు. పార్టీ నాయకత్వం సూచించిన తీరులో ప్రజా ఉద్యమాలను నిర్వహిస్తున్నట్లు సంజాయిషీ ఇచ్చుకున్నారు. ఈ దశలో నారాయణ ఏదో సర్దిచెప్పడానికి ప్రయత్నించినా రామకృష్ణపై విమర్శల దాడి ఆగలేదు.   

మరిన్ని వార్తలు