పల్నాడు ప్ర‘జల కళ’.. వరికపుడిశెల

14 Nov, 2023 04:30 IST|Sakshi

రూ.320.26 కోట్లతో ఎత్తిపోతల నిర్మాణానికి రేపు శంకుస్థాపన చేయనున్న సీఎం వైఎస్‌ జగన్‌

తొలి దశలో 24,900 ఎకరాలకు సాగునీరు

అటవీ శాఖ అనుమతి ఇవ్వకపోవడంతో 6 దశాబ్దాలుగా కాగితాలకే పరిమితమైన వరికపుడిశెల

వరికపుడిశెలతోపాటు గోదావరి జలాలతో పల్నాడును సుభిక్షం చేసేందుకు సీఎం ప్రణాళిక

సీఎం వైఎస్‌ జగన్‌ కృషితో టైగర్‌ ఫారెస్ట్‌లో పనులు చేపట్టేందుకు అనుమతి ఇచ్చిన కేంద్ర అటవీ శాఖ

సాక్షి, అమరావతి: పల్నాడు ప్రజల ఆరు దశాబ్దాల స్వప్నం వరికపుడిశెల ఎత్తిపోతలను సాకారం చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నడుం బిగించారు. పులుల అభయారణ్యం (టైగర్‌ ఫారెస్ట్‌)లో వరికపుడి­శెల ఎత్తిపోతల, పైపులైన్‌ పనులు చేపట్టేందుకు అనుమతి ఇవ్వాలంటూ సీఎం వైఎస్‌ జగన్‌ చేసిన విజ్ఞప్తికి కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ అంగీకరించింది. దీంతో వరికపుడిశెల ఎత్తి­పోతల తొలి దశ పనులను రూ.340.26 కోట్లతో చేపట్టేందుకు మాచర్లలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం శంకుస్థాపన చేయనున్నారు. తొలి దశ పనులను యుద్ధ­ప్రాతిపదికన పూర్తి చేసి.. అధునాతన పైప్డ్‌ ఇరిగేషన్‌(పూర్తిగా పైపులైన్ల ద్వారా) పద్ధతిలో 24,900 ఎకరాలకు నీళ్లందించే దిశగా అడు­గులు వేస్తున్నారు.

దేశంలో అత్యల్ప వర్షపాతం నమోదయ్యే ప్రాంతాల్లో పల్నాడు ప్రాంతం ఒకటి. తలాపున వరికపుడిశెల వాగు, కృష్ణా నదులు ప్రవహిస్తున్నా పల్నాడులో సాగునీటికే కాదు.. గుక్కెడు తాగునీటికీ తీవ్ర ఇబ్బందులే. నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుకు 40 కి.మీ.ల ఎగువన కృష్ణా నదిలో వరికపుడిశెలవాగు కలవక ముందే.. ఆ వాగు నుంచి జలాలను ఎత్తిపోసి పల్నాడును సుభిక్షం చేయాలనే ప్రతిపాదన దశాబ్దాలుగా ఉంది. టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌లో పనులు చేపట్టడానికి కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ అనుమతి ఇవ్వకపోవడంతో ఆ ఎత్తిపోతల ప్రాజెక్ట్‌ కాగితాలకే పరిమితమైంది.

పల్నాడును సస్యశ్యామలం చేసే దిశగా
వరికపుడిశెలవాగు, కృష్ణా, గోదావరి–కృష్ణా–పెన్నా అనుసంధానం ద్వారా నదీ జలాలను తరలించి దుర్భిక్ష పల్నాడును సుభిక్షం చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. దాంతో గోదావరి–కృష్ణా–పెన్నా అనుసంధానం తొలి దశ పనులతోపాటు వరికపుడిశెల ఎత్తిపోతల తొలి దశ పనులను అధికారులు చేపట్టారు. వరికపుడిశెల వాగు కుడి గట్టున ఎత్తిపోతలను నిర్మించి తొలి దశలో రోజుకు 281 క్యూసెక్కుల చొప్పున 1.57 టీఎంసీలను తరలించి వెల్దుర్తి మండలంలో 24,900 ఎకరాలకు నీళ్లందించే పనులను రూ.340.26 కోట్లతో చేపట్టారు.

టైగర్‌ రిజర్వు ఫారెస్ట్‌లో వరికపుడిశెల వాగుపై ఎత్తిపోతల నిర్మాణం, ఎత్తిపోతల ద్వారా నీటిని తరలించడానికి 4 కి.మీ.ల పొడవున పైపు లైన్‌ నిర్మాణానికి 19.13 హెక్టార్ల అటవీ భూమిని కేటాయించాలని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖకు అధికారులు ప్రతిపాదనలు పంపారు. ఇందుకు ప్రతిగా దుర్గి మండలంలో 21 హెక్టార్ల భూమిని అటవీ శాఖకు బదలాయించి పరిహారాన్ని కూడా ప్రభుత్వం చెల్లించింది. సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ అధికారులతో పల్నాడు ప్రాంత ప్రజాప్రతినిధులు, జల వనరుల శాఖ అధికారులు పలు దఫాలుగా చర్చలు జరపడంతో కేంద్రం కదిలింది. వరికపుడిశెల ఎత్తిపోతలకు ఏప్రిల్‌ 28న అటవీ మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చింది. 

పనులకు తొలగిన అడ్డంకి
శ్రీశైలం–నాగార్జునసాగర్‌ టైగర్‌ రిజర్వు ఫారెస్ట్‌లో వరికపుడిశెల ఎత్తిపోతల పనులు చేపట్టేందుకు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ అనుమతి ఇచ్చింది. దాంతో వరికపుడిశెలవాగు కుడి గట్టుపై పంప్‌హౌస్‌ నిర్మాణానికి.. టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌లో 4 కి.మీ.ల పొడవున పైపులైన్‌ నిర్మించడానికి మార్గం సుగమమైంది. దాంతో ఆ ఎత్తిపోతల పనులకు బుధవారం సీఎం వైఎస్‌ జగన్‌ శంకుస్థాపన చేస్తున్నారు.

ఎత్తిపోతల ద్వారా వెల్దుర్తి, ఉప్పలపాడు, గొట్టిపాళ్ల, సిరిగిరిపాడు, బొదిలవీడు, గంగులకుంట, లోయపల్లి గ్రామాల పరిధిలో 24,900 ఎకరాలకు సరఫరా చేయడానికి వీలుగా పైపు లైన్‌లు వేయనున్నారు. పైపులైన్ల ద్వారా నీటిని తరలించడం వల్ల సరఫరా నష్టాలు ఉండవని.. ఆయకట్టుకు సమర్థవంతంగా నీటిని అందింవచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇక ప్రభుత్వ ఆదేశాల మేరకు వరికపుడిశెల ఎత్తిపోతల రెండో దశలో పల్నాడు ప్రాంతంలో భారీ ఎత్తున ఆయకట్టుకు నీళ్లందించేలా సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) తయారీకి అధికారులు కసరత్తు చేస్తున్నారు.   

మరిన్ని వార్తలు