‘మంత్రులు తలసాని, గంగులకు గుట్కా ఎక్కడి నుంచి వచ్చింది’

16 Jul, 2021 10:10 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వం నిషేధించిన మత్తు పదార్థాలు తింటున్న రాష్ట్ర మంత్రులపై సీఎం కేసీఆర్‌ చర్యలు తీసుకోవాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ డిమాండ్‌ చేశారు. నిర్లజ్జగా చట్టాన్ని ఉల్లంఘించి గుట్కా తింటున్న బ్యాచ్‌తో బంగారు తెలంగాణ సాధిస్తారా అని ఆయన ‍ ప్రశ్నించారు. గుట్కా తింటూ అడ్డంగా దొరికి పోయిన మంత్రులను తక్షణమే కేబినెట్‌ నుంచి బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ చేతకాని తీరుతో ఇప్పటికే హైదరాబాద్‌ డ్రగ్స్‌కు అడ్డాగా మారిందని మండిపడ్డారు. రాష్ట్రంలో సొగాకు, గుట్కాను నిషేధించారని, మరి అవి మంత్రులకు ఎలా దొరికాయో తెలియజేయాలని ధ్వజమెత్తారు. డీజీపీ మహేందర్‌ రెడ్డి, సీపీ అంజనీకుమార్‌ వెంటనే గుట్కా తిన్న మంత్రులపై చట్టపరంగా కేసులు నమోదు చేయాలని శ్రవణ్‌ డిమాండ్‌ చేశారు.

కాగా తెలంగాణ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్‌కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఎవరూ చూడకుండా రహస్యంగా చేతుల్లో ఏదో పదార్థాన్ని పంచుకుంటూ చాటుగా తినడం ఈ వీడియోలో కనిపిస్తుంది. అయితే అది గుట్కా అని సోషల్‌ మీడియలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే మంత్రులు గుట్కా తింటున్నారని ఆ వీడియోను దాసోజు శ్రవణ్ ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ‘తెలంగాణలో పొగాకు, గుట్కా బ్యాన్ చేసిండ్రు కదా. మరి ఈ మంత్రులకు యెట్లా దొరికింది? ఎవరు స్మగుల్ చేస్తుండ్రు? ఎట్లా సప్లై చేస్తుండ్రు?బందు బెట్టిన గుట్కాను, బాజాప్తాగా తింటున్న మంత్రులపై పోలీసులు క్రిమినల్ కేసులు పెట్టాల్నా లేదా?’ అంటూ దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు