రాష్ట్రంలో బీజేపీదే అధికారం

25 Nov, 2023 02:27 IST|Sakshi

అత్యధిక సీట్లు గెలుపొందుతాం: రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ 

ఆ రెండు పార్టీలను ఎవరూ నమ్మరు 

నాగారం, కార్వాన్, కంటోన్మెంట్‌లో ప్రచారం

కీసర, గోల్కొండ/కంటోన్మెంట్‌: అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక సీట్లు గెలుపొంది రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయమని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో తొమ్మిదిన్నరేళ్లుగా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పూర్తి విఫలమైందన్నారు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పిన కేసీఆర్‌ ఎంతమందికి భూమి ఇచ్చారో చెప్పాలనీ, ఇంటికో ఉద్యోగమన్న సీఎం రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ అధికారంలోకి రాగానే బీఆర్‌ఎస్‌ పాలనలో జరిగిన అవినీతిని విచారణ చేపడుతామన్నారు.

శుక్రవారం నాగారంలోని రాంపల్లిలో, కార్వాన్‌ నియోజకవర్గంలో, కంటోన్మెంట్‌లో నిర్వహించిన కార్యక్రమాల్లో రాజ్‌నాథ్‌ ప్రసంగించారు. తెలంగాణ అభివృద్ధికి పీఎం మోదీ చిత్తశుద్ధితో కృషి చేశారనీ, కేంద్రం నుంచి పెద్ద ఎత్తున ఆర్థికసాయం అందించారని గుర్తు చేశారు. ప్రజలు కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ పార్టీలను నమ్మడం లేదన్నారు. దేశాన్ని సమర్థవంతంగా పాలిస్తున్న బీజేపీ తెలంగాణలో కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయనుందన్నారు. దశాబ్దాల తన పాలనలో దేశాన్ని ఏమాత్రం అభివృద్ధి చేయలేని కాంగ్రెస్‌ పార్టీని ప్రజలు అన్ని చోట్లా తిరస్కరించారని, ఇక్కడా అదే జరుగుతుందని వ్యాఖ్యానించారు.

బీజేపీ పరిపాలన దక్షత ఏమిటో ప్రజలకు తెలిసినందువల్లే వారు వరుసగా మోదీకి జై కొడుతున్నారని అన్నారు. నేడు దేశం ప్రపంచ అగ్రరాజ్యాల సరసన చేరిందంటే అది ప్రధాని మోదీ సమర్థపాలన, సరైన విధాన నిర్ణయాలే కారణమని చెప్పారు. పార్టీ అభ్యర్థులు ఏనుగు సుదర్శన్‌రెడ్డి (మేడ్చల్‌), టి.అమర్‌సింగ్‌ (కార్వాన్‌)కు ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. కార్వాన్‌ నియోజకవర్గంలో గుడిమల్కాపూర్‌ చౌరస్తా నుంచి దర్బార్‌ మైసమ్మ దేవాలయం వరకు జరిగిన బీజేపీ రోడ్‌ షోలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. 

కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ కుటుంబ పార్టీలు 
కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ కుటుంబ పార్టీలని, బీజేపీ మాత్రమే ప్రజల పార్టీ అని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. కుటుంబ పాలనకు ప్రాధాన్యమిచ్చే బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లను ఓడించాలన్నారు. బీజేపీ ఏదైనా చెబితే తప్పకుండా చేసి తీరుతుందన్నారు. 1951లో ఏర్పడిన జనసంఘ్‌ తమకు పార్లమెంట్‌లో స్పష్టమైన మెజారిటీ వస్తే ఆర్టికల్‌ 370 రద్దు చేస్తామని మరుసటి ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిందన్నారు.

అలాగే, అయోధ్యలో రామమందిరం నిర్మిస్తామని 1980 దశకంలో ప్రకటించిందన్నారు. చెప్పినట్లుగానే ఆర్టికల్‌ 370 రద్దు చేశామని, అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తిచేసి జనవరిలో ప్రారంభించబోతున్నామని తెలిపారు. బీఆర్‌ఎస్‌ పార్టీ గుర్తు అయిన కారు బేకార్‌ అని వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు