రూ.300 కోట్లు డంప్‌ చేశారు

25 Nov, 2023 02:14 IST|Sakshi

కాంగ్రెస్‌ ఆరోపణ 

మాజీ ఐఏఎస్‌ గోయల్‌ ఇంట్లో ఈసీ సోదాలు... ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు నేపథ్యంలో తనిఖీలు 

ఆయన ఇంటి వద్ద కాంగ్రెస్‌ నేతల నిరసన 

బంజారాహిల్స్‌: విశ్రాంత ఐఏఎస్, మాజీ ప్రభుత్వ సలహాదారు ఏకే గోయల్‌ ఇంట్లో ఎన్నికల అధికారులు సోదాలు జరిపారు. ఎన్నికల కోసం ఏకే గోయల్‌ ఇంట్లో సుమారు 300 కోట్ల రూపాయల డంప్‌ ఉందని దీనిపై విచారణ జరపాలంటూ తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్లు రవి ఎన్నికల కమిషన్‌కు శుక్రవారం ఫిర్యాదు చేశారు. దీంతో ఎన్నికల అధికారులు, ఫ్లయింగ్‌ స్క్వాడ్, పోలీసులు జూబ్లీహిల్స్‌లోని గోయ ల్‌ ఇంట్లో సోదాలు జరిపారు.

ఐదుగురు అధికారుల బృందం లోపలికి వెళ్లగా జూబ్లీహిల్స్‌ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా సమాచారం అందుకున్న మల్లు రవితో పాటు కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు గోయల్‌ నివాసం వద్దకు చేరుకున్నారు. ఈ సమయంలో ఫ్లయింగ్‌ స్క్వాడ్‌కు చెందిన వాహనాలతోపాటు టాస్‌్కఫోర్స్‌ సిబ్బంది ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా కాంగ్రెస్‌ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు.

ఫ్లయింగ్‌ స్క్వాడ్‌కు చెందిన ఓ మహిళా ఉద్యోగిని కూడా అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారించారు. అయినప్పటికీ కార్యకర్తలు వినిపించుకోకపోవడంతో స్వల్పంగా లాఠీచార్జ్‌ చేశారు. ఈ తోపులాటలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ప్రకాశ్, జ్ఞానేశ్వర్‌కు స్వల్ప గాయాలయ్యాయి.

అజారుద్దీన్‌ అండ్‌ కో ధర్నా 
పోలీసులు లాఠీలు ఝుళిపించడంతో జూబ్లీహిల్స్‌ నియోజక వర్గం కాంగ్రెస్‌ అభ్యర్థి అజారుద్దీన్, కార్పొరేటర్‌ సీఎన్‌ రెడ్డి, సీ నియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు భవాని శంకర్‌ తదితరులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. విచక్షణా రహితంగా లాఠీచార్జ్‌ చేసి న పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ధర్నా చేశా రు. దీంతో జూబ్లీహిల్స్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 

రెండు రోజుల క్రితమే సమాచారం: మల్లు రవి 
గోయల్‌ ఇంట్లో నుండి డబ్బులు తరలిస్తున్నట్టు రెండు రోజుల క్రితమే తమకు సమాచారం అందిందని మల్లు రవి తెలిపారు. ఈ వ్యవహారంపై నిఘా పెట్టి నిర్ధారించుకున్న అనంతరం ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశామని చెప్పారు.

ఎన్నికల అధికారులు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ వచ్చాక కొన్ని వాహనాలు బయటికి వెళ్లడంపై తమకు అనుమానాలు ఉన్నాయని ఈ విషయంపై ప్రశ్నించినందుకు పోలీసులు లాఠీలకు పని చెప్పారని ఆరోపించారు. సోదాలు రాత్రి పొద్దు పోయేవరకు సాగాయి. పశ్చిమ మండలం అడిషనల్‌ డీసీపీ హనుమంతరావు, జూబ్లీహిల్స్‌ ఏసీపీ హరిప్రసాద్, బంజారాహిల్స్‌ డివిజన్‌ ఏసీపీ సుబ్బయ్య ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. 

మరిన్ని వార్తలు