నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించండి 

17 Oct, 2023 00:07 IST|Sakshi

విద్యార్థులకు గవర్నర్‌ తమిళిసై పిలుపు 

హైదరాబాద్‌ ఐఐటీలో వర్క్‌షాప్‌ ప్రారంభం 

సంగారెడ్డి అర్బన్‌: విద్యార్థులు నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించాలని గవర్నర్‌ తమిళిసై పిలుపునిచ్చారు. సోమవారం హైదరాబాద్‌ ఐఐటీలో బీవీఆర్‌ మోహన్‌రెడ్డి స్కూల్‌ ఆఫ్‌ ఇన్నోవేషన్‌ అండ్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ ఫౌండేషన్‌ వీక్‌ సెలబ్రేషన్‌లో భాగంగా 3 రోజుల వర్క్‌షాప్‌ను గవర్నర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా తమిళిసై మాట్లాడుతూ ఇలాంటి ఆసక్తికరమైన కార్యక్రమాలను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులు ఉన్నత ఉద్యోగాలు పొందడమే కాక ఇతరులకు ఉద్యోగాలు కల్పించేస్థాయికి ఎదగాలన్నారు.

ప్రస్తుత తరం విద్యార్థులు చాలా ప్రతిభావంతులైన, వినూత్నమైన ఆలోచనలు, సాంకేతికతను కలిగి ఉన్నారని, ఇది గొప్ప శుభపరిణామమన్నారు. ప్రతిభావంతులను ప్రోత్సహించడంలో బీవీఆర్‌ మోహన్‌రెడ్డి స్కూల్‌ ఆఫ్‌ ఇన్నోవేషన్‌ కీలకపాత్ర పోషిస్తోందని అభినందించారు. కార్యక్రమంలో సైంట్‌ డెవలప్‌మెంట్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ బీవీఆర్‌ మోహన్‌రెడ్డి, ఐఐటీ–హైదరాబాద్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ బీఎస్‌ మూర్తి, భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ డాక్టర్‌ కృష్ణ ఎం.ఎల్ల, భారతదేశంలోని ప్రముఖ సాంకేతిక సంస్థల నుంచి అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు