టీడీపీలో కాకరేపుతోన్న తిరుగుబాటు నేతల తీరు

3 Apr, 2021 19:35 IST|Sakshi

చంద్రబాబు తీరుపై పార్టీలో తీవ్ర అసంతృప్తి

పలుచోట్ల ప్రచారంలో పాల్గొన్న టీడీపీ సీనియర్‌ నేతలు

సాక్షి, అమరావతి: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేయకూడదన్న చంద్రబాబు నిర్ణయం టీడీపీలో ముసలం పుట్టించింది. చంద్రబాబు నిర్ణయాన్ని ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. టీడీపీలో తిరుగుబాటు నేతల తీరు కాకరేపుతోంది. చంద్రబాబు తీరుపై పార్టీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. పలు చోట్ల ప్రచారంలో టీడీపీ సీనియర్‌ నేతలు పాల్గొన్నారు.

చంద్రబాబుకు వ్యతిరేకంగా...
చంద్రబాబు నిర్ణయానికి వ్యతిరేకంగా విశాఖ పెందుర్తిలో బండారు సత్యనారాయణ ప్రచారం నిర్వహించారు. సబ్బవరంలోనూ బాబు నిర్ణయాన్ని టీడీపీ కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారు. అభ్యర్థులు వెనక్కు తగ్గొద్దని టీడీపీ సీనియర్లు అభ్యర్థిస్తున్నారు. ప్రచారం చేయండి, పార్టీని బతికించుకోవాలంటూ అభ్యర్థిస్తున్నారు. పార్టీ బతకాలంటే పోటీలో ఉండాలని విశాఖ టీడీపీ సీనియర్లు అంటున్నారు. విజయనగరం జిల్లాలో ఒక జెడ్పీటీసీ, 12 ఎంపీటీసీల్లో ప్రచారం నిర్వహించారు. ఓడినా ఫరావాలేదు, పోటీలో ఉంటామని అభ్యర్థులు అంటున్నారు. తప్పుకునే ప్రసక్తే లేదని అశోక్‌ గజపతిరాజు వర్గం అంటున్నారు.

చంద్రబాబుకు ధిక్కరణ..
గుంటూరు జిల్లా మంగళగిరి, దుగ్గిరాలలోనూ బాబుకు ధిక్కరణ ఎదురవుతుంది. చంద్రబాబు, లోకేష్‌ నిర్ణయం సరికాదని టీడీపీ కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తూర్పుగోదావరిలో కొన్ని చోట్ల బాబు నిర్ణయానికి తమ్ముళ్లు తిలోదకాలిచ్చారు. చంద్రబాబు నిర్ణయాన్ని పార్టీలో కొందరు వ్యతిరేకిస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. పార్టీ బీ - ఫారాలు ఇచ్చింది, వెనక్కి తీసుకోలేమన్నారు. పోటీలో ఉన్నవారు ఓటు బ్యాంకు చెదరకుండా చూస్తే తప్పేం లేదంటూ గోరంట్ల వ్యాఖ్యానించారు. పార్టీ కోసం ప్రచారం చేసే పోటీలో ఉన్నవారిపై చర్యలు అవసరం లేదని బుచ్చయ్య చౌదరి అన్నారు.

పార్టీ పుట్టి ముంచడం ఖాయం..
పార్టీకి వ్యతిరేకంగా చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని టీడీపీ సీనియర్‌ నేత జ్యోతుల నెహ్రూ అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ కంటే స్వప్రయోజనాల కోసమే చంద్రబాబు నిర్ణయాలు ఉన్నాయంటూ జ్యోతుల వ్యాఖ్యానించారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేయకూడదన్న నిర్ణయంతో టీడీపీలో పుట్టిన ముసలం ఆ పార్టీ పుట్టి ముంచడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
చదవండి:
టీడీపీలో కల్లోలం‌: జ్యోతుల నెహ్రూ, అశోక్‌ గజపతి అసంతృప్తి
జెండా ఎత్తేసిన చంద్రబాబు

మరిన్ని వార్తలు