శివసేన మాదే.. ఎన్నికల గుర్తు వాళ్లదెలా అవుతుంది?

7 Oct, 2022 18:34 IST|Sakshi

ముంబై: శివసేన పార్టీ ఎన్నికల గుర్తు విల్లు-బాణం మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే వర్గానికి చెందదని ఉద్ధవ్ థాక్రే వర్గం ఎన్నికల సంఘానికి తెలిపింది. ఆ వర్గం వారంతా స్వచ్ఛందంగా పార్టీని వీడి వెళ్లిపోయారని, అలాంటప్పుడు పార్టీ గుర్తు వాళ్లది చెందకూడదని పేర్కొంది.

నవంబర్ 3న మహారాష్ట్రలోని తూర్పు అంధేరి ఉపఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలోనే శివసేన ఎన్నికల గుర్తు ఎవరిదనే విషయంపై వివరణ ఇవ్వాలని ఉద్దవ్ థాక్రే వర్గాన్ని కోరింది ఎన్నికల సంఘం. ఈ గడువు శనివారం వరకు ఉన్నప్పటికీ ఒక రోజు ముందుగానే థాక్రే వర్గం వివరణ ఇచ్చింది.

అంధేరి ఉపఎన్నికలో శివసేన(థాక్రే వర్గం) అభ్యర్థిగా రుతుజా లట్కే బరిలోకి దిగుతున్నారు. ఆమె భర్త రమేశ్ లట్కే మృతితో ఈ ఎన్నిక అనివార్యమైంది. మరోవైపు బీజేపీ అభ్యర్థిగా మున్సిపల్ కార్పోరేటర్ ముర్జి పటేల్ పోటీ చేస్తున్నారు. షిండే వర్గం ఈయనకు మద్దతు తెలుపుతోంది. మిహావికాస్ అఘాడీ మిత్రపక్షాలైన కాంగ్రెస్, ఎన్సీపీలు రుతుజా లట్కేకే మద్దతుగా ఉంటున్నాయి.

సీఎం ఉద్ధవ్ థాక్రేపై తిరుగుబావుటా ఎగురవేసి బీజేపీతో చేతులు కలిపి ఏక్‌నాథ్ షిండే సీఎం అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత థాక్రే వర్గంలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా షిండే గూటికి చేరారు. పార్టీ ఎన్నికల గుర్తు అయిన విల్లు-బాణం కోసం ఈ రెండు వర్గాలు పోరాడుతున్నాయి.
చదవండి: మోదీకి ఎందుకంత భయం.. ఒవైసీ సెటైర్లు

మరిన్ని వార్తలు