మునుగోడులో టీఆర్‌ఎస్‌కు షాక్‌.. జగదీష్‌ రెడ్డి ఎన్నికల ప్రచారంపై నిషేధం

29 Oct, 2022 19:32 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికల సమయం సమీపిస్తున్న వేళ అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి ఊహించని షాక్‌ తగిలింది. మంత్రి, మునుగోడులో టీఆర్ఎస్ స్టార్ క్యాంపెనర్ జగదీశ్వర్ రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం షాక్‌ ఇచ్చింది. మునుగోడులో ఎన్నికల ప్రచారంపై ఎలక్షన్‌ కమిషన్‌ నిషేధం విధించింది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. 

కాగా, ఉత్తర్వుల్లో రానున్న 48 గంటల పాటు జగదీష్‌ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొనరాదంటూ సీఈసీ నిషేధం విధించింది. అయితే, ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినందుకు చర్యలు తీసుకుంటున్నట్టు(ఓటర్లను బెదిరించేలా ప్రసంగాలు చేశారని) ఎన్నికల సంఘం తెలిపింది. ఇక, ఈ ఆదేశాలు శనివారం సాయంత్రం ఏడు గంటల నుంచి అమలులోకి రానున్నట్టు ఎన్నికల కమిషన్‌ ఉత్తర్వుల్లో స్పష్టం​ చేసింది. జగదీష్ రెడ్డి ఎలాంటి పబ్లిక్ మీటింగ్స్, ప్రదర్శనలు, ర్యాలీలు, రోడ్‌ షోల్లో పాల్గొనకూడదని, ఇంటర్వ్యూలు కూడా ఇవ్వకూడదని నిషేధం విధించింది. మరోవైపు.. మునుగోడులో ఉప ఎన్నిక నవంబర్‌ 3వ తేదీన జరుగనుంది.

మరిన్ని వార్తలు