స్టార్‌ వార్‌

18 Nov, 2023 04:40 IST|Sakshi

పలు నియోజకవర్గాల్లో ముఖ్య నేతల ముఖాముఖి పోటీ

కాంగ్రెస్, బీజేపీలోనూ అగ్ర నేతలు బరిలో

అమాత్యుల అదృష్టం ఎలా ఉందో..

పురుషులందు పుణ్యపురుషులు వేరయా అని వేమన శతకంలో చెప్పినట్టు ప్రత్యక్ష ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేయడమంటేనే ఓ ప్రత్యేకత. అందునా కీలక స్థానాల్లో కీలక నాయకులు తలపడి, ఆయా ప్రాంతాల్లో ఆసక్తికర పోరు జరిగితే మరింత ప్రత్యేకత సంతరించుకుంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే కీ ఫైట్‌ కిక్కిస్తుంది. పోటీచేసే కీలక నాయకుల్లో ఎవరు గెలిచినా, ఓడినా వారికి గుర్తింపు వేరేగా ఉంటుంది. ఈ ఎన్నికల్లో 30కి పైగా స్థానాల్లో ఇలాంటి పోటీనే నెలకొంది.

సీఎం కేసీఆర్‌తో పాటు బీఆర్‌ఎస్‌ కీలక నేతలు హరీశ్‌రావు, కేటీఆర్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్, బీజేపీ నుంచి బండి సంజయ్, ఈటల, అర్వింద్, ఎంపీలు ఉత్తమ్, కోమటిరెడ్డి, సీఎల్పీ నేత భట్టి, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌తదితరులు పోటీ చేస్తున్న స్థానాల్లో ఆసక్తికర పోరు జరుగుతోంది. కొన్ని చోట్ల కొంతమందికి విజయం నల్లేరు మీద నడక లాంటిదే అయినా ఇంకొన్ని చోట్ల ద్విముఖ, మరికొన్ని స్థానాల్లో త్రిముఖ పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో కీ ఫైట్‌ ఎక్కడెక్కడ జరుగుతుందో ఒక్కసారి చూద్దాం:  

గజ్వేల్‌లో మరోమారు సీఎం కేసీఆర్‌ పోటీ చేస్తున్నారు. కచ్చితంగా కేసీఆర్‌పై పోటీ చేసి ఆ యన్ను ఓడిస్తానంటూ చాలా కాలంగా చెబు తున్న బీజేపీ నేత ఈటల రాజేందర్‌  ఇక్కడి నుంచి రంగంలోకి దిగారు. కాంగ్రెస్‌ పక్షాన తూంకుంట నర్సారెడ్డి పోటీ చేస్తున్నా పోటీ మాత్రం కేసీఆర్, రాజేందర్‌ల నడుమ సాగనుంది.  

♦ సీఎం కేసీఆర్‌ పోటీ చేస్తోన్న మరో నియోజకవర్గం కామారెడ్డి ఇటీవలి కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. ఇక్కడి సిట్టింగ్‌ ఎమ్మెల్యే గంపా గోవర్దన్‌ను తప్పించి మరీ కేసీఆర్‌ అక్కడి నుంచి బరిలోకి దిగారు. ఈ స్థానం నుంచి కాంగ్రెస్‌ పక్షాన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పోటీ చేస్తుండడంతో ఆసక్తి మరింత పెరిగింది. ఇక్కడి నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్న వెంకటరమణారెడ్డి కూడా గట్టి పోటీ ఇస్తుండడంతో కామారెడ్డిలో త్రిముఖ పోటీ అనివార్యమని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.  

♦ బీఆర్‌ఎస్‌ ట్రబుల్‌ షూటర్‌ హరీశ్‌రావు తనకు భారీ మెజార్టీని ఇచ్చే సిద్ధిపేట నుంచే మరోసారి పోటీ చేస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్‌ నుంచి పూజల హరికృష్ణ, బీజేపీ నుంచి దూది శ్రీకాంత్‌రెడ్డి బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో లక్ష ఓట్లకు పైగా మెజారిటీ వచ్చిన సిద్దిపేట నుంచి హరీశ్‌రావును ఢీ కొనడం అంత ఈజీ కాదంటున్నారు. 

♦ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి గత ఎన్నికల్లో ఓటమి పాలలైన కొడంగల్‌ నుంచే మళ్లీ పోటీ చేస్తున్నారు. ఆయనపై బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి  రమేశ్‌ పోటీ చేస్తున్నా కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల మధ్యనే హోరాహోరీ పోరు ఉంది. 

 బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌. ప్రవీణ్‌కుమార్‌ సిర్పూర్‌ స్థానం నుంచి తొలి సారి పోటీ చేస్తున్నా రు.  బీఆర్‌ఎస్‌ నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, కాంగ్రెస్‌ నుంచి రావి శ్రీనివాస్‌లు కూడా గట్టి పోటీ ఇస్తుండడంతో అక్కడ త్రిముఖ పోటీ నెలకొందనే చెప్పాలి.  

♦ సీఎల్పి నేత మల్లు భట్టి విక్రమార్క మధిర నుంచే మళ్లీ పోటీ చేస్తున్నారు. ఆయనపై పాతకాపు లింగాల కమలరాజ్‌ (బీఆర్‌ఎస్‌) పోటీ చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థి ప్రభావం నామమాత్రమేనని, కాంగ్రెస్‌–బీఆర్‌ఎస్‌ల నడుమ మధిరలో ఆసక్తికర పోరు జరుగుతోంది. 

♦ ఎంపీ .ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మరోమారు హుజూర్‌ నగర్‌ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ బీఆర్‌ఎస్‌  సిట్టింగ్‌ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, బీజేపీ నుంచి చల్లా శ్రీలతారెడ్డి బరిలో ఉన్నారు. ఉత్తమ్‌పై గత ఎన్నికల్లో ఓడిపోయి, ఆయన సతీమణి పద్మావతిపై ఉప ఎన్నికలో గెలిచిన సైదిరెడ్డి మూడోసారి ఎన్నికల బరిలో ఉన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల మధ్యనే పోటీ ఉంది.  

 బీజేపీలోని మరో కీలక నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ తన సొంత నియోజకవర్గమైన హుజూరాబాద్‌నుంచి పోటీ చేస్తున్నారు. ఓటమి ఎరుగని నాయకుడిగా గుర్తింపు పొందిన రాజేందర్‌పై పాడి కౌశిక్‌రెడ్డి (బీఆర్‌ఎస్‌), వొడితల ప్రణయ్‌రావు (కాంగ్రెస్‌) బరిలోకి దిగారు. గత ఉప ఎన్నికల్లోనూ గెలుపొందిన రాజేందర్‌ను ఢీకొట్టి నిలవడం బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లకు సాధ్యమవుతుందా లేదా అన్నది ఫలితాలు వస్తే కానీ తేలే అవకాశం లేదు.  

 నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అరవింద్‌ ఈసారి కోరుట్ల అసెంబ్లీ నుంచి పోటీ చేస్తున్నారు. అసెంబ్లీకి తొలిసారి పోటీ చేస్తున్న ఆయనపై బీఆర్‌ఎస్‌ నుంచి కల్వకుంట్ల సంజయ్, కాంగ్రెస్‌ నుంచి జువ్వాడి నర్సింగరావులు పోటీ చేస్తున్నారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల నుంచి వెలమ సామాజిక వర్గానికి చెందిన నేతలు తలపడుతుండడం, కోరుట్లలో త్రిముఖ పోటీ అనివార్యమవుతోంది.  

 పాలకుర్తిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుపై కాంగ్రెస్‌ పార్టీ నుంచి అతిపిన్న వయస్కురాలైన హనుమాండ్ల యశస్వినిరెడ్డి పోటీ చేస్తున్నారు. ఝాన్సీ రాజేందర్‌రెడ్డి కోడలిగా బరిలో ఉన్న ఆమెతో అపార రాజకీయ అనుభవం ఉన్న దయాకర్‌రావు తలపడుతుండడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని కలిగిస్తోంది. బీజేపీ నుంచి లేగ రామ్మోహన్‌రెడ్డి బరిలో ఉన్నా కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల మధ్యే ద్విముఖ పోటీ నెలకొంది.  

వనపర్తి నుంచి మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి మరోమారు తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఆయనపై కాంగ్రెస్‌ నుంచి మేఘారెడ్డి (మొన్నటి వరకు బీఆర్‌ఎస్‌ ఎంపీపీ), బీజేపీ నుంచి అనుజ్ఞారెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక్కడ గతంలో నిరంజన్‌రెడ్డిని ఓడించిన చిన్నారెడ్డికి మొదట టికెట్‌ ఇచ్చిన కాంగ్రెస్‌ తర్వాత మేఘారెడ్డికి కేటాయించింది. మొన్నటిదాకా ఒకే పార్టీలో ఉన్న మేఘారెడ్డి, నిరంజన్‌రెడ్డిల మధ్య పోరు ఆసక్తిని కలిగిస్తోంది.  

మహబూబ్‌నగర్‌ నుంచి ఎక్సైజ్‌ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ వరుసగా మూడోసారి బరిలోకి దిగారు. గతంలో బీజేపీలో పనిచేసిన మాజీ ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. బీజేపీకి మంచి పట్టు ఉన్న పాలమూరు జిల్లా కేంద్రంలో ఆ పార్టీ నుంచి మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి కుమారుడు మిధున్‌రెడ్డి పోటీ చేస్తుండడంతో ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొందని రాజకీయ వర్గాలంటున్నాయి.  

వీటితో పాటు ప్రస్తుత కేబినెట్‌ మంత్రులు పోటీ చేస్తున్న నియోజకవర్గాలు, గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ పక్షాన గెలిచి ఆ తర్వాత బీఆర్‌ఎస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేలు పోటీ చేస్తున్న స్థానాలు కలిపి రాష్ట్ర వ్యాప్తంగా 30 చోట్లకు పైగా ఆసక్తికర పోరు సాగుతోంది. 
 
♦ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె. తారకరామారావు మళ్లీ సిరిసిల్ల నుంచే రంగంలోకి దిగారు. ఆయనపై పాతకాపు కె.కె. మహేందర్‌రెడ్డి కాంగ్రెస్‌ నుంచి మరోమారు పోటీ చేస్తుండగా, బీజేపీ రాణిరుద్రమను అభ్యర్థిగా నిలిపి ప్రయోగం చేస్తోంది. పోటీ కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల నడుమే ఉంది.

♦ బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మళ్లీ కరీంనగర్‌ నుంచే రంగంలోకి దిగారు. ఇక్కడ ఆయన పాత ప్రత్యరి్థ, మంత్రి గంగుల కమలాకర్‌ (బీఆర్‌ఎస్‌)ను ఢీకొడుతున్నారు. కాంగ్రెస్‌ నుంచి పురుమళ్ల శ్రీనివాస్‌ పోటీ చేస్తున్నారు. ముగ్గురూ మున్నూరుకాపు సామాజికవర్గానికి చెందిన వారే కావడం గమనార్హం. అయితే, పోటీ మాత్రం బీఆర్‌ఎస్, బీజేపీల నడుమ ఉంటుందని చెబుతున్నారు. 

మరో మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నల్లగొండ అసెంబ్లీ స్థానంలో మరోమారు బరిలోకి దిగారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి (బీఆర్‌ఎస్‌)ను ఢీ కొడుతున్నారు. బీజేపీ నుంచి విద్యావేత్త మాదగోని శ్రీనివాస్‌గౌడ్‌ పోటీలో ఉన్నారు. బీఆర్‌ఎస్‌ టికెట్‌ ఆశించిన నల్లగొండ పట్టణ మాజీ అధ్యక్షుడు పిల్లి రామరాజు యాదవ్‌ ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ నుంచి పోటీ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. పోటీ కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల నడుమే ఉండనుంది. 

-మేకల కళ్యాణ్‌ చక్రవర్తి 

మరిన్ని వార్తలు