Kuppam Constituency: కూలిన కుప్పం పచ్చకోట.. ఆందోళనలో చంద్రబాబు!

30 Sep, 2022 10:58 IST|Sakshi

కుప్పం పచ్చకోట కూలిపోతుందా? కుప్పం నా అడ్డా అన్న చంద్రబాబు వేరే దారి చూసుకుంటున్నారా? ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సభ తర్వాత తెలుగు తమ్ముళ్లు తీవ్ర నిరాశలో కూరుకుపోయారా? అక్కడ పచ్చ పార్టీ పని ముగిసిందని భావిస్తున్నారా? ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానం వస్తోంది. కుప్పంలో సీఎం జగన్‌ పర్యటన తర్వాత రాజకీయ సమీకరణాల్లో జరిగిన మార్పులేంటో పరిశీలిస్తే..

చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం ఒకప్పుడు పచ్చ పార్టీకి కంచుకోట. మూడు దశాబ్దాలకు పైగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే కుప్పంకు నాన్‌లోకల్‌గా పేరుపడ్డ చంద్రబాబు ఏనాడు కుప్పం అభివృద్ధి గురించి పట్టించుకోలేదు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ నియోజకవర్గం అభివృద్ధి బాట పట్టింది. రెవెన్యూ డివిజన్‌ ఏర్పడింది. కుప్పం మున్సిపాలిటీ అయింది. చంద్రబాబు ఏలుబడికంటే.. సీఎం జగన్‌ పాలనలోనే తమ జీవితాలు బాగవుతున్నాయని అక్కడి ప్రజలు భావిస్తున్నారు. అందుకే జగన్‌ వచ్చాక జరిగిన ఎన్నికలన్నింటిలో టీడీపీ దారుణ పరాభవాన్ని మూటగట్టుకుంది. 30 సంవత్సరాలు కుప్పం నా అడ్డా అని చెప్పుకు తిరుగుతున్న చంద్రబాబును అక్కడి ప్రజలు తిరస్కరించారు.

ఇక కుప్పంలో నిర్మించుకున్న పచ్చ కోటలన్నీ కుప్పకూలిపోతుండటంతో కళ్లు తెరచిన చంద్రబాబు కొంతకాలం క్రితం అక్కడకు వెళ్లినా ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. దీంతో పచ్చ పార్టీ నేతలు గుండాగిరి కూడా చేయించారు. కుప్పం ప్రజలు తనను మరిచిపోతున్నారనే భయం, ఆందోళన చంద్రబాబులో మొదలయ్యాయి. వారం కిత్రం ముఖ్యమంత్రి జగన్‌ టూర్‌తో ఆ నియోజకవర్గంలో టీడీపీ పతనం పరిపూర్ణం అయిందని పరిశీలకులు భావిస్తున్నారు. వైఎస్‌ జగన్‌ సభకు వచ్చినంత ప్రజలు గతంలో ఏనాడు చంద్రబాబు సభలకు రాలేదని అందరూ ఏకోన్ముఖంగా చెప్తున్నారు. 

కుప్పంను తన సొంత నియోజకవర్గం మాదిరిగా అభివృద్ధి చేస్తానని జగన్‌ ఇచ్చిన హామీతో అక్కడి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం సభ సూపర్‌ సక్సెస్‌ కావడంతో టీడీపీ శ్రేణులు తీవ్ర నైరాశ్యంలో కూరుకుపోయాయి. ఆ ప్రాంతంలో ఎక్కడ చూసిన గత వారం రోజులుగా సీఎం సభ గురించే చర్చ జరుగుతుండటం విశేషం. చంద్రబాబు రాజకీయ జీవితంలో కుప్పంలో నిర్వహించిన సభలకు ఏనాడూ ఇంతమంది జనం హాజరుకాలేదని టీడీపీ కార్యకర్తలు చెప్పకుంటున్నారు. కుప్పంతోనే నా రాజకీయ జీవితం ముడిపడిఉందని చెప్పుకునే చంద్రబాబు ఇప్పుడు ఎలా వ్యవహరిస్తారో చూడాలని టీడీపీ కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు. ఇదే సమయంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం పెరిగింది. నియోజకవర్గంలో నాలుగు మండలాల్లోని నేతలు, కార్యకర్తలు సమరోత్సాహంలో ఉన్నారు. 

గతం కంటే సీఎం సభ తర్వాత వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నేతలు ఉత్సాహంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కుప్పంలో సీఎం సభ సక్సెస్‌ కావడంతో టీడీపీ నాయకుల్లో గుబులు ప్రారంభమైంది. చంద్రబాబు అడ్డాలో వైఎస్సార్‌సీపీ జెండా రెపరెపలాడే పరిస్థితులు కనిపిస్తుండటంతో వచ్చే ఎన్నికల్లో కుప్పం నుంచి పోటీ చేస్తారా? లేదా? అన్నదానిపై టీడీపీ వర్గాల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే కుప్పంతో పాటు మరో సురక్షితమైన నియోజకవర్గాన్ని కూడా చంద్రబాబు వెతుక్కుంటున్నారని పచ్చ పార్టీలో టాక్‌ నడుస్తున్నట్టు సమాచారం.

మరిన్ని వార్తలు